రాజమండ్రి జైలు నుంచి ర్యాలీగా వెళ్తూ అభివాదం చేస్తున్న చంద్రబాబు
సాక్షి, అమరావతి: రోగానికి చికిత్స కోసం ఆస్పత్రికి వెళ్తానంటూ కాళ్లావేళ్లా పడి ఎలాగోలా బయటపడ్డ ఓ వృద్ధ నేత విజయోత్సవాలు నిర్వహించడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది! స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో అరెస్టయి రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న మాజీ సీఎం చంద్రబాబుకు అనారోగ్య కారణాలతో న్యాయస్థానం షరతులతో కూడిన తాత్కాలిక బెయిల్ ఇస్తే నిజం గెలిచిందంటూ టీడీపీ నేతలు నిస్సిగ్గుగా బుకాయించడం విస్తుగొలుపుతోంది! 70 ఏళ్లు పైబడిన ఓ వృద్ధ నేత, రిమాండ్ ఖైదీకి కంటి ఆపరేషన్ చేయించుకునేందుకు మానవతా దృక్పథంతో హైకోర్టు షరతులతో తాత్కాలిక బెయిల్ ఇచ్చింది.
సహజంగా జైల్లో ఉండే ఏ ఖైదీకైనా అనారోగ్య సమస్యలు తలెత్తితే, అత్యవసరంగా సర్జరీ లాంటివి నిర్వహించాల్సి వస్తే న్యాయస్థానం కొన్ని షరతులతో బెయిల్ ఇస్తుంది. ఇప్పుడు కూడా అదే తరహాలో హైకోర్టు చంద్రబాబుకు బెయిల్ ఇచ్చింది. అంతేకానీ ఆయనేమీ శుద్ధపూసగా భావించి క్లీన్‌చిట్ ఇవ్వలేదు. చంద్రబాబుపై స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసు ఇంకా అలాగే ఉంది. అమరావతి ఇన్నర్ రింగు రోడ్డు కుంభకోణం, అసైన్డ్ భూముల దోపిడీ, ఫైబర్‌నెట్ స్కామ్, అక్రమంగా మద్యం డిస్టిలరీలకు లైసెన్సులు ఇచ్చిన కేసులు న్యాయస్థానాల్లో అలాగే ఉన్నాయి.
ఏ కేసులోనూ చంద్రబాబు నేరం చేయలేదని కోర్టు తీర్పు చెప్పలేదు. అయినా సరే చంద్రబాబు, ఆయన బృందం నిజం గెలిచిందంటూ ఊరేగింపులు నిర్వహిస్తూ స్వాతంత్య్ర పోరాటం చేసి జైలు నుంచి విడుదలైనట్లుగా రాద్ధాంతం చేయడంపై ప్రజలు విస్తుపోతున్నారు. ఆపరేషన్ చేయించుకున్నాక నవంబర్ 28వతేదీ సాయంత్రం 5 గంటల్లోపు మళ్లీ జైలు అధికారుల ఎదుట లొంగిపోవాలని కోర్టు స్పష్టంగా చంద్రబాబును ఆదేశించింది. అలాంటప్పుడు ఇందులో నిజం ఎక్కడ గెలిచిందో, ఎలా గెలిచిందో అర్థంకాక సామాన్య ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు.
కార్యకర్తలను తరలించి హడావుడి
అనారోగ్య సమస్యలున్న ఖైదీలకు అత్యంత సాధారణంగా న్యాయస్థానాలు ఇచ్చే బెయిల్‌ను తమ విజయంగా టీడీపీ నేతలు అభివర్ణిస్తుండడంపై సోషల్ మీడియాలో సెటైర్లు వెల్లువెత్తుతున్నాయి. షరతులతో తాత్కాలిక బెయిల్ వస్తుందని ముందే తెలియడంతో రాజమహేంద్రవరానికి టీడీపీ కార్యకర్తలను పెద్దఎత్తున తరలించారు. సెంట్రల్ జైలు పరిసరాలకు చేరుకుని నానా హడావుడి సృష్టించారు. పోలీసులను, బారీకేడ్లను తోసుకుంటూ జైలు వద్దకు వెళ్లే ప్రయత్నం చేశారు. రాజమహేంద్రవరం నుంచి విజయవాడ చేరుకునే వరకు హడావుడి చేసేలా టీడీపీ ముందే ప్రణాళిక రూపొందించింది.
జాతీయ రహదారి మీదుగా చంద్రబాబు ఏ ప్రాంతానికి ఏ సమయంలో వస్తారో రూట్‌మ్యాప్, షెడ్యూల్ కూడా ఆ పార్టీ విడుదల చేసింది. ప్రతిచోటకూ కార్యకర్తలు, నాయకులు రావాలంటూ పార్టీ కార్యాలయం నియోజకవర్గ ఇన్‌ఛార్జిలకు సమాచారం ఇచ్చింది. ఇతర జిల్లాల నుంచి కూడా కార్యకర్తలను తీసుకువచ్చారు. కాన్వాయ్‌ను నెమ్మదిగా పోనిస్తూ ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని, ఆయన్ను చూసేందుకు ఎగబడుతున్నారని ప్రచారం హోరెత్తించారు. వాస్తవానికి చంద్రబాబును చూడడానికి సాధారణ ప్రజలు ఏమాత్రం ఆసక్తి చూపలేదు.
ఆది నుంచి డ్రామాలే
చంద్రబాబు అరెస్టయిన నాటి నుంచి ఆయనతోపాటు టీడీపీ నేతలంతా నిజాలను దాచి కేవలం అబద్ధాలను ప్రచారం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. స్కిల్ స్కామ్‌లో అవినీతి జరిగిందా? లేదా? అనే ప్రశ్నకు సూటికి సమాధానం చెప్పకుండా చంద్రబాబు ఐటీకి ఆద్యుడని, 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారని, నిప్పని, ఆయన లేకపోతే రాష్ట్రమే లేదనే తరహాలో ప్రచారాలకు దిగారు.
కోర్టుల్లో మాత్రం చంద్రబాబు 70 ఏళ్ల వయసు పైబడిన వారని, అనారోగ్య సమస్యలున్నాయనే కారణాలతో బెయిల్ అడుగుతూ వచ్చారు. ఇందుకోసం చంద్రబాబు కుటుంబం రోజుకో కొత్త డ్రామాను తెరపైకి తెచ్చింది. ఆయన జైలుకు వెళ్లిన మొదట్లో స్నానానికి వేడి నీళ్లు ఇవ్వడంలేదని, దోమలు కుడుతున్నాయనే అర్థం లేని ఆరోపణలు చేసి అబాసుపాలయ్యారు. చంద్రబాబు ఉన్న బ్యారక్‌లోకి సీఎం జగన్ కావాలని దోమలను పంపి ఆయన అనారోగ్యం పాలయ్యేలా చేస్తున్నారంటూ వాదనలు కూడా చేసి ప్రజల్లో చులకనయ్యారు.
వీటిని చూసి జనం నవ్వుకోవడంతో బాబుకు చర్మ సమస్యలున్నాయని, దద్దుర్లు వస్తున్నాయని, జైల్లో సరైన వైద్యం అందించడం లేదంటూ మరో ఎత్తుగడ వేశారు. వైద్యులు ఆయనకు ఎప్పటికప్పుడు పరీక్షలు చేస్తూ టీడీపీ చెబుతున్న వాటిల్లో నిజం లేదని స్పష్టం చేయడంతో మరో నాటకానికి తెర తీశారు. జైల్లో గంజాయి స్మగ్లర్లు, నక్సలైట్లు ఉన్నారని, వారి నుంచి బాబుకు ప్రాణహాని ఉందంటూ కొన్నిరోజులు హంగామా నడిపారు. చంద్రబాబును చంపేస్తామంటూ నక్సలైట్లు పోలీసులకు లేఖ రాశారని, జైల్లో డ్రోన్లు ఎగరేస్తున్నారని పసలేని ప్రచారాలు చేశారు.
తొలిరోజే కోర్టు ఆదేశాలు బేఖాతర్
తమ అధినేతను అన్యాయంగా జైల్లో పెట్టారు, ఆధారాలు లేవంటూ రోజూ డ్రామాలతో కాలం గడపడమే కానీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో జరిగిన అవినీతిపై ఒక్క ప్రశ్నకు కూడా చంద్రబాబు కుటుంబసభ్యులు, టీడీపీ నేతలు సమాధానం చెప్పలేకపోయారు. కోర్టుల్లోనూ తమ అధినేత గొప్పతనం, అనారోగ్యం, గవర్నర్ అనుమతి తీసుకోకుండా అరెస్టు చేశారనే వాదనలు వినిపించారు. అంతేకానీ చంద్రబాబు అవినీతి చేయలేదని ఎక్కడా ఒక్కసారి కూడా ఆయన న్యాయవాదులు చెప్పలేదు. చివరికి ఆయన కంటికి కేటరాక్ట్ ఆపరేషన్ చేయించాలని వైద్యులిచ్చిన ఓ నివేదికను చూపించి కనికరించి బెయిల్ ఇవ్వాలని వేడుకున్నారు.
ఇన్ని డ్రామాల తర్వాత ఎట్టకేలకు కోర్టు ఆయన వయసు, అనారోగ్య సమస్యలను పరిగణలోకి తీసుకుని షరతులతో కూడిన తాత్కాలిక బెయిల్ మంజూరు చేసింది. దీన్ని గొప్ప విజయంగా, నిజం గెలిచిందని, ధర్మం నిలబడిందని చెప్పుకుంటూ చంద్రబాబును ఊరేగింపుగా తరలించడంపై ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. కాగా తాత్కాలిక బెయిల్‌పై విడుదలైన చంద్రబాబు తొలిరోజే హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘించారు. ర్యాలీలు, రాజకీయ ప్రసంగాలు చేయవద్దని న్యాయస్థానం ఆదేశించినా ఖాతరు చేయలేదు. జైలు నుంచి బయటకు రాగానే మైకు అందుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment