ఇన్నేళ్లలో పక్కా ఇళ్లు ఎందుకు ఇవ్వలేదు సారూ అంటూ వీర్నమలకు చెందిన అమ్మాయమ్మ.. మీ పాలనలో ఉపాధి అవకాశాలు కల్పించకుండా ఇప్పుడు మాట్లాడుతున్నారా అంటూ ఓ యువకుడి నిలదీత.. మంత్రి పెద్దిరెడ్డి ఉన్నంత వరకు కుప్పంలో గెలిచే పరిస్థితే లేదంటూ భూపతి అనే టీడీపీ కార్యకర్త స్పష్టీకరణ.. ఇవీ కుప్పం పర్యటనలో ప్రతిపక్ష నేత చంద్రబాబుకు ఎదురైన తిరస్కారాలు. మళ్లీ టీడీపీ ప్రభుత్వం వస్తే పక్కా ఇళ్లు కట్టిస్తానని, పరిశ్రమలు తీసుకువచ్చి ఉపాధి కల్పిస్తానని, అధికారంలోకి వచ్చాక అందరి సంగతీ తేలుస్తానని చెప్పి తప్పించుకోవాల్సిన దుస్థితి నలభై ఏళ్ల రాజకీయ అనుభవజ్ఞుడిగా ఘనత వహించిన చంద్రబాబుకు ఏర్పడింది. (చదవండి: ‘ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం.. రామోజీరావు దిగజారిపోయారు’ )
సాక్షి,పలమనేరు(చిత్తూరు): కంచుకోటలా భావించిన కుప్పం నియోజకవర్గంలో వరుస ఓటములతో ఘోర పరాభవం ఎదురవడంతో చంద్రబాబు డైలమాలో పడ్డారు. ఈ పర్యాయం కుప్పం నుంచి చంద్రబాబు పోటీ చేయరనే ప్రచారం ముమ్మరం కావడంతో తాను బరిలోనే ఉన్నానని చెప్పేందుకే మూడు రోజుల పర్యటన పెట్టుకున్నట్లు తమ్ముళ్లు గుసగుసలాడుకుంటున్నారు. గడ్డు పరిస్థితిని అధిగమించి తిరిగి పట్టు సాధించడం కోసం కుప్పంలో ఆయన గురువారం నుంచి పర్యటన ప్రారంభించారు. కుప్పం మండలంలోని దేవరాజపురం, రామకుప్పం మండలంలోని ఆరిమానుపెంట, వీర్నమల, వీర్నమల తాండా, గట్టూరు తాండా, రామాపురం తాండా, ననియాల తదితర గ్రామాల్లో ప్రసంగించారు. కేవలం కార్యకర్తల్లో మనోధైర్యం నింపేందుకే తన ప్రసంగాల్లో ప్రాధాన్యమిచ్చారు. ప్రతి చోటా రెచ్చగొట్టేలా మాట్లాడడం గమనార్హం.
నక్కిన నాయకులు!
కుప్పం పురపాలక ఎన్నికల్లో పార్టీ ఓటమికి ముఖ్యనేతలే కారణమని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. తన ప్రసంగాల్లో పదే పదే ఈ విషయమే ప్రస్తావించారు. కీలక నాయకులు వైఎస్సార్‌సీపీ అమ్ముడుపోయారని, అలాంటి వారిని ఏరిపారేసేందుకే వచ్చానని చెప్పుకొచ్చారు. బాబు ప్రసంగాలు విన్న మాజీ ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు, కుప్పం ఇన్‌చార్జి మునిరత్నం, పీఏ మనోహర్ సైతం మీటింగ్ ప్రాంతాల్లో కనపడకుండా దూరంగా తచ్చాడుతూ కనిపించారు.
బోరు కొట్టిన ప్రసంగాలు
చంద్రబాబు తన రొటీన్ ప్రసంగాలతో ప్రజలకు విసుగు తెప్పించారు. చెప్పిందే చెబుతూ ఉండడంతో సభలకు హాజరైన వారు బోరు ఫీలయ్యారు. ఈ విషయం గ్రహించిన బాబు అక్కడకు వచ్చిన వారికి మైక్ ఇచ్చి మాట్లాడించారు. ఇది కూడా ఆయనకు తిరగబడింది. మైక్ అందుకున్న వారు ప్రశ్నలు, విమర్శలతో ఉక్కిరిబిక్కిరి చేయడంతో బాబు అసహనం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment