కొటియా ప్రజలను ఆంధ్రాలో ఓటు వేయకుండా అడ్డుకుంటున్న ఒడిశా పోలీసులు
సాక్షి ప్రతినిధి, విజయనగరం: ఎన్నో ఏళ్లుగా తేలని సరిహద్దు వివాదాలతో అక్కడి గిరిజనులు నలిగిపోతున్నారు. ఆంధ్ర వైపే ఉంటాం.. ఒడిశా ‘గుర్తింపు’ ఒద్దు మొర్రో అంటున్నా ఒడిశా సర్కారు నిరంకుశంగా వ్యవహరిస్తోంది. వారి ప్రాథమిక హక్కులనూ అణచివేస్తోంది. ఆంధ్ర–ఒడిశా సరిహద్దులోని కొటియా గ్రూప్ గ్రామాలకు చెందిన 4,549 మంది గిరిజనుల వ్యధార్థ గాధ ఇది. ఈ ప్రాంతంపై ఒడిశా ఎందుకు పెత్తనం చెలాయిస్తోంది.. ఇక్కడి గిరిజనులు ఎందుకు ఏపీ వైపు మొగ్గు చూపుతున్నారంటే..
దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాం నుంచి అందుతున్న సంక్షేమ, అభివృద్ధి ఫలాలతో ఇక్కడి గిరిజనులు ఆంధ్ర ప్రాంతం వైపే ఆసక్తి చూపడం ప్రారంభించారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక ఈ ప్రాంతాన్ని పూర్తిగా విస్మరించింది. మళ్లీ మహానేత తనయుడు వైఎస్ జగన్ సీఎం అయ్యాక అక్కడి ప్రజలకు కొత్త జీవితం మొదలైంది. పింఛన్లు, రైతుభరోసా, అమ్మఒడి వంటి సంక్షేమ పథకాలు వారికి చేరువయ్యాయి. ఆర్‌ఓఎఫ్‌ఆర్ పట్టాలు అందించేందుకు కూడా రంగం సిద్ధమైంది. ఆ గ్రామాల్లో రెండు రాష్ట్రాలకు చెందిన 24 ప్రభుత్వ పాఠశాలలున్నా.. పిల్లలంతా తెలుగు పాఠశాలల్లోనే చదువుకుంటున్నారు. వీరికి రెండు రాష్ట్రాల ఓటు హక్కు ఉంది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఒకేసారి ఒడిశా, ఆంధ్రాలో ఎన్నికలు జరగడంతో ఇక్కడ ఓటేయడానికి అవకాశం లేకుండాపోయింది. కానీ, ఇటీవల ఏపీలో జరిగిన పంచాయతీ ఎన్నికలను అడ్డుకోవాలని ఒడిశా యత్నించగా అది ఫలించలేదు. గంజాయిభద్ర, పగులుచెన్నూరు, చెన్నూరు పంచాయతీలు వైఎస్సార్‌సీపీ మద్దతుదారులే గెలుపొందారు. తాజాగా.. పరిషత్ ఎన్నికల్లో కొటియా ప్రజలు ఓటేయకుండా అడ్డుకోవాలని ఒడిశా సర్కారు యత్నించింది. అయినా, ఏపీ సీఎంపై అభిమానంతో ఒడిశా పోలీసులను తోసుకుంటూ వచ్చి పోలింగ్‌లో పాల్గొన్నారు. ఒడిశా ఇచ్చిన రేషన్‌కార్డులు, ఓటరు కార్డులు, ఆధార్ కార్డులు తిరిగి ఇచ్చేస్తామని, ఒడిశా సంక్షేమ పథకాలేమీ తమకు వద్దని తెగేసి చెబుతున్నారు.
ఆధార్, రేషన్ కార్డులు ఇచ్చేస్తాం
ఒడిశా ప్రభుత్వం మాకిచ్చిన ఆధార్, రేషన్‌కార్డులను వెనక్కి ఇచ్చేస్తాం. మేం ఆంధ్రా ప్రభుత్వంలోనే ఉండాలని కోరుకుంటున్నాం. ఆంధ్రాలో సీఎం వైఎస్ జగన్ పాలన చాలా బాగుంది.
– ప్రసాదరావు, దొర్లతాడివలస
ఒడిశా ఒత్తిడి ఎందుకంటే..
కొటియా పల్లెలు అపార ఖనిజ సంపదకు నిలయాలు. ఇక్కడి కొండల్లో బంగారంతో పాటు మాంగనీస్, ఇనుప ఖనిజం, రంగురాళ్లు వంటి విలువైన నిక్షేపాలున్నాయి. వీటి విలువ కొన్ని లక్షల కోట్ల రూపాయల్లో ఉంటుంది. వీటిని దక్కించుకునేందుకు ఒడిశా కుట్ర పన్నుతోంది. అందుకే ఆ గ్రామాల ప్రజలపై పెత్తనానికి యత్నిస్తోంది. ఈ పల్లెలకు సంబంధించిన సరిహద్దు వివాదం ప్రస్తుతం పార్లమెంట్ పరిధిలో ఉంది. అధిక శాతం ప్రజల అభీష్టం మేరకే వారిని ఏ రాష్ట్రానికి ఇవ్వాలనే దానిపై పార్లమెంట్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
కొటియా గ్రామాల్లో ఏపీ సర్కారు అందిస్తున్న సంక్షేమ పథకాల వివరాలు..
► ఉన్నతి పథకం ద్వారా 23 మందికి రూ.10.40 లక్షలు
► 49 సంఘాలకు వ్యక్తిగత రుణాలు రూ.92.60 లక్షలు
► ప్రమాద బీమా ద్వారా 36 మందికి రూ.8.15 లక్షలు
► ఆరోగ్యశాఖ ద్వారా 7 వేల దోమ తెరలు పంపిణీ
► 714 మందికి ప్రతినెలా రూ.4,87,504 విలువ చేసే పౌష్టికాహారం
► అమ్మఒడి పథకం ద్వారా 264 మంది తల్లులకు లబ్ధి
► 508 మందికి పింఛన్లు.. 205 మంది రైతులకు 606.10 ఎకరాలపై సాగుహక్కు కల్పిస్తూ ఆర్‌ఓఎఫ్‌ఆర్ పట్టాలు మంజూరు
ఆంధ్రాలోనే ఉంటాం
ఆంధ్రాలో సంక్షేమ పాలనతో మమ్మల్ని అన్ని విధాలుగా సీఎం జగన్, స్థానిక ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర ఆదుకుంటున్నారు. కోవిడ్ కారణం చూపుతూ ఎన్నికల్లో మమ్మల్ని నిర్బంధించే ప్రయత్నం చేయడం బాధించింది. మేం ఆంధ్రాలోనే ఉంటాం.
– గమ్మెల బీసు, మాజీ సర్పంచ్, గంజాయిభద్ర
త్వరలో ‘ఆర్‌ఓఎఫ్‌ఆర్’ పట్టాలు
కొటియా గ్రామాల్లో ఆంధ్రా తరఫున సంక్షేమ కార్యక్రమాలు అందిస్తున్నాం. ఒడిశా అభివృద్ధి పనులను మేం అడ్డుకోవడంలేదు. కానీ, ఆ ప్రాంతంపై వారికి మాత్రమే హక్కు ఉందన్నట్లు ఒడిశా ప్రవర్తిస్తోంది. త్వరలోనే కొటియా గిరిజనులందరికీ ఆర్‌ఓఎఫ్‌ఆర్ పట్టాలు అందించడానికి ఏర్పాట్లుచేస్తున్నాం.
– ఆర్. కూర్మనాథ్, ఐటీడీఏ పీఓ, పార్వతీపురం
Comments
Please login to add a commentAdd a comment