చిత్తూరులో బంద్ నేపథ్యంలో నిర్మానుష్యంగా మారిన ఆర్టీసీ బస్టాండ్
సాక్షి, చిత్తూరు: పుంగనూరు వద్ద చంద్రబాబు సమక్షంలో టీడీపీ విధ్వంసకాండ సృష్టించడం ద్వారా పలువురు పోలీసులను గాయపరచి, ప్రజలను భయభ్రాంతులకు గురిచేయడాన్ని నిరసిస్తూ శనివారం చిత్తూరు జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన బంద్ విజయవంతమైంది. శుక్రవారం చంద్రబాబు రెచ్చగొట్టడం వల్లే అన్నమయ్య జిల్లా అంగళ్లు, చిత్తూరు జిల్లా పుంగనూరులో పచ్చదండు రెచ్చిపోయి పోలీసులపై దాడులకు తెగబడటం.. పదుల సంఖ్యలో పోలీసు అధికారులు, సిబ్బందికి రక్తగాయాలవ్వడం తెలిసిందే.
ఈ నేపథ్యంలో టీడీపీ దౌర్జన్యాలు నిరసిస్తూ పోలీసులకు మద్దతుగా శనివారం వైఎస్సార్‌సీపీ చిత్తూరు జిల్లా బంద్‌కు పిలుపునిచ్చింది. ఉదయం నుండి సాయంత్రం వరకు జిల్లాలోని ఏడు నియోజవర్గాల్లో చిత్తూరు, కుప్పం, పలమనేరు, పుంగనూరు, పూతలపట్టు, జీడీ నెల్లూరు, నగరిలో బంద్ అనుకున్న స్థాయి కంటే విజయవంతంగా ముగిసింది. వ్యాపారులు, దుకాణదారులు స్వచ్ఛందంగా షాపులు మూసివేసి బంద్‌కు సహకరించారు.
జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు పాదయాత్రలు, బైక్ ర్యాలీలు, నిరసన కార్యక్రమాలతో చంద్రబాబు కుట్రను ఎండగట్టారు. జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో చంద్రబాబు దిష్టిబొమ్మలు దహనం చేశారు. జిల్లాలోని మొత్తం ఐదు డిపోల్లో 371 బస్సులు డిపోలకు పరిమితయ్యయాయి. ముందు జాగ్రత్తగా శుక్రవారం రాత్రి 11 గంటల నుండి బస్సులను డిపోలకే పరిమితం చేశారు. అత్యవసర సర్వీసులకు బంద్‌లో మినహాయింపు ఇచ్చారు. సాయంత్రం 4 గంటల నుండి ఆర్టీసీ బస్సులు తిరిగి రోడ్డెక్కాయి.
పోలీసులను పరామర్శించిన మంత్రి పెద్దిరెడ్డి
టీడీపీ అల్లరి మూక చేతిలో తీవ్రంగా గాయపడి చిత్తూరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పోలీసు అధికారులు, సిబ్బందిని శనివారం ఉదయం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పరామర్శించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించే ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ సగిలి షణ్మోహన్, జిల్లా ఎస్పీ రిషాంత్‌రెడ్డిని ఆదేశించారు.
అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ పుంగనూరు, అంగళ్ల దాడులకు పూర్తి బాధ్యత చంద్రబాబుదేనన్నారు. రాష్ట్రంలో ఎలాగూ గెలవకపోయినా, చంద్రబాబుకు కుప్పంలో ఓటమి భయం పట్టుకుందని, అందుకే ఇలాంటి కుట్రలు, కుతంత్రాలకు బరితెగించారని విమర్శించారు. షాట్ గన్, కత్తులు, కటార్ల వంటి మారణాయుధాలతో ర్యాలీ నిర్వహించడం చంద్రబాబు దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు.
‘ఈనాడు’ నైజం బట్టబయలు
వైఎస్సార్‌సీపీ నాయకుడికి టీడీపీ ముసుగేసిన వైనం
కురబలకోట: చంద్రబాబు రెచ్చగొట్టే వ్యాఖ్యలతో చోటుచేసుకున్న గొడవలో శుక్రవారం కురబలకోట మండలంలోని అంగళ్లుకు చెందిన వైఎస్సార్‌సీపీ నేత అర్జున్‌రెడ్డి టీడీపీ దాడిలో తీవ్రంగా గాయపడ్డాడు. అయితే శనివారం ఈనాడు దినపత్రిక పతాక శీర్షికలో అర్జున్‌రెడ్డిని టీడీపీ కార్యకర్తగా పేర్కొంటూ ఫొటో ప్రచురించింది. రక్తమోడుతున్న టీడీపీ కార్యకర్త అని ప్రచారం చేసింది.
దాడిలో దెబ్బలు తిన్నది వైఎస్సార్‌సీపీ నాయకుడైతే నిస్సిగ్గుగా టీడీపీ కార్యకర్త అని దుష్ప్రచారం చేయడం ఈనాడు రామోజీకే చెల్లిందని అంగళ్లు ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అర్జున్‌రెడ్డి మాట్లాడుతూ తనను టీడీపీ కార్యకర్తగా ప్రచురించడం ఈనాడు తన ‘పచ్చ’పాతాన్ని చాటుకుందన్నారు. తాను తొలి నుంచి వైఎస్సార్‌సీపీ వీరాభిమానినన్నారు. కాగా, శనివారం అర్జున్‌రెడ్డిని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, తంబళ్లపల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి పరామర్శించారు. పార్టీ అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు.
పూతలపట్టులో టీడీపీ దౌర్జన్యం
బంద్‌లో భాగంగా పూతలపట్టు నడిబొడ్డున ఎమ్మెల్యే ఎంఎస్ బాబు శాంతియుతంగా నిరనన తెలిపారు. అయితే కూడలి ప్రాంతంలో తమ ప్లెక్సీలు చించేశారనే నెపంతో టీడీపీ నేతలు అక్కడికి భారీగా చేరుకున్నారు. బూతులు తిడుతూ ‘రండి రా.. చూసుకుందాం..’ అంటూ రెచ్చగొట్టారు. ఫ్లెక్సీలకు కట్టిన కర్రలు చేతబట్టుకుని దాడి చేసేందుకు యత్నించారు. ఎమ్మెల్యే ఎంఎస్ బాబు, వందలాది మంది వైఎస్సార్‌సీపీ శ్రేణులు బాధ్యతతో సంయమనం పాటించారు. అంత డీఎస్పీ శ్రీనివాసమూర్తి, సిబ్బందితో కలిసి అక్కడికి చేరుకుని టీడీపీ నేతలను అక్కడి నుండి పంపించారు.
Comments
Please login to add a commentAdd a comment