Punganur Violence
-
టీడీపీ నేతల ముందస్తు బెయిల్ పిటిషన్ల తిరస్కరణ
మదనపల్లె: ఉమ్మడి చిత్తూరు జిల్లా అంగళ్లు, పుంగనూరులలో ఆగస్టు 4న చంద్రబాబు పర్యటన సందర్భంగా జరిగిన అల్లర్ల ఘటనలో నమోదైన కేసులకు సంబంధించి పరారీలో ఉన్న 13 మంది టీడీపీ నేతలు పెట్టుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్లను తిరస్కరిస్తూ రెండో ఏడీజే కోర్టు న్యాయమూర్తి అబ్రహాం గురువారం తీర్పునిచ్చారు. అంగళ్లు, పుంగనూరు ఘటనలకు సంబంధించి నమోదైన కేసుల్లో 106 మందిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. వీరి బెయిల్ పిటిషన్లను ఇదివరకే కోర్టు తిరస్కరించింది. కాగా, అరెస్ట్ కాకుండా అజ్ఞాతంలో ఉన్న 13 మంది ముందస్తు బెయిల్‌కు సంబంధించి ఆగస్టు 29న రెండో ఏడీజే కోర్టులో విచారణ జరిగింది. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పును 31వ తేదీకి వాయిదా వేశారు. చదవండి: బాబు ష్యూరిటీనా.. నమ్మేదెలా? -
బయటపడ్డ పుంగనూరు మర్డర్ ప్లాన్: అంతా ‘సార్’ చెప్పినట్లే..
చిత్తూరు అర్బన్: చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణంలో పోలీసులను చంపాలన్న కుట్ర, వాహనాలను తగులబెట్టడం, వ్యూహ ప్రతివ్యూహాలన్నీ ‘సార్’కు తెలిసే జరిగాయా? ఈ విధ్వంసకాండతో సొంత పార్టీ కార్యకర్తల్ని సైతం బలిదానం తీసుకోవాలని ‘సార్’ నుంచి ఉత్తర్వులు వచ్చాయా? పోలీసులు కేసు పెడితే కోర్టులో కాపాడే విషయం కూడా ‘సార్’ చూసుకుంటారని స్పష్టమైన హామీ లభించిందా? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు అవుననే సమాధానం వినిపిస్తోంది. ఈనెల 4వ తేదీన పుంగనూరు వద్ద జరిగిన విధ్వంసకాండతో పదుల సంఖ్యలో పోలీసులపై హత్యాయత్నం జరగడం, వాహనాలు తగులబెట్టిన కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న పుంగనూరు టీడీపీ ఇన్చార్జ్ చల్లా బాబు పరారీలో ఉండగా.. ఇతని డ్రైవర్ కలకడ నవీన్‌కుమార్, మరో ఇద్దరు నిందితులు దోవల అమర్నాథ్, సి.పెద్దన్నలను మంగళవారం పోలీసులు అరెస్టు చేశారు. చల్లా బాబు డ్రైవర్‌ను పోలీసులు విచారించగా ఈ కుట్రలకు సంబంధించిన పూర్తి ప్లాన్‌ను విస్పష్టంగా వివరించినట్లు తెలుస్తోంది. నిందితుడి నేర ఒప్పుదల వాంగ్మూలంలో పలు విషయాలను పూస గుచ్చినట్లు చెప్పేశాడని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. 1వ తేదీ : కుట్రకు రూపం ఈ నెల 4వ తేదీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు పర్యటన పుంగనూరు బైపాస్ మీద వెళ్లాల్సి ఉండగా.. అనుమతి లేకున్నా పుంగనూరు పట్టణంలోకి వెళ్లడానికి టీడీపీ నేతలు పట్టుపట్టడం, ఆపై పోలీసులను చంపాలని విధ్వంసకాండ సృష్టించగా ఓ పోలీసు కంటిచూపు పోగొట్టుకోగా, పదుల సంఖ్యలో పోలీసులకు తలలు పగిలి రక్త గాయాలైన విషయం తెలిసిందే. ఈ కుట్రకు ఈనెల 1వ తేదీనే టీడీపీ పెద్దల నుంచి ఆదేశాలు వచ్చినట్లు తెలుస్తోంది. ఆ రోజు ఉదయం చల్లా బాబు, ఇతని పీఏ గోవర్దన్‌రెడ్డి, డ్రైవర్ నవీన్‌కుమార్ ముగ్గురూ రొంపిచెర్ల నుంచి పుంగనూరుకు కారులో బయలుదేరారు. కొద్ది దూరం వెళ్లగానే చల్లా బాబు ఫోన్లో మాట్లాడటం మొదలుపెట్టాడు. ‘సరే సార్.. సరే సార్.. మీరు చెప్పినట్లే చేస్తాను. బీరు బాటిళ్లు, కర్రలు, రాళ్లు అన్నీ అక్కడ డంప్ చేస్తాం. మిమ్మల్ని టౌన్లోకి రానివ్వమంటూ పోలీసులు చెప్పగానే మనవాళ్లు దాడి చేస్తారు. పోలీసులను కానీ, అవసరమైతే వైసీపీ వాళ్లపై దాడి చేసి చంపైనా సరే మీరు చెప్పినట్లే పోగ్రాం పెట్టిస్తా సార్..’ అని మాట్లాడినట్లు సమాచారం. మరుసటి రోజు తన ఇంటి వద్ద జరిగే అతి ముఖ్యమైన సమావేశానికి పిలవాల్సిన కొందరి పేర్లను గోవర్దర్రెడ్డి, నవీన్‌కుమార్‌కు చల్లా బాబు అప్పగించాడు. 2వ తేదీ : వ్యూహ రచన రొంపిచెర్ల మండలం బొమ్మయ్యగారి పల్లె పంచాయతీ, గర్నిమిట్టవారిపల్లెలోని చల్లా బాబు ఇంటి వద్ద టీడీపీలోని ముఖ్యమైన నాయకులతో రహస్య సమావేశం నిర్వహించారు. టీడీపీకి చెందిన హేమంత్‌రెడ్డి, మోహన్‌నాయుడు, నగేష్, రమేష్‌రెడ్డి ఇంకా పలువురు ముఖ్య నేతల్ని పిలిపించిన చల్లా బాబు మాట్లాడటం మొదలుపెట్టాడు. ఇందులో రాళ్లు, మద్యం బాటిళ్లు, టపాకాయ బాంబులు, కర్రలు ఎక్కడ డంప్ చేయాలో చెప్పాడు. పోలీసులు కాల్పులు ఓపెన్ చేసేలా ఎలా రెచ్చగొట్టాలో ఆదేశాలిచ్చాడు. ఒకరిద్దరు ఖాకీల ప్రాణాలు పోతే.. టీడీపీ కార్యకర్తలు చేసే బలిదానం వల్ల పార్టీ మైలేజ్ పెరుగుతుందని నమ్మబలికాడు. ఇదే జరిగితే రాష్ట్రంలో అధికార పార్టీకి జరిగే డ్యామేజ్, టీడీపీకి వచ్చే మైలేజ్ గురించి వివరించాడు. ఎవరెవరు ఏ పనులు చేయాలో అప్పగించి, అంతా అనుకున్న ప్లాన్ ప్రకారం జరగాలని చల్లా బాబు ఆదేశించాడని సమాచారం. 3వ తేదీ : వ్యూహం అమలుపై ప్లాన్ చల్లాబాబు మరికొంత మంది టీడీపీ నాయకుల్ని తన ఇంటి వద్దకు పిలిపించాడు. పుంగనూరు విధ్వంసకాండ ఎలా చేయాలి? పోలీసులను ఎలా చంపాలి? ఖాకీలు ఫైర్ ఓపెన్ చేసేలా రెచ్చగొట్టే విధానం? ఆపై జరిగే అల్లర్లలో ఎవరెవరి పాత్ర ఏమిటనే ప్లాన్ గురించి చెప్పాడు. 4వ తేదీ : వ్యూహం అమలు ఉదయం 10 గంటలు కావస్తోంది. చల్లా బాబు అంగళ్లుకు వెళ్లారు. అక్కడ చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యాడు. ఇద్దరూ కొద్దిసేపు మాట్లాడుకున్నారు. ఆపై చల్లా బాబు, అతని పీఏ గోవర్దన్‌రెడ్డి, డ్రైవర్ నవీన్‌కుమార్‌తో కలిసి కారులో పుంగనూరు బయలుదేరారు. కారు మదనపల్లె దాటిన తర్వాత.. ‘వీఐపీ కంటే మనం ముందుండాలి.. అక్కడ ఏం చేయాలో ముందుగా అనుకున్నట్లే అంతా జరగాలి’ అని గోవర్దన్రెడ్డిని చల్లా బాబు ఆదేశించాడు. ‘అన్నా.. ఇదే జరిగితే పెద్ద గొడవలు జరుగుతాయి. పోలీసులు మనపై కేసులు పెడతారు. ఎట్టా అన్నా..’ అని గోవర్దన్‌రెడ్డి, చల్లా బాబును ప్రశ్నించినట్లు తెలిసింది. ‘పోలీసులు పెట్టే కేసుల్ని కోర్టులో మన ‘సార్’ చూసుకుంటాడు..’ అని చల్లా బాబు భరోసా ఇచ్చాడు. ఆపై జరిగిన విధ్వంసకాండలో చల్లా బాబు దగ్గరుండి మరీ టీడీపీ నేతల్ని రెచ్చగొట్టి.. పోలీసులను చంప్రేయండ్రా అంటూ, వాళ్ల వాహనాలను తగులబెట్టాలంటూ ఆదేశాలు ఇచ్చాడు. -
చంద్రబాబు సూచన మేరకే పుంగనూరు వద్ద విధ్వంసకాండ
-
టీడీపీ తీరుపై సర్వత్రా ఆగ్రహం
సాక్షి, చిత్తూరు: పుంగనూరు వద్ద చంద్రబాబు సమక్షంలో టీడీపీ విధ్వంసకాండ సృష్టించడం ద్వారా పలువురు పోలీసులను గాయపరచి, ప్రజలను భయభ్రాంతులకు గురిచేయడాన్ని నిరసిస్తూ శనివారం చిత్తూరు జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన బంద్ విజయవంతమైంది. శుక్రవారం చంద్రబాబు రెచ్చగొట్టడం వల్లే అన్నమయ్య జిల్లా అంగళ్లు, చిత్తూరు జిల్లా పుంగనూరులో పచ్చదండు రెచ్చిపోయి పోలీసులపై దాడులకు తెగబడటం.. పదుల సంఖ్యలో పోలీసు అధికారులు, సిబ్బందికి రక్తగాయాలవ్వడం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీడీపీ దౌర్జన్యాలు నిరసిస్తూ పోలీసులకు మద్దతుగా శనివారం వైఎస్సార్సీపీ చిత్తూరు జిల్లా బంద్‌కు పిలుపునిచ్చింది. ఉదయం నుండి సాయంత్రం వరకు జిల్లాలోని ఏడు నియోజవర్గాల్లో చిత్తూరు, కుప్పం, పలమనేరు, పుంగనూరు, పూతలపట్టు, జీడీ నెల్లూరు, నగరిలో బంద్ అనుకున్న స్థాయి కంటే విజయవంతంగా ముగిసింది. వ్యాపారులు, దుకాణదారులు స్వచ్ఛందంగా షాపులు మూసివేసి బంద్‌కు సహకరించారు. జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు పాదయాత్రలు, బైక్ ర్యాలీలు, నిరసన కార్యక్రమాలతో చంద్రబాబు కుట్రను ఎండగట్టారు. జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో చంద్రబాబు దిష్టిబొమ్మలు దహనం చేశారు. జిల్లాలోని మొత్తం ఐదు డిపోల్లో 371 బస్సులు డిపోలకు పరిమితయ్యయాయి. ముందు జాగ్రత్తగా శుక్రవారం రాత్రి 11 గంటల నుండి బస్సులను డిపోలకే పరిమితం చేశారు. అత్యవసర సర్వీసులకు బంద్‌లో మినహాయింపు ఇచ్చారు. సాయంత్రం 4 గంటల నుండి ఆర్టీసీ బస్సులు తిరిగి రోడ్డెక్కాయి. పోలీసులను పరామర్శించిన మంత్రి పెద్దిరెడ్డి టీడీపీ అల్లరి మూక చేతిలో తీవ్రంగా గాయపడి చిత్తూరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పోలీసు అధికారులు, సిబ్బందిని శనివారం ఉదయం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పరామర్శించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించే ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ సగిలి షణ్మోహన్, జిల్లా ఎస్పీ రిషాంత్‌రెడ్డిని ఆదేశించారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ పుంగనూరు, అంగళ్ల దాడులకు పూర్తి బాధ్యత చంద్రబాబుదేనన్నారు. రాష్ట్రంలో ఎలాగూ గెలవకపోయినా, చంద్రబాబుకు కుప్పంలో ఓటమి భయం పట్టుకుందని, అందుకే ఇలాంటి కుట్రలు, కుతంత్రాలకు బరితెగించారని విమర్శించారు. షాట్ గన్, కత్తులు, కటార్ల వంటి మారణాయుధాలతో ర్యాలీ నిర్వహించడం చంద్రబాబు దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు. ‘ఈనాడు’ నైజం బట్టబయలు వైఎస్సార్సీపీ నాయకుడికి టీడీపీ ముసుగేసిన వైనం కురబలకోట: చంద్రబాబు రెచ్చగొట్టే వ్యాఖ్యలతో చోటుచేసుకున్న గొడవలో శుక్రవారం కురబలకోట మండలంలోని అంగళ్లుకు చెందిన వైఎస్సార్సీపీ నేత అర్జున్‌రెడ్డి టీడీపీ దాడిలో తీవ్రంగా గాయపడ్డాడు. అయితే శనివారం ఈనాడు దినపత్రిక పతాక శీర్షికలో అర్జున్‌రెడ్డిని టీడీపీ కార్యకర్తగా పేర్కొంటూ ఫొటో ప్రచురించింది. రక్తమోడుతున్న టీడీపీ కార్యకర్త అని ప్రచారం చేసింది. దాడిలో దెబ్బలు తిన్నది వైఎస్సార్సీపీ నాయకుడైతే నిస్సిగ్గుగా టీడీపీ కార్యకర్త అని దుష్ప్రచారం చేయడం ఈనాడు రామోజీకే చెల్లిందని అంగళ్లు ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అర్జున్‌రెడ్డి మాట్లాడుతూ తనను టీడీపీ కార్యకర్తగా ప్రచురించడం ఈనాడు తన ‘పచ్చ’పాతాన్ని చాటుకుందన్నారు. తాను తొలి నుంచి వైఎస్సార్సీపీ వీరాభిమానినన్నారు. కాగా, శనివారం అర్జున్‌రెడ్డిని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, తంబళ్లపల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి పరామర్శించారు. పార్టీ అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు. పూతలపట్టులో టీడీపీ దౌర్జన్యం బంద్‌లో భాగంగా పూతలపట్టు నడిబొడ్డున ఎమ్మెల్యే ఎంఎస్ బాబు శాంతియుతంగా నిరనన తెలిపారు. అయితే కూడలి ప్రాంతంలో తమ ప్లెక్సీలు చించేశారనే నెపంతో టీడీపీ నేతలు అక్కడికి భారీగా చేరుకున్నారు. బూతులు తిడుతూ ‘రండి రా.. చూసుకుందాం..’ అంటూ రెచ్చగొట్టారు. ఫ్లెక్సీలకు కట్టిన కర్రలు చేతబట్టుకుని దాడి చేసేందుకు యత్నించారు. ఎమ్మెల్యే ఎంఎస్ బాబు, వందలాది మంది వైఎస్సార్సీపీ శ్రేణులు బాధ్యతతో సంయమనం పాటించారు. అంత డీఎస్పీ శ్రీనివాసమూర్తి, సిబ్బందితో కలిసి అక్కడికి చేరుకుని టీడీపీ నేతలను అక్కడి నుండి పంపించారు.