కర్నూలు(హాస్పిటల్): కొన్ని ఫార్మాకంపెనీలు వైద్యులను తప్పుదోవ పట్టిస్తున్నాయి. తమ మందులు రాస్తే ఖరీదైన బహుమతులు ఇస్తామని ఆశ చూపుతున్నాయి. భారీగా నగదు అందజేస్తామని ఊరిస్తున్నాయి. మందుల ధరల్లో వ్యత్యాసాలను బట్టి 20 నుంచి 30 శాతం వరకు చెక్కుల రూపేణా ఇస్తామని ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. ఎలాంటి అర్హతలు లేకపోయినా కొందరికి డిప్లొమా సర్టిఫికెట్లు తెచ్చి ఇస్తూ అక్రమాలకు పాల్పడుతున్నాయి.
చదవండి: గాడ్‌ఫాదర్ ఈవెంట్.. ఎస్పీకి ఫిర్యాదులు.. అసలు ఏం జరిగిందంటే?
తమ మందులు అమ్ముకోవడానికి కొన్ని ఫార్మా కంపెనీలు ఎంతకైనా తెగిస్తున్నాయి. బాగా మందులు రాసే వైద్యునికి ఎంబీబీఎస్ సర్టిఫికెట్ ఉంటే చాలు డిప్లొమా కోర్సుల సర్టిఫికెట్లను తెప్పించే బాధ్యతను అవే తీసుకుంటున్నాయి. సదరు డాక్టర్ కేవలం పేరు, వివరాలు చెబితే చాలు..మొత్తం పనంతా సదరు కంపెనీనే చూసుకుంటుంది. ఆన్‌లైన్‌లో విదేశీ యూనివర్సిటీలకు దరఖాస్తు చేయడం, కొన్ని వారాల్లోనే సర్టిఫికెట్లు తెప్పించడం జరిగిపోతోంది. వాటినే అందంగా ఫ్రేమ్ వేయించి మరీ వైద్యం చేస్తున్నారు కొందరు డాక్టర్లు.
కర్నూలు నగరంలో ఇలాంటి వైద్యులు 40 మందికి పైగా ఉన్నారు. ఎన్‌ఆర్ పేట, శ్రీనివాసనగర్, గాయత్రి ఎస్టేట్స్, అశోక్‌నగర్, వెంకటరమణకాలనీ, జనరల్ హాస్పిటల్ ఎదురుగా పలువురు ఇలాంటి డిగ్రీలతో వైద్యం చేస్తున్నారు. అలాగే ఎమ్మిగనూరులోని ఓ బీఏఎంఎస్(ఆయుర్వేదిక్ కోర్సు చేసిన వారు) వైద్యుడు ఏకంగా డయాబెటాలజిస్ట్ అండ్ కార్డియాలజిస్టుగా బోర్డు పెట్టేసుకుని వైద్యం చేస్తున్నారు. ఆ ప్రాంతంలో ఆయనెప్పుడూ బిజీ ప్రాక్టీషనరే. అలాగే ఆదోనిలోనూ ఎంబీబీఎస్ అర్హతతో ఓ వైద్యుడు కార్డియాలజిస్టు అవతారమెత్తాడు.
నిమ్స్, ఉస్మానియాతో పాటు అన్నామలై యూనివర్సిటీల్లో డిప్లొమా కోర్సును రెండేళ్ల పాటు చేసిన వైద్యులు తమ బోర్డుల్లో డిప్లొమా ఇన్ కార్డియాలజీ, డిప్లొమా ఇన్ డయాబెటాలజిగా రాసుకుంటున్నారు. కానీ అర్హతలేని యూనివర్సిటీల్లో సర్టిఫికెట్లు తెచ్చుకున్న వైద్యులు మాత్రం ఏకంగా డయాబెటాలజిస్ట్, కార్డియాలజిస్టు అని రాసుకోవడంతో 12 ఏళ్ల పాటు కష్టపడి వైద్యవిద్యను చదివిన డాక్టర్లు తీవ్రమనస్తాపానికి గురవుతున్నారు.
నకిలీ సర్టిఫికెట్లతో వైద్యం చేసే వారు అధికంగా ప్రాపగండ డిస్టిబ్యూషన్ కంపెనీ(పీడీసీ) మందులు రాస్తున్నారు. ఇవి బ్రాండెడ్ మందుల కంటే ఎంఆర్‌పీ అధికంగా ఉంటాయి. కానీ వైద్యులు ఇవే కొనాలని రోగులకు సూచిస్తున్నారు. అలాంటి వాటిలో కొన్ని మందులు ఎంత మేరకు పనిచేస్తాయో వైద్యులకు కూడా తెలియదు. ఇటీవల షుగర్ వ్యాధిగ్రస్తుల సంఖ్య భారీగా పెరుగుతుండటంతో అందుకు అనుగుణంగా డి డయాబెటిక్స్ సర్టిఫికెట్లు తెచ్చుకుంటున్నారు.
బహుమతులుగా ఖరీదైన కార్లు
కర్నూలులో 200 మందికి పైగా ‘పీడీ’ వ్యాపారం చేసే వారు ఉన్నారు. పెట్టుబడి తక్కువ లాభం ఎక్కువగా ఉండటంతో ఈ వ్యాపారంలోకి దిగుతున్నారు. పాతబస్టాండ్, ఎన్‌ఆర్ పేట, జనరల్ హాస్పిటల్ ఎదురుగా, నంద్యాల రోడ్డు ప్రాంతాల్లో ఏజెన్సీలు నిర్వహిస్తున్నారు. వీరు ఏజెంట్లను ఏర్పాటు చేసుకుని వైద్యుల వద్దకు పంపిస్తూ ఆఫర్లు ప్రకటిస్తున్నారు. తమ మందులు రోగులకు రాస్తే ఎలాంటి ఖరీదైన కారు కావాలన్నా కొనిస్తున్నారు. ఇటీవల పలువురు వైద్యులు స్కోడా, వోక్స్‌వాగన్, ఆడికార్లతో పాటు నర్సింగ్‌హోమ్‌లు ఉన్న వైద్యులు అంబులెన్స్‌లు కూడా బహుమతులుగా తీసుకున్నారు. ఇలాంటి వైద్యుల్లో ప్రైవేటుగా క్లినిక్‌లు, హాస్పిటల్స్ నిర్వహించే పలువురు ప్రభుత్వ వైద్యులు కూడా ఉండటం గమనార్హం.
కొందరు డాక్టర్లకు క్యాష్ కార్డులు!
ప్రముఖ పట్టణాలు, నగరాల్లో వైద్యసదస్సులు ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో గెస్ట్ లెక్చర్ ఇచ్చేందుకు కంపెనీలు వైద్యులను ఆహా్వనిస్తాయి. ఓ అరగంట, పావు గంటపాలు లెక్చర్ ఇస్తారు. కానీ అంతకు మించి వారికి భారీగా గౌరవ వేతనంగా కంపెనీలు ముట్టజెబుతున్నాయి. అంటే ఇది అడ్డదారిలో వైద్యులకు బహుమతులు ఇవ్వడం అన్నమాట. మరికొన్ని కంపెనీలు వైద్యులకు పెట్రోకార్డులు, గోల్డ్‌కార్డులు/కూపన్లు, క్యాష్‌కార్డులు బహుమతులుగా ఇస్తున్నాయి. ఇవేవీ వద్దని క్యాషే కావాలనుకుంటే వైద్యుని బంధువులు, స్నేహితుల పేరుపై లేదా మెడికల్ రెప్ పేరుపైనే కంపెనీలు చెక్కులను పంపిస్తాయి. వాటిని డ్రా చేసుకుని నగదును మాత్రం వైద్యులకు ముట్టజెప్పాలి. మరికొందరు వైద్యులు కుటుంబానికి అవసరమైన అన్ని వసతులు, సౌకర్యాలను ఫార్మాకంపెనీలతో సమకూర్చుకుంటున్నారన్న విమర్శలు ఉన్నాయి.
తగ్గేది లేదంటున్న ఆర్‌ఎంపీలు
ఎంబీబీఎస్ అర్హత ఉన్నవారే కాదు ఆర్‌ఎంపీలు సైతం తామేమీ తక్కువ కాదన్నట్లు డిగ్రీలు పెట్టేసుకుని వైద్యం చేస్తున్నారు. వన్‌టౌన్, కల్లూరు ప్రాంతాల్లో కొందరు ఆర్‌ఎంపీలు తమ బోర్డులో ఫిజీషియన్ అండ్ సర్జన్‌గా పెట్టుకుని వైద్యం చేస్తున్నా ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. ఇలాంటి వారు ఆదోని డివిజన్‌లోని కౌతాళం, కోసిగి, ఎమ్మిగనూరు, పత్తికొండ, తుగ్గలి, కోడుమూరు, మంత్రాలయం ప్రాంతాల్లో అధికంగా ఉన్నారు. బోర్డులో డిగ్రీల పేరు చూసి నిజంగా వారు అంత చదివారేమోనని అక్కడి ప్రజలు నమ్మి మోసపోతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment