PM Modi And AP CM YS Jagan Visakhapatnam Tour On Nov 11th, Check Full Schedule - Sakshi
Sakshi News home page

ప్రధాని మోదీ, సీఎం జగన్‌ విశాఖ పర్యటన ఖరారు.. షెడ్యూల్‌ ఇదే!

Published Wed, Nov 2 2022 1:39 PM | Last Updated on Wed, Nov 2 2022 3:14 PM

PM Modi to inaugurate various projects in Visakhapatnam on 11th Nov - Sakshi

సాక్షి, విశాఖపట్నం: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మూడోసారి విశాఖ పర్యటన దాదాపు ఖరారైంది. ఈ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో కలిసి పలు కీలక ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లలో ఆయా విభాగాల అధికారులు తలమునకలయ్యారు. దాదాపు 14 ప్రాజెక్టులు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు నిర్వహించే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఇప్పటివరకు రూ.10,842.47 కోట్లతో చేపట్టిన, చేపట్టబోతున్న 8 ప్రాజెక్టులకు ప్రధాని కార్యాలయం నుంచి అంగీకారం లభించింది. రెండు మూడు రోజుల్లో మిగిలిన వాటికి కూడా గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చే అవకాశాలున్నాయి.

ఫిషింగ్‌ హార్బర్‌

ఇదీ షెడ్యూల్‌ 
ఈ నెల 11న విశాఖకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రానున్నారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కూడా అదే రోజు మధ్యాహ్నం విశాఖకు చేరుకుంటారు. ఆ రోజు సాయంత్రం ఐఎన్‌ఎస్‌ డేగాకు చేరుకోనున్న ప్రధాని మోదీని ముఖ్యమంత్రి స్వాగతం పలుకుతారు. అక్కడి నుంచి నేరుగా తూర్పు నౌకాదళ ప్రధాన కేంద్రానికి చేరుకుని ఐఎన్‌ఎస్‌ చోళలో రాత్రి బస చేస్తారు. 12వ తేదీ ఉదయం ఏయూ గ్రౌండ్స్‌కు చేరుకుని.. అక్కడి నుంచే భారీ ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టనున్నారు.

రైల్వే స్టేషన్‌ రీడెవలప్‌మెంట్‌ మోడల్‌

సుమారు 14 ప్రాజెక్టులను ప్రధాని చేతుల మీదుగా వర్చువల్‌ విధానంలో ప్రారంభం, శంకుస్థాపనలు జరగనున్నాయి. కొన్ని ప్రభుత్వ సంస్థలు ఆలస్యంగా జాబితా పంపించడంతో అవి ప్రధానమంత్రి కార్యాలయం(పీఎంవో)లో పరిశీలనలో ఉన్నాయి. అవి కూడా త్వరలోనే షెడ్యూల్‌లోకి వచ్చే అవకాశాలున్నాయని అధికారులు చెబుతున్నారు. ఇప్పటి వరకు 8 ప్రాజెక్టులకు అంగీకరించినట్లు పీఎంవో వర్గాలు వెల్లడించాయి. ఇందులో రైల్వే శాఖకు సంబంధించి రెండు, ఫిషరీస్‌కు చెందిన ఒకటి, రోడ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ అండ్‌ హైవేస్‌కు చెందినవి 3, పెట్రోలియం అండ్‌ నేచురల్‌ గ్యాస్‌ మినిస్ట్రీకి చెందిన 2 ప్రాజెక్టులున్నాయి. 

హెచ్‌పీసీఎల్‌

ప్రాజెక్టుల వివరాలివీ.... 
►రూ.460 కోట్లతో విశాఖపట్నం రైల్వే స్టేషన్‌ ఆధునికీకరణ పనులతో పాటు రూ.100.47 కోట్లతో సౌత్‌ కోస్టల్‌ రైల్వే జోన్‌ హెడ్‌క్వార్టర్స్‌ భవనానికి శంకుస్థాపన. 
►రూ.152 కోట్లతో విశాఖపట్నం ఫిషింగ్‌ హార్బర్‌ ఆధునికీకరణ, అప్‌గ్రేడేషన్‌ పనులకు పునాది రాయి.. 
►రూ.3,778 కోట్లతో ఏపీ సెక్షన్‌కు చెందిన రాయ్‌పూర్‌–విశాఖపట్నం ఎకనమిక్‌ కారిడార్‌ ఆరులైన్ల గ్రీన్‌ఫీల్డ్‌ రహదారి నిర్మాణం పనులకు శంకుస్థాపన. 
►రూ.566 కోట్లతో కాన్వెంట్‌ జంక్షన్‌ నుంచి షీలానగర్‌ వరకు పోర్టు వాహనాల రాకపోకలకు ప్రత్యేక రహదారి నిర్మాణ పనులకు శంకుస్థాపన. 
►గెయిల్‌ సంస్థకు సంబంధించి రూ.2,658 కోట్లతో 321 కిలోమీటర్ల పొడవునా శ్రీకాకుళం నుంచి అంగూల్‌ పైప్‌లైన్‌ (ఎస్‌ఏపీఎల్‌) ప్రాజెక్టుకు శంకుస్థాపన.
►రూ.211 కోట్లతో ఇచ్ఛాపురం నుంచి పర్లాఖిముండి వరకు రహదారి విస్తరణలో భాగమైన పాతపట్నం నుంచి నరసన్నపేట రెండులైన్ల రహదారిని ప్రారంభించి జాతికి అంకితం. 
►ఈస్ట్రన్‌ ఆఫ్‌షోర్‌లో రూ.2,917 కోట్లతో ఓఎన్‌జీసీకి సంబంధించి యూ ఫీల్డ్‌ డెవలప్‌మెంట్‌ ప్రాజెక్ట్‌ను ప్రారంభించి ప్రధాని మోదీ, సీఎం వైఎస్‌ జగన్‌ జాతికి అంకితం చేయనున్నారు. 
వీటితో పాటుగా సుమారు రూ.26 వేల కోట్లతో హిందూస్థాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌(హెచ్‌పీసీఎల్‌) చేపట్టిన రిఫైనరీ విస్తరణ ప్రాజెక్టు, గంభీరంలో రూ.445 కోట్లతో మొదటి విడతలో నిర్మించిన ఐఐఎంవీ భవనం, రూ.260 కోట్లతో వడ్లపూడిలో నిర్మించిన వ్యాగన్‌ వర్క్‌షాప్‌ను కూడా ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ప్రారంభించే అవకాశాలున్నాయి. రూ.380 కోట్లతో ఈఎస్‌ఐ ఆస్పత్రి నిర్మాణానికి, భోగాపురం ఎయిర్‌పోర్టుకు కూడా శంకుస్థాపన చేసే అవకాశం ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.

ప్రధాని హోదాలో మూడోసారి.. 
ప్రధానమంత్రి హోదాలో నరేంద్రమోదీ మూడోసారి విశాఖకు రానున్నారు. 2016లో భారత నౌకాదళం ఆధ్వర్యంలో నిర్వహించిన ఇంటర్నేషనల్‌ ఫ్లీట్‌ రివ్యూ(ఐఎఫ్‌ఆర్‌)లో పాల్గొనేందుకు తొలిసారిగా మోదీ విశాఖలో పర్యటించారు. 2019 ఎన్నికల సందర్భంగా ఆ ఏడాది మార్చిలో రైల్వే గ్రౌండ్స్‌లో నిర్వహించిన సభకు ప్రధాని హాజరయ్యారు. మూడోసారి విశాఖకు వస్తున్న నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతాపరమైన చర్యలు తీసుకుంటున్నారు. ఏయూ మైదానంలో బహిరంగ సభ ఏర్పాటు చేసి అక్కడి నుంచే ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలకు ఏర్పాట్లు చేస్తున్నారు. హెలిప్యాడ్‌ ఎక్కడ ఏర్పాటు చేయాలన్న అంశంపై అధికారులు ఆలోచన చేస్తున్నారు.  

ప్రారంభం 
ఓఎన్‌జీసీలో అభివృద్ధి పనులు- రూ. 2,917 కోట్లు 
పాతపట్నం–నరసన్నపేట కనెక్టివిటీ రహదారి- రూ. 211 కోట్లు 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement