జనవరి నుంచి కొత్త డయాఫ్రం వాల్ నిర్మాణం
రూ.70 వేల కోట్లతో గోదావరి, కృష్ణా, పెన్నా నదుల అనుసంధానం
అసెంబ్లీలో సీఎం చంద్రబాబు
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టును 2027లోగా పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తును తగ్గిస్తున్నారనే వాదనలో వాస్తవం లేదని.. 45.72 మీటర్ల ఎత్తుకు ఎన్డీయే ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉన్నాయన్నారు. శాసనసభలో మంగళవారం పోలవరం, సాగునీటి ప్రాజెక్టులపై స్వల్పకాలిక చర్చ జరిగింది. 13 మంది ఎమ్మెల్యేలు ఈ అంశంపై మాట్లాడారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. జనవరి నుంచి పోలవరం కొత్త డయాఫ్రం వాల్ నిర్మాణం ప్రారంభిస్తామని, రూ.70 వేల కోట్లతో గోదావరి, కృష్ణా, పెన్నా నదుల అనుసంధానం చేసి ప్రతి ఎకరాకూ నీళ్లిస్తామని చెప్పారు. తీరంలో పోర్టులు అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు.
పోలవరం ప్రాజెక్టు ఇప్పటిది కాదని.. 1941లోనే ప్రతిపాదన వచి్చందన్నారు. రామపాద సాగర్ పేరుతో భూమిని ఎంపిక చేశారన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎం అయ్యాక పోలవరం ప్రాజెక్టును అస్తవ్యస్థం చేశారని చంద్రబాబు ఆరోపించారు. తెలంగాణలో ఉన్న 7 ముంపు మండలాలను ఏపీలో కలపకపోతే తాను సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనని పట్టుబట్టడం వల్లే కేంద్రం వాటిని ఏపీలో కలిపిందని చెప్పారు. అలా కలపకపోయి ఉంటే.. తెలంగాణ ఒప్పుకోకపోతే పోలవరం ఎప్పటికీ సాధ్యమయ్యేది కాదన్నారు. గత ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ పేరుతో కాంట్రాక్టర్‌ను మార్చిందని, 15 నెలల పాటు పోలవరం ప్రాజెక్టు పనులు నిలిపివేసిందన్నారు. 2020లో వరదలకు డయాఫ్రం వాల్ దెబ్బతింటే దానిని వెంటనే గుర్తించలేకపోయారన్నారు.
కొత్త వాల్ నిర్మాణానికి రూ.990 కోట్లు ఖర్చవుతుందని వెల్లడించారు. ఆలస్యం వల్ల ప్రాజెక్టు వ్యయం పెరిగిందన్నారు. 2019 నాటికి 71.93 శాతం ప్రాజెక్టును తన హయాంలో పూర్తి చేస్తే గత ప్రభుత్వం హయాంలో 3.84 శాతం మాత్రమే పూర్తయ్యిందన్నారు. పర్సంటా, హాఫ్ పర్సంటా అని గత ప్రభుత్వంలో ఓ మంత్రి అవగాహన రాహిత్యంతో అవహేళన చేశారని, ఆయన పోయి మరో మంత్రి వచ్చారని, ఆయనకు టీఎంసీకి, క్యూసెక్కుకి తేడా తెలియదన్నారు. గత ప్రభుత్వం నీటిపారుదల రంగాన్ని నిర్వీర్యం చేసిందని.. అంతకుముందు సభ్యుల ప్రశ్నలకు సమాధానం ఇస్తూ నీటి పారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు. కనీస నిర్వహణ లేక గత ప్రభుత్వంలో 1,040 ఎత్తిపోతల పథకాల్లో 450 మూతపడ్డాయన్నారు. నీటి వనరుల నుంచి లబ్ధి పొందే రైతులపైనా ఆయా సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణ భారం వేయాలని ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి సలహా ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment