
మధురపూడి (తూర్పుగోదావరి): మాజీ ఎంపీ హర్షకుమార్ తనయుడు ఓ యువతిపట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. అతని తీరు భరించలేక ఆమె తప్పించుకుని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై కోరుకొండ ఎస్‌ఐ తెలిపిన వివరాలివీ.. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి చెందిన ఓ యువతి (27) తన స్నేహితురాలితో కలిసి సోమవారం రాత్రి మంజీరా ఫంక్షన్ హాల్లో జరిగిన పుట్టినరోజు వేడుకలకు వెళ్లింది. అక్కడ మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ కుమారుడు శ్రీరాజ్ ఆతిథ్యం ఇస్తానంటూ తన కారులో ఇద్దరినీ కోరుకొండ మండలం గాడాలలోని తమ గెస్ట్‌హౌస్‌కి తీసుకెళ్లాడు.
అక్కడ మద్యం సేవిస్తూ, భోజనాలు చేస్తున్న సమయంలో ఆ యువతిపట్ల శ్రీరాజ్ అసభ్యంగా ప్రవర్తించాడు. దీనిని ఆమె తీవ్రంగా వ్యతిరేకించింది. అయినప్పటికీ అతను తన తీరు మార్చుకోకపోవడంతో ఆమె ఎదురుతిరిగింది. దీంతో అతను దౌర్జన్యానికి పాల్పడే క్రమంలో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. వెంటనే బాధితురాలు అక్కడనుంచి బయటపడేందుకు యత్నిస్తుండగా శ్రీరాజ్ ఆమెను అనుసరించి తన కారులో దింపుతానని నమ్మించాడు. అలా వారు కారులో కొంతదూరం ప్రయాణించాక హర్షకుమార్ తనయుడు మరోసారి వెకిలిచేష్టలకు బరితెగించాడు.
ఒకచేత్తో కారును డ్రైవ్ చేస్తూ, మరో చేత్తో ఆమెపట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. అప్పుడు కూడా ఆమె ప్రతిఘటిస్తూనే ఉంది. చివరకు భరించలేక, మధురపూడి ఎయిర్‌పోర్టు రోడ్డులో కారు దిగిపోయింది. అక్కడ నుండే 100 ఫోన్ నెంబర్‌కు కాల్‌చేసి, జరిగిన విషయంపై ఫిర్యాదు చేసింది. దీంతో కోరుకొండ, రాజానగరం పెట్రోలింగ్ పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. బాధితురాలిని కోరుకొండ పోలీసుస్టేషన్‌కు తీసుకెళ్లి, జరిగిన ఘటనపై ఆమె నుంచి ఫిర్యాదు తీసుకున్నారు. యువతిపట్ల అసభ్యకరంగా ప్రవర్తించడం.. వేధింపులకు గురిచేయడం వంటి నేరాలపై 354, 354డీ, 509 సెక్షన్ల కింద కేసు నమోదుచేసి, దర్యాప్తు చేస్తున్నామని కోరుకొండ ఎస్పై శారదా సతీష్ తెలిపారు.
గతంలోనూ శ్రీరాజ్‌పై కేసులు
ఇక శ్రీరాజ్‌పై ఇప్పటికే పలు కేసులున్నాయి. 2019 ఎన్నికల సమయంలో అనుమతిలేకుండా ఎయిర్‌పోర్టులోకి ప్రవేశించే సమయంలో జరిగిన అల్లర్లలో శ్రీరాజ్‌పై కోరుకొండ పోలీసుస్టేషన్‌లో కేసు నమోదైంది. తాజాగా.. యువతిపై అసభ్యకర ప్రవర్తన కేసు రెండోది. అలాగే రాజమహేంద్రవరంలో కూడా పలు సెక్షన్లలో కేసులు నమోదయ్యాయి.
ఇది కూడా చదవండి: సూసైడ్ లెటర్ రాసి నారాయణ కళాశాల లెక్చరర్ ఆత్మహత్య
Comments
Please login to add a commentAdd a comment