20 నెలల్లోనే ఉరి శిక్ష
అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లి మండలం గంగిరెడ్డిపల్లికి చెందిన సయ్యద్ మౌలాలి అదే గ్రామానికి చెందిన సరళమ్మ, గంగులమ్మలను హత్య చేసి అనంతరం 12 ఏళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ కేసును కన్విక్షన్ బేస్డ్ పోలీసింగ్ విధానంలో సమగ్రంగా దర్యాప్తు చేసిన పోలీసులు తగిన ఆధారాలతో సహా నిరూపించారు. దాంతో కేవలం 20 నెలల్లోనే విచారణ ప్రక్రియ పూర్తి చేసిన న్యాయస్థానం సయ్యద్ మౌలాలికి ఉరి శిక్ష విధించింది.
ఆ ఇద్దరికీ 20 ఏళ్ల జైలు
2022లో బాపట్ల జిల్లా రేపల్లె రైల్వే స్టేషన్‌లో 2022లో ఓ యువతిపై పాలుబోయిన విజయ్‌కృష్ణ, పాలుచూరి నిఖిల్ సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. ఈ కేసును కూడా కన్విక్షన్ బేస్డ్ పోలీసింగ్ విధానంలో దర్యాప్తు చేసిన పోలీసులు 15 రోజుల్లోనే చార్జ్‌షిట్ దాఖలు చేశారు. తగిన ఆధారాలతో నేరాన్ని నిరూపించారు. దాంతో న్యాయస్థానం దోషులు పాలుబోయిన విజయ్ కృష్ణ, పాలుచూరి నిఖిల్‌కు 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది.
సాక్షి, అమరావతి: ఎవరైనా నేరానికి పాల్పడితే శిక్ష పడాల్సిందే అన్న విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీగా అమలు చేస్తోంది. అందుకోసం కన్విక్షన్ బేస్డ్ పోలీసింగ్ (నేరారోపణ ఆధారిత పోలీసింగ్) విధానాన్ని ప్రవేశపెట్టి సత్ఫలితాలు సాధిస్తోంది. నేరస్తుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. ఏళ్ల కొద్దీ దర్యాప్తు.. ఆధారాల సేకరణకు నానా తంటాలు.. సుదీర్ఘ కాలం విచారణ.. వెరసి నేరం జరిగి ఏళ్లు గడుస్తున్నా దోషులు దర్జాగా బయట తిరిగే పరిస్థితి దశాబ్దాలుగా నెలకొంది.
ఇలాంటి అస్తవ్యస్త విధానానికి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ముగింపు పలికింది. నేరానికి పాల్పడిన వ్యక్తి తప్పించుకోవడం అసంభవం అన్నట్టుగా పోలీసు వ్యవస్థను బలోపేతం చేసింది. దాంతో గతంలో ఎన్నడూలేని రీతిలో రాష్ట్రంలో నేరాలకు పాల్పడిన వారికి న్యాయస్థానాల ద్వారా సత్వరం శిక్షలు విధిస్తున్నాయి.
కన్విక్షన్ బేస్డ్ పోలీసింగ్ ఇలా..
నేరాలకు పాల్పడే వారికి సత్వర శిక్షలు విధించేలా చేయడంపై వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. అందుకోసం 2022 జూన్ నుంచి పోలీస్ స్టేషన్ల వారీగా ప్రత్యేకంగా కార్యాచరణ చేపట్టింది. పోలీసు అధికారులకు ప్రత్యేకంగా కేసుల బాధ్యతలు అప్పగించింది. పోలీస్ జిల్లా యూనిట్ల అధికారులకు ఐదేసి కేసుల చొప్పున అప్పగించింది. ఆ కేసుల దర్యాప్తు, విచారణను వారు ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు. ఎస్‌ఐ, సీఐ, డీఎస్పీలకు పదేసి చొప్పున కేసులు అప్పగించి దర్యాప్తును సత్వరం పూర్తి చేసి చార్జిషిట్లు దాఖలు చేసేలా పర్యవేక్షించింది. దాంతో దోషులను గుర్తించి.. దోషులు చేసిన నేరాన్ని న్యాయస్థానాల్లో నిరూపించి శిక్షలు పడేలా చేస్తోంది.
సత్వరమే శిక్షలు
ఈ విధానం సత్పలితాలిస్తోంది. రాష్ట్రంలో ఏడాది కాలంగా నేరస్తులకు న్యాయస్థానాల ద్వారా సత్వరం శిక్షలు విధిస్తుండటమే ఇందుకు నిదర్శనం. అందులోనూ తీవ్రమైన నేరాలకు పాల్పడిన వారికి అత్యంత కఠిన శిక్షలు విధించేలా చేయడం పోలీసు శాఖ సమర్థతకు అద్దం పడుతోంది. 2022 నుంచి ఇప్పటివరకు కన్విక్షన్ బేస్డ్ విధానంలో 122 కేసులను గుర్తించి ప్రత్యేక కార్యాచరణ చేపట్టారు.
వాటిలో ఏకంగా 109 కేసుల్లో తగిన ఆధారాలతో దోషులను గుర్తించి న్యాయస్థానాలు శిక్షలు విధించడం ప్రాధాన్యం సంతరించుకుంది. అంటే దాదాపు 90 శాతం కేసుల్లో నేరస్తులకు సత్వరమే శిక్షలుపడటం రాష్ట్ర చరిత్రలోనే ఓ రికార్డు. నేరాల తీవ్రతను బట్టి దోషులకు కఠిన శిక్షలు విధించడం కూడా నేరస్తుల పట్ల పోలీసు వ్యవస్థ ఏమాత్రం ఉదాసీనంగా లేదన్న సందేశాన్నిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment