
సాక్షి, అమరావతి: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని అసెంబ్లీలోని సీఎం ఛాంబర్‌లో ఏషియన్ పవర్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్ విన్నర్ షేక్ సాదియా అల్మస్ కలిశారు. షేక్ సాదియా అల్మస్ గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన అంతర్జాతీయ పవర్ లిఫ్టింగ్ క్రీడాకారిణి. టర్కీ రాజధాని ఇస్తాంబుల్‌లో 2021 డిసెంబర్‌లో జరిగిన ఏషియన్ పవర్ లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో ఆమె 3 స్వర్ణ పతకాలు, 1 రజత పతకం సాధించారు. షేక్ సాదియాకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున రూ. 5 లక్షల ఆర్ధిక సాయాన్ని సీఎం జగన్ ప్రకటించారు.
అదే విధంగా మంగళగిరిలో పవర్ లిఫ్టింగ్ అకాడమీ ఏర్పాటుకు అంగీకారం తెలిపారు. క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరుపున అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు సీఎం వైఎస్ జగన్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పర్యాటక, క్రీడాశాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, స్పెషల్ సీఎస్ రజత్ భార్గవ, షేక్ సాదియా తండ్రి సంధాని, రోటరీ క్లబ్ ప్రతినిధులు పాల్గొన్నారు.