సాక్షి, అమరావతి: మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ఘట్టం ముగిసిన తరువాత పలువురు అభ్యర్థులకు నామినేషన్ల దాఖలుకు అనుమతిస్తూ ఎన్నికల కమిషనర్ ఉత్తర్వులు జారీ చేయడాన్ని సవాల్ చేస్తూ వైఎస్సార్, చిత్తూరు జిల్లాలకు చెందిన పలువురు అభ్యర్థులు హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. ఎన్నికల కమిషన్ ఉత్తర్వులను రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించి రద్దు చేయాలని హైకోర్టును కోరారు. కమిషన్ ఉత్తర్వుల అమలును నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని అభ్యర్ధించారు. ఈ వ్యాజ్యాలపై న్యాయమూర్తి జస్టిస్ డీవీఎస్‌ఎస్ సోమయాజులు మంగళవారం విచారణ జరిపారు.
గడువు ముగిశాక మళ్లీ అవకాశం ఇవ్వడం చట్టవిరుద్ధం
పిటిషనర్ల తరఫున వీఆర్ రెడ్డి, ప్రశాంత్ వాదనలు వినిపిస్తూ.. నామినేషన్ల ప్రక్రియ ముగిసిన తరువాత తిరిగి నామినేషన్లు దాఖలు చేసేందుకు అనుమతి ఇవ్వడం ఏపీ మున్సి’పాలిటీల చట్టానికి విరుద్ధమన్నారు. గత ఏడాది మొదలైన మున్సిపల్ ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఆయా వార్డులు, డివిజన్లకు పిటిషనర్లు మాత్రమే నామినేషన్లు దాఖలు చేశారని తెలిపారు. కరోనా వల్ల ఎన్నికలు వాయిదా పడటంతో పిటిషనర్లు ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ప్రకటించడం అప్పట్లో సాధ్యం కాలేదన్నారు. ఒకే నామినేషన్ వచ్చిన చోట అభ్యర్థులను ఏకగ్రీవంగా ఎన్నికయినట్టు ప్రకటిస్తామని అప్పట్లో ఎన్నికల కమిషనర్ తెలిపారని వివరించారు. అయితే, బలవంతంగా నామినేషన్లు ఉపసంహరణ జరిగిన వ్యక్తుల, బెదిరింపుల వల్ల నామినేషన్లు వేయని వ్యక్తుల నామినేషన్లను పునరుద్ధరించాలంటూ జిల్లా ఎన్నికల అధికారులను ఆదేశిస్తూ ఎన్నికల కమిషనర్ ఇటీవల ఉత్తర్వులిచ్చారని తెలిపారు.
ఈ ఉత్తర్వులకు అనుగుణంగా పలుచోట్ల నామినేషన్ల దాఖలుకు అవకాశం ఇచ్చారని తెలిపారు. సహేతుక కారణాలు, తగిన ఆధారాలు లేకపోయినప్పటికీ నామినేషన్ల దాఖలుకు అవకాశం ఇచ్చారని తెలిపారు. వాస్తవానికి ఓసారి నామినేషన్ల దాఖలు గడువు ముగిసిన తరువాత తిరిగి నామినేషన్ దాఖలుకు అవకాశం ఇవ్వడం చట్ట విరుద్ధమని, ఇందుకు ఏ చట్టం కూడా అంగీకరించదని వారు వివరించారు. ఇలా చేసే అధికారం ఎన్నికల కమిషనర్‌కు లేదన్నారు. ఒకవేళ పిటిషనర్ల నామినేషన్లపై ఎవరికైనా అభ్యంతరం ఉంటే చట్టబద్ధంగా ఏర్పాటైన ఎన్నికల ట్రిబ్యునల్ ముందు సవాల్ చేసుకోవాల్సి ఉంటుందన్నారు. ఇది తప్ప మరో ప్రత్యామ్నాయం లేదన్నారు.
ఎన్నికల కమిషనర్ పరిధి దాటి వ్యవహరిస్తున్నారు..
ప్రభుత్వ న్యాయవాది చింతల సుమన్ వాదనలు వినిపిస్తూ.. విశేషాధికారాల పేరుతో ఎన్నికల కమిషనర్ ఇష్టానుసారం వ్యవహరించడానికి వీల్లేదన్నారు. ఎన్నికల కమిషనర్ అధికారాలకూ పరిమితులు ఉన్నాయని, ఈ విషయాన్ని హైకోర్టు, సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పాయన్నారు. రిటర్నింగ్ అధికారిగా వ్యవహరించే ఎన్నికల అధికారులు ఓ సారి నామినేషన్లు ఆమోదించిన తరువాత అందులో ఎన్నికల కమిషనర్ జోక్యం చేసుకోవడానికి వీల్లేదని, ఎన్నికల అధికారే సుప్రీం అని హైకోర్టు గతంలోనే తీర్పునిచ్చిందన్నారు. ఎన్నికల ప్రక్రియలో అక్రమాలు చోటుచేసుకున్నాయని తేలినా వాటిపై ఎన్నికల ట్రిబ్యునల్‌కు వెళ్లాలని చట్టం చెబుతోందన్నారు. ఎన్నికల ట్రిబ్యునల్ చేయాల్సిన పనులను ఎన్నికల కమిషనర్ చేయడానికి వీల్లేదన్నారు. అన్నీ ఎన్నికల కమిషనరే చేసేస్తే, ఇక ఎన్నికల ట్రిబ్యునల్ ఎందుకని ప్రశ్నించారు. అక్రమాలు జరిగాయని ఎన్నికల కమిషనరే నిర్ధారిస్తే, ఎన్నికల ట్రిబ్యునల్ చేయడానికి ఏమీ ఉండదన్నారు.
ఫిర్యాదులు వచ్చినందునే...
ఎన్నికల కమిషన్ తరఫున న్యాయవాది అశ్వనీకుమార్ వాదనలు వినిపిస్తూ.. ఎన్నికల ప్రక్రియలో అక్రమాలు జరిగినప్పుడు వాటిపై స్పందించాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్‌పై ఉందన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో బలవంతపు నామినేషన్లు ఉపసంహరణ, నామినేషన్లు వేయకుండా అడ్డుకోవడం వంటి ఘటనలపై కమిషన్‌కు అనేక ఫిర్యాదులు వచ్చాయన్నారు. ఈ ఫిర్యాదుల ఆధారంగా నివేదికలు తెప్పించుకుని పరిశీలించాకే.. మళ్లీ నామినేషన్ల దాఖలుకు ఎన్నికల కమిషన్ అనుమతి ఇచ్చినట్టు తెలిపారు. ఎన్నికల కమిషన్‌కు విశేషాధికారాలు ఉన్నాయని ఆయన తెలిపారు. 14 చోట్ల నామినేషన్ల దాఖలుకు అనుమతినిచ్చామని, అయితే కేవలం 4 చోట్ల మాత్రమే నామినేషన్లు దాఖలయ్యాయని తెలిపారు. అందరి వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ సోమయాజులు ఈ వ్యాజ్యాలపై బుధవారం ఉత్తర్వులు ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నారు.
అన్నీ ఆయనే చేసేస్తే.. ఎన్నికల ట్రిబ్యునల్ ఎందుకు!
Published Wed, Mar 3 2021 5:03 AM | Last Updated on Wed, Mar 3 2021 11:20 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment