సాక్షి, అమరావతి: పురపాలక ఎన్నికల ప్రక్రియను గత ఏడాది నిలిచిపోయిన చోటునుంచే కొనసాగించేందుకు వీలుగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్‌ఈసీ) ఈ నెల 15న జారీచేసిన నోటిఫికేషన్ విషయంలో జోక్యానికి హైకోర్టు నిరాకరించింది. ఈ దశలో ఎస్‌ఈసీ నిర్ణయంలో జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పింది. ఏ రకమైన మధ్యంతర ఉత్తర్వులు జారీచేసినా.. ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకున్నట్లు అవుతుందని పేర్కొంది. మధ్యంతర ఉత్తర్వులు ఇస్తే, ఎన్నికల ప్రక్రియకు విఘాతం కలగడమే కాకుండా, ఎన్నికల కార్యక్రమాన్ని వాయిదా వేసినట్లు కూడా అవుతుందని తెలిపింది. న్యాయస్థానాలు ఆదేశాలు ఇచ్చినప్పుడు, సహేతుక కారణాలు ఉన్నప్పుడు మున్సిపాలిటీలు, నగర పంచాయతీల ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియను సవరించే, మార్చే అధికారం ఎన్నికల కమిషన్‌కు ఉందని స్పష్టం చేసింది.
కోవిడ్ మహమ్మారి, తద్వారా తలెత్తిన కార్యనిర్వాహక ఇబ్బందుల వల్ల పురపాలక ఎన్నికలు వాయిదా పడ్డాయని, ఈ కారణాలు సహేతుకమైనవేనని, ఇందుకు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని తెలిపింది. ఎన్నికల వాయిదా నిర్ణయాన్ని సుప్రీంకోర్టు కూడా సమర్థించిందని గుర్తుచేసింది. ఏ కారణంగానైనా ఎన్నికలు వాయిదా వేయరాదని కిషన్‌సింగ్ తోమర్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు గుర్తుచేసింది. రాజ్యాంగం ఇచ్చిన బాధ్యతను నిర్వర్తించేందుకే ఎన్నికల కమిషన్ గతంలో వాయిదా వేసిన ఎన్నికల ప్రక్రియను తిరిగి మొదలు పెట్టిందని తెలిపింది. ఈ కారణాల చేత మధ్యంతర ఉత్తర్వుల కోసం పిటిషనర్లు దాఖలు చేసిన అనుబంధ వ్యాజ్యాలను కొట్టేస్తున్నట్లు పేర్కొంది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ డీవీఎస్‌ఎస్ సోమయాజులు శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు.
తాజా నోటిఫికేషన్ కోరుతూ వ్యాజ్యాలు
పురపాలక ఎన్నికలు వాయిదా పడిన చోటునుంచే మొదలవుతాయంటూ ఈ నెల 15న ఎన్నికల కమిషనర్ నోటిఫికేషన్ ఇచ్చారు. ఈ నోటిఫికేషన్‌ను రాజ్యాంగ విరుద్ధంగా, పంచాయతీరాజ్ చట్ట నిబంధనలకు విరుద్ధంగా ప్రకటించాలని కోరుతూ వైఎస్సార్ కడప జిల్లా జమ్మలమడుగుకు చెందిన నక్కా యశోదా, కంచు మధుసూదన్, అనంతపురం జిల్లా తాడిపత్రికి చెందిన చిప్పిడి విష్ణువర్ధన్‌రెడ్డి, మరో ఆరుగురుతో పాటు మరికొందరు వేర్వేరుగా హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. మున్సిపల్ ఎన్నికలకు తాజా నోటిఫికేషన్ జారీచేసేలా మధ్యంతర ఉత్తర్వులు జారీచేయాలని కోరుతూ అనుబంధ వ్యాజ్యాలు దాఖలు చేశారు. ఈ అనుబంధ వ్యాజ్యాలపై పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాదులు వేదుల వెంకటరమణ, పి.వీరారెడ్డి, ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్.శ్రీరామ్, మున్సిపల్ కార్పొరేషన్ల తరఫున ఎన్.రంగారెడ్డి, ఎన్నికల కమిషన్ తరఫున ఎన్.అశ్వనీకుమార్ వాదనలు వినిపించారు. వీరి వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ సోమయాజులు గత వారం ఉత్తర్వులను రిజర్వ్‌లో ఉంచారు. ఈ నెల 15న జారీచేసిన నోటిఫికేషన్ విషయంలో జోక్యం చేసుకోబోమని స్పష్టం చేస్తూ ఆయన శుక్రవారం తన నిర్ణయాన్ని వెలువరించారు.
ఎన్నికల నోటిఫికేషన్‌లో జోక్యం చేసుకోలేం..
Published Sat, Feb 27 2021 3:38 AM | Last Updated on Sat, Feb 27 2021 3:39 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment