సాక్షి, అమరావతి: తమ ఆస్తుల రిజిస్ట్రేషన్లను ప్రజలు సులభంగా చేసుకునేలా ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త విధానం కార్డ్ ప్రైమ్ మరో 4 జిల్లాల్లో ప్రారంభమైంది. నంద్యాల, విశాఖ, అనకాపల్లి, తిరుపతి జిల్లాల్లోని 51 సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో సోమవారం నుంచి ఈ విధానంలోనే రిజిస్ట్రేషన్లు నిర్వహిస్తున్నారు. గత రెండు నెలల నుంచి కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లోని 24 సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు. అక్కడ విజయవంతంగా రిజిస్ట్రేషన్లు జరుగుతుండటంతో దశల వారీగా మిగిలిన అన్ని జిల్లాల్లో ప్రారంభిస్తున్నారు.
ఈ నెల 14న శ్రీకాకుళం, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, వైఎస్సార్, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఈ విధానాన్ని అమలు చేయడం ప్రారంభించనున్నారు. దశల వారీగా ఈ నెలాఖరుకల్లా అన్ని జిల్లాల్లో కొత్త రిజిస్ట్రేషన్ల విధానాన్ని అమలు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
ఇకపై ఈ–సిగ్నేచర్‌తోనే..
ప్రస్తుతం డాక్యుమెంట్‌లో ఆస్తి యజమాని సంతకాలు పెట్టే విధానాన్ని కొనసాగిస్తున్నా త్వరలో ఈ–సిగ్నేచర్‌ను మాత్రమే అనుమతించనున్నారు. సబ్ రిజిస్ట్రార్ సంతకాలు ఇప్పటికే ఈ–సైన్ల ద్వారా జరుగుతున్నాయి. రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత వ్యవసాయ భూములైతే ఆన్‌లైన్‌లో నమోదు చేయించుకోవడానికి తహశీల్దార్ ఆఫీసుకు వెళ్లాల్సిన అవసరం ఉండదు.
రిజిస్ట్రేషన్ పూర్తవగానే ఆటోమేటిక్‌గా మ్యుటేషన్ కూడా కొత్త విధానంలో జరిగిపోతుంది. రిజిస్టర్ అయిన డాక్యుమెంట్లను సంబంధిత సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులు, గ్రామ, వార్డు సచివాలయాలు, మీ–సేవా కేంద్రాలు, సీఎస్‌సీ కేంద్రాల్లో ఎక్కడైనా తీసుకోవచ్చు.
అవగాహన లేకే ‘జిరాక్సుల’ ప్రచారం
కొత్త రిజిస్ట్రేషన్ల విధానంలో ప్రజల డాక్యుమెంట్లను వారికివ్వకుండా జిరాక్సులు మాత్రం వారికిచ్చి, ఒరిజినల్ డాక్యుమెంట్లను సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లోనే ఉంచుతారనే ప్రచారంపై స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్ అండ్ ఐజీ వి.రామకృష్ణ స్పందించారు. లక్షల డాక్యుమెంట్లను దాచిపెట్టేటన్ని బీరువాలు, కప్‌బోర్డులు తమ ఆఫీసుల్లో లేవన్నారు. జిరాక్సుల ప్రచారం అపోహ మాత్రమేనని, అవగాహన లేకుండా ఇలాంటి ప్రచారాలు చేయడం తగదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment