సాక్షి ప్రతినిధి, విజయవాడ: కుంపట్ల కుమ్ములాటలతో ఉమ్మడి కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీ డీలా పడింది. అత్యవసర చికిత్స చేయాలన్న చంద్రబాబు ప్రయత్నాలు వికటించి, పార్టీ పరిస్థితి మరింతగా దిగజారుతోంది. 2019 సాధారణ ఎన్నికల తర్వాత జరిగిన మునిసిపల్, పరిషత్, పంచాయతీ ఎన్నికల్లో ఎదురైన వరుస పరాజయాలతో టీడీపీలో నిస్తేజం నెలకొంది. ఇటీవల మహానాడు నిర్వహించి పార్టీలో ఉత్తేజం నింపాలన్న చంద్రబాబు ప్రయత్నాలు బెడిసికొట్టాయి.
చదవండి: ఎన్నికలకు రెండేళ్ల ముందే.. టీడీపీలో టిక్కెట్ల లొల్లి!
వైఎస్సార్ సీపీ ప్లీనరీ అంచనాలకు మించి విజయవంతం కావడంతో టీడీపీ శ్రేణులు పూర్తిగా నీరుగారిపోయాయి. పార్టీ ఇన్‌చార్జులుగా ఉండేందుకు చాలా నియోజకవర్గాల్లో నాయకులు ముందుకురావటం లేదు. పార్టీలో పెద్ద నాయకులు అనుకుంటున్న వారు కుటుంబ కలహాలతో క్యాడర్‌లో పట్టుకోల్పోతున్నారు. మరికొన్ని చోట్ల నాయకులు చంద్రబాబు, లోకేష్ వర్గాలుగా చీలి పరస్పరం కత్తులు దూసుకొంటున్నాయి. మరో రెండేళ్లలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పార్టీ పరిస్థితిని చూసి టీడీపీ క్యాడర్ డీలాపడింది.
గుడివాడలో తమ్ముళ్ల తన్నులాట
గుడివాడలో టీడీపీ టికెట్ ఆశిస్తున్న రావి వెంకటేశ్వరావు, పిన్నమనేని బాబ్జి, శిష్ట్లా లోహిత్‌లో ఎవరికీ వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే కొడాలి నానిని ఢీకొనే సత్తాలేదని ఇప్పటికే స్పష్టమైంది. వరుసగా నాలుగు సార్లు గెలిచిన కొడాలి నానికి పోటీ ఇచ్చే నేత కోసం చంద్రబాబు జల్లెడపడుతున్నా ఫలితం లేదు. గుడివాడలో మినీ మహానాడు నిర్వహిస్తామని ఘనంగా ప్రకటించిన చంద్రబాబు ఆఖరి నిమిషంలో చేతులు ఎత్తేశారు.
గన్నవరంలో నేతలు కరువు
గన్నవరం నియోజకవర్గంలో టీడీపీని పట్టించుకొనే నాథుడే లేడు. గన్నవరం వెళ్లాల్సిందిగా బయటి నియోజకవర్గాల నేతలను చంద్రబాబు ప్రాథేయ పడటం అక్కడ పార్టీ దుస్థితికి అద్దం పడుతోంది.
తిరువూరులో ఆధిపత్య పోరు
తిరువూరు నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే స్వామిదాస్, మాజీ మంత్రి జవహర్, కొత్తగా నియమితులైన నియోజకవర్గ ఇన్‌చార్జి సేవల దేవదత్తు మధ్య ఆధిపత్య పోరు జరుగుతోంది. కొత్త ఇన్‌చార్జికి నాయకులతో సఖ్యతలేదని, రాజకీయ అనుభవం శూన్యమని పార్టీలోని ముఖ్యనేతలు వ్యతిరేకిస్తున్నారు.
జగ్గయ్యపేటలో కనిపించని సఖ్యత
జగ్గయ్యపేట నియోజకవర్గంలో నెట్టెం రఘురాం, శ్రీరాం తాతయ్య, టీడీ జనార్దన్ వర్గాల మధ్య సఖ్యత లేదు. దీంతో అక్కడ టీడీపీకి సంబంధించిన ముఖ్య సామాజిక వర్గం వారికే టికెట్టు ఇచ్చేలా పెద్దలు పావులు కదపడంతో గందరగోళం నెలకొంది.
పశ్చిమ నియోజకవర్గంలో వర్గపోరు
విజయవాడ పశ్చిమ నియోజకవర్గ టీడీపీలో వర్గపోరు నెలకొంది. లోకేష్ పేరుతో బుద్దా వెంకన్న పెత్తనం చేయాలని చూస్తున్నారు. కార్పొరేషన్ ఎన్నికల్లో ఎంపీ కేశినేని నానిని అధినేత చంద్రబాబు ముందే అవమానించిన వెంకన్నను అధిష్టానం వెనకేసుకు రావడాన్ని ఆయన గొప్పగా చెప్పుకొంటున్నారు. పశ్చిమ నియోజకవర్గంలో తాను చెప్పిన వ్యక్తికే టికెట్ ఇస్తానంటేనే పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటానని చంద్రబాబుకు ఎంపీ కేశినేని తేలి్చచెప్పినట్లు తెలుస్తోంది.
బుద్దా వెంకన్నను దూరంగా ఉంచాలని షరతు పెట్టారట. కానీ లోకేష్ ససేమిరా అనడంతో చంద్రబాబు నిస్సహాయంగా ఉండిపోయారు. దీంతో అలిగిన కేశినేని నాని మహానాడుకు కూడా హాజరు కాలేదు. బీజేపీ పెద్దలతో టచ్‌లో ఉంటున్న ఆయన ఎన్నికలకు ముందు టీడీపీకి ఝులక్ ఇవ్వడానికి సిద్ధమవుతున్నారన్న చర్చ కార్యకర్తల్లో ఉంది. తనకు పార్టీ నియోజకవర్గ బాధ్యతలు అప్పజెప్పకపోవడంతో మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ అలకబూని పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు.
సొంతింట్లోనే కుంపటి..
కేశినేని నాని షరతులను పట్టించుకోని చంద్రబాబు కొత్త ఎత్తుగడ వేసి, అతని తమ్ముడిని ప్రోత్సహిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో కేశినేని నానికి టికెట్ ఇవ్వనని, అతడి తమ్ముడికి ఇస్తానని విజయవాడలోని పార్టీ నేతల వద్ద వ్యాఖ్యానించినట్లు సమాచారం. దీంతో అప్రమత్తమైన కేశినేని నాని సైతం తన సన్నిహితులతో వరుసగా మంతనాలు జరుపుతున్నారు. అందరినీ కూడబెట్టుకొని ఒక్క సారిగా షాక్ ఇవ్వాలనేది ఆయన వ్యూహంగా భావిస్తున్నారు. అదే జరిగితే ఇప్పటికే కొట్టుమిట్టాడుతున్న టీడీపీ దీపం కొడిగట్టడం ఖాయమని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. చివరకు ప్రెస్‌మీట్లు పెట్టే పేపరు పులులే టీడీపీలో మిగులుతారని పార్టీ కార్యకర్తలు బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్నారు. ఇక విజయ వాడ సెంట్రల్, మైలవరం నియోజక వర్గాల్లోనూ అంతకు మించిన పితలాటకాలే ఉన్నాయి.
ఈస్ట్‌లో ‘గద్దె’కు ఎసరు
విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహనరావు పరిస్థితి పైకి కనిపిస్తున్నంత బలంగా లేదు. గద్దె సీటుపై పలువురు టీడీపీ నేతలు కన్నేశారు. లోకేష్ అండదండలతో కొందరు ఎన్‌ఆర్‌ఐలు ఈ నియోజకవర్గానికి అప్పుడప్పుడు వచ్చి వెళ్తుండటంపై గద్దె కుటుంబం గుర్రుగా ఉంది. అవసరమైతే గద్దెను ఎంపీ అభ్యర్థిగా పంపించి, ఎమ్మెల్యే సీటు ఇస్తామని ఓ ఎన్‌ఆర్‌ఐకి అధిష్టానం మాట ఇచ్చిందన్న ప్రచారం జరుగుతోంది. ఈ విషయంపై చంద్రబాబుకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోవడంతో గద్దె తీవ్ర మనస్తాపం చెంది, పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. అనివార్యమైతే ఎంపీ కేశినేని నానితో జట్టు కట్టి వేరే పార్టీకి మారాలన్నది ఆయన ఆలోచనగా టీడీపీ కార్యకర్తలు భావిస్తున్నారు.
పెనమలూరులో త్రిముఖ పోరు
పెనమలూరు నియోజకవర్గంలో బోడె ప్రసాద్, యలమంచిలి బాబురాజేంద్ర ప్రసాద్, దేవినేని గౌతం (పండు) వర్గాల ఆధిపత్య పోరుతో టీడీపీ కునారిల్లుతోంది. లోకేష్ ఆశీస్సులతో పండు వర్గం పెత్తనం చెలాయిస్తోంది. దీంతో ఒకరిపై మరొకరు ఫిర్యాదు చేసుకొంటూ, పార్టీ క్యాడర్‌ను పట్టించుకోకపోడంతో నాయకత్వంపై క్యాడర్ విశ్వాసం కోల్పోయింది.
Comments
Please login to add a commentAdd a comment