సాక్షి, అమరావతి: ప్రతిపక్ష ఎమ్మెల్యేలు అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడు సభను తప్పుదోవ పట్టించారని ప్రివిలేజ్ కమిటీ ఏకాభిప్రాయానికి వచ్చిందని కమిటీ ఛైర్మన్ కాకాణి గోవర్ధన్‌రెడ్డి అన్నారు. ఆయన అధ్యక్షతన మంగళవారం ప్రివిలేజ్ కమిటీ సమావేశం ముగిసింది. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్ష ఎమ్మెల్యేలు అచ్చెన్నాయుడు, నిమ్మలపై చర్యలు తీసుకోవాలని నివేదిక ఇస్తామని తెలిపారు. నోటీసుల సమయంలో అందుబాటులో లేనని కూన రవి చెబుతున్నారని తెలిపారు. అందుబాటులో ఉన్నారని ఫిర్యాదు చేసినవారు తెలిపారని పేర్కొన్నారు.
ఆధారాలు సమర్పించాలని ఇరువురికీ చెప్పామని, ఆధారాల పరిశీలన తర్వాత కూన రవిపై చర్యల విషయంలో నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. నిమ్మగడ్డ తనపై వచ్చిన ఫిర్యాదుపై మరింత సమాచారం కోరారు అని తెలిపారు. కోర్టు పరిధిలో ఉన్నంత మాత్రాన ప్రివిలేజ్ కమిటీలో చర్చించకూదనేం లేదన్నారు. నిమ్మగడ్డకు ఈ వ్యవస్థపై అవగాహన ఉండకపోవచ్చు అని అన్నారు.
సభను తప్పుదోవ పట్టించారన్న శ్రీకాంత్‌రెడ్డి ఫిర్యాదుపై.. అచ్చెన్నాయుడు, నిమ్మలపై చర్యలకు కమిటీ సిఫార్సు చేయనుంది. మద్యం షాపులపై అచ్చెన్నాయుడు సభను తప్పుదోవ పట్టించారని, వృద్ధాప్య పెన్షన్ల విషయంలో నిమ్మల సభను తప్పుదోవ పట్టించారని కమిటీ నిర్ధారణ చేసింది. స్పీకర్‌ను దూషించారనే ఫిర్యాదుపై అచ్చెన్నాయుడు క్షమాపణలు చెప్పడంతో పరిగణలోకి తీసుకొని ప్రివిలేజ్ కమిటీ క్షమించిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment