Punganur Attacks Under The Plan Of TDP Leaders - Sakshi
Sakshi News home page

పక్కా ‘ఎల్లో’ స్కెచ్‌.. ‘పచ్చ’ నేతల కనుసన్నల్లోనే..

Published Sun, Aug 6 2023 4:06 AM | Last Updated on Sun, Aug 6 2023 4:53 PM

Punganur Attacks Under The Plan Of TDP Leaders - Sakshi

శుక్రవారం పోలీసు వాహనాలను ధ్వంసం చేస్తున్న టీడీపీ కిరాయి మూకలు

చిత్తూరు అర్బన్‌:  పుంగనూరు బైపాస్‌ రోడ్డు వద్ద విధ్వంసకాండకు టీడీపీ రెండు రోజుల ముందే వ్యూహ రచన చేసిందా? ఇందులో భాగంగానే పలుమార్లు రూట్‌ మ్యాప్‌ను మార్చారా? కృష్ణదేవరాయ కూడలి వద్ద ముందుగానే రాళ్లు పోగేసుకున్నారా? సమీపంలోని పంట పొలాల్లోకి ఖాళీ మద్యం సీసాలను తీసుకొచ్చి దాచారా? ఈ ప్రశ్నలన్నింటికీ అవుననే సమాధానం వినిపిస్తోంది. ఎలాగైనా సరే అల్లర్లు సృష్టించి, రాజకీయ లబ్ధి పొందాలని పన్నాగం పన్నారని స్పష్టమవుతోంది.

టీడీపీ పెద్దల సూచన మేరకు కొందరు నేతలు, కార్యకర్తల కనుసన్నల్లో ఈ వ్యూహం రూపొందిందని ప్రత్యక్ష సాక్షుల ద్వారా తెలుస్తోంది. ముందుగా రూపొందించిన వ్యూహం మేరకు చంద్రబాబు నాయుడు నుంచి వచ్చిన అధికారిక పర్యటన రూట్‌ మ్యాప్‌లో పుంగనూరు పట్టణంలో ఎలాంటి కార్యక్రమం లేదు. అయినప్పటికీ పుంగనూరు పట్టణంలోకి చంద్రబాబు రావడానికి పట్టుపట్టాలని, అందుకు పోలీసులు ఒప్పుకోరని.. అప్పుడు పోలీసులపై రాళ్లు రువ్వాలన్నది ముందస్తు వ్యూహం.

ఇందులో భాగంగా ముందురోజు కొన్ని వాహనాల్లో రాళ్లను తీసుకొచ్చి కృష్ణదేవరాయుల కూడలి సమీపంలో అక్కడక్కడ పోసి ఉంచారు. బార్లు, మద్యం షాపుల నుంచి ఖాళీ బీరు సీసాలు, మద్యం బాటిళ్లను తీసుకొచ్చి సమీపంలోని పొలం వద్ద దాచారు. పరిస్థితిని బట్టి ఉపయోగించాలని కొన్ని బాటిళ్లల్లో పెట్రోలు నింపుకొచ్చి అక్కడ ఉంచారు. చంద్రబాబు నాయుడుకు స్వాగతం పలికేందుకు తీసుకొచ్చిన 50కి పైగా పెద్ద సైజు పేలుడు పదార్థాల ఉండలను (బాంబుల్లాంటివి) ఓ ప్రదేశంలో దాచారు.

శుక్రవారం సదుం, పులిచెర్ల, సోమల మండలాల నుంచి పలువురిని కిరాయికి తీసుకొచ్చి జన సమూహంలో కలిపేశారు. అంగళ్లలో చంద్రబాబు ఎప్పుడైతే రెచ్చగొట్టే ప్రసంగం చేస్తూ.. ‘పదండి పుంగనూరుకు.. ఆ పుడింగి సంగతి తేలుద్దాం’ అని పిలుపునిచ్చారో ఆ తర్వాత కూడా పలువురు టీడీపీ నేతలు మదనపల్లి నుంచి వస్తూ వస్తూ వారి వాహనాల్లో ఖాళీ మద్యం బాటిళ్లు, రాళ్లు, కర్రలు వేసుకుని వచ్చారు.

ఈ నేపథ్యంలో శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల తర్వాత స్థానిక టీడీపీ ఇన్‌చార్జ్‌ చల్లా బాబు బైపాస్‌ రోడ్డు వద్దకు చేరుకుని, చంద్రబాబును పట్టణంలోకి అనుమతించాలని పట్టుపట్టారు. జెడ్‌ ప్లస్‌ సెక్యూరిటీ ఉన్న ప్రతిపక్ష నేత పర్యటనను ఎలా పడితే అలా ఉన్నట్లుండి మార్చడం కుదరదని పోలీసులు చెప్పినా వినిపించుకోలేదు. దీంతో కార్యకర్తల్ని చల్లా బాబు రెచ్చగొట్టాడు.  
 
బాటిళ్లు, చెప్పులతో దాడి     
చల్లా బాబు మాటలతో రెచ్చిపోయిన కార్యకర్తలు.. ఇద్దరు డీఎస్పీలను లక్ష్యంగా చేసుకుని దాడులకు తెగబడ్డారు. గతేడాది కుప్పంలో చంద్రబాబు నాయుడు పర్యటనలో ప్రసంగాలకు ముందస్తు అనుమతిలేదని పలమనేరు డీఎస్పీ సుధాకర్‌రెడ్డి, చిత్తూరు దిశ పోలీస్‌ స్టేషన్‌ డీఎస్పీ బాబుప్రసాద్‌ నోటీసులు జారీ చేశారు. ‘నాకే నోటీసులు ఇచ్చే ధైర్యమా? మీ కథ చూస్తా’ అంటూ అప్పుడు చంద్రబాబు సైతం డీఎస్పీలకు హెచ్చరికలు జారీ చేశారు.

ఈ నేపథ్యంలో ఈ ఇద్దరు డీఎస్పీలను లక్ష్యంగా చేసుకున్న టీడీపీ శ్రేణులు తొలుత ప్లాస్టిక్‌ వాటర్‌ బాటిళ్లు, చెప్పులను పోలీసులపైకి విసిరారు. ఇది పద్ధతికాదని పోలీసు అధికారులు నచ్చజెపుతుండగానే ఒక్కసారిగా పక్కనే ఉన్న రాళ్లు విసురుతూ విరుచుకుపడ్డారు. పోలీసులు తేరుకునేలోపే టీడీపీ నేతలు తీసుకొచ్చిన కిరాయి కార్యకర్తలు వందల సంఖ్యలో రాళ్లు, మద్యం బాటిళ్ల వర్షాన్ని కురిపించారు. దీంతో పరిస్థితి అదుపుతప్పింది.  
 
పోలీసులు బతిమాలినా వదల్లేదు 
కొందరు పోలీసులు వద్దని బతిమిలాడుతుంటే వాళ్లను వ్యాను పక్కకు లాక్కెళ్లి పోలీసు లాఠీలు లాక్కుని మరీ చావ బాదారు. టపాకాయ బాంబులను పోలీసులపై విసురుతుంటే ఏం జరుగుతుందో కూడా తెలియని స్థితిలో తమను తాము కాపాడుకునే ప్రయత్నంలో చేతిలో ఉన్న ప్లాస్టిక్‌ గార్డులను అడ్డుగా పెట్టారు. రాళ్ల దెబ్బకు అవన్నీ ధ్వంసమయ్యాయి.

అంతటితో ఆగక పోలీసుల వాహనాలపైకి టపాకాయ బాంబులు విసురుతూ.. ముందుగా తెచ్చుకున్న పెట్రోలును వాటిపై పోసి నిప్పంటించారు. రాళ్ల దెబ్బలతో రక్తమోడుతున్న పోలీసులను చూసి మానవత్వం లేకుండా దాదాపు 40 నిమిషాల పాటు ఏకధాటిగా రాళ్లు, బాటిళ్లను విసురుతూ పచ్చ మూకలు పైశాచిక ఆనందం పొందాయి. 
 
కీలకపాత్రధారి చల్లా బాబు   
– మీడియాతో డీఐజీ అమ్మిరెడ్డి, ఎస్పీ రిషాంత్‌ 
పుంగనూరులో జరిగిన అల్లర్లు, పోలీసులపై దాడులు మొత్తం ముందస్తు ప్లాన్‌ ప్రకారం జరిగినవేనని రాయలసీమ డీఐజీ అమ్మిరెడ్డి, చిత్తూరు ఎస్పీ రిషాంత్‌రెడ్డి స్పష్టం చేశారు. శనివారం చిత్తూరులోని పోలీసు అతిథి గృహంలో వారు మీడియాతో మాట్లాడారు. పుంగనూరులో టీడీపీ మూకలు పోలీసులపై ఎలా దాడులకు పాల్పడ్డాయో వీడియో ద్వారా చూపించారు. కొన్నిచోట్ల పోలీసులు బతిమాలుతున్నా వినిపించుకోకుండా, వాళ్ల లాఠీలు లాక్కుని పోలీసుల్నే కొట్టారని చెప్పారు.

వాహనాలపైకి టపాకాయ బాంబులు వేయడంతోపాటు, పెట్రోలు పోసి నిప్పంటించారని చెప్పారు. అసలు చంద్రబాబు నాయుడు ఇచ్చిన షెడ్యూల్‌ మేరకు పుంగనూరు పట్టణంలో ఆయన పర్యటనే లేదని, స్థానిక టీడీపీ ఇన్‌చార్జ్‌ చల్లా బాబు ఉద్దేశ పూర్వకంగా ప్లాన్‌ చేసి గొడవలు సృష్టించారన్నారు. బాబును పుంగనూరులోకి అనుమతించాలని పార్టీ శ్రేణులను రెచ్చగొట్టి పోలీసులపై దాడులు చేయించారని చెప్పారు.

ప్రజల ప్రాణ, మాన, ఆస్తులను కాపాడడమే లక్ష్యంగా పోలీసులు ధైర్యంగా నిలబడి అల్లరి మూకలు పుంగనూరులోకి ప్రవేశించకుండా అడ్డుగా నిలబడ్డారని తెలిపారు. దెబ్బలు తగిలి రక్తం కారుతున్న వేళ, పోలీసుల వద్ద ఆయుధాలు ఉన్నప్పటికీ సంయమనం పాటించారన్నారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పోలీసులు విధులు నిర్వర్తించి ధైర్య సాహసాలు ప్రదర్శించారని ప్రశంసించారు.

ఈ దాడుల్లో పుంగనూరు టీడీపీ ఇన్‌చార్జ్‌ చల్లా బాబు కీలక పాత్రధారిగా కేసు నమోదు చేశామన్నారు. విధుల్లో ఉన్న పోలీసులను చంపాలని చూడడం, పోలీసు వాహనాలు ధ్వంసం చేయడం తదితర సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని చెప్పారు. ప్రస్తుతం 40 మందిని అరెస్టు చేశామని, మరికొందరిని అరెస్టు చేయాల్సి ఉందన్నారు.  
 
చివరకు చిల్లర గొడవలే దిక్కా!?   
ముందస్తు మేనిఫెస్టో, లోకేశ్‌ పాదయాత్ర.. ఇలా ఎన్ని ప్రయత్నాలు చేసినా టీడీపీ తేరుకునే అవకాశాలు లేకపోవడంతో చంద్రబాబు చివరకు తనకు అలవాటైన ఘర్షణలనే నమ్ముకున్నారని పుంగనూరు ఘటన స్పష్టం చేస్తోంది. ప్రజాదరణ లేదని తేలిపోవడంతో రోడ్‌షోలతో వీధి గొడవలకు దిగుతున్నారు. ప్రాజెక్టుల సందర్శన ముసుగులో పర్యటిస్తున్న చంద్రబాబు అసలు ఆ అంశాలకు ప్రాధాన్యం ఇవ్వడం లేదు.

అంతిమ లక్ష్యం రెచ్చగొట్టి ఘర్షణలకు పురిగొల్పడమేనని స్పష్టమవుతోంది. తన పర్యటనలను యుద్ధభేరిగా మార్చుకోవటాన్ని బట్టే వాస్తవాలు బహిర్గతమవుతున్నాయి. ఇందులో భాగంగానే రాయలసీమలో గొడవలు సృష్టించేందుకు ఒక పథకం ప్రకారం చంద్రబాబు పర్యటనల ద్వారా డిజైన్‌ చేసినట్లు స్పష్టమవుతోంది.

తొలుత పులివెందులలో కూడా ఇలానే రెచ్చగొట్టి గొడవ సృష్టించడానికి విఫలయత్నం చేయడం తెలిసిందే. వాస్తవానికి పులివెందులలో టీడీపీకి దిక్కులేదు. అందుకే కిరాయి జనంతో రోడ్‌షో నిర్వహించి హడావుడి చేశారు. అనుకున్న లక్ష్యం నెరవేరక పుంగనూరుపై దృష్టి సారంచి, గొడవ సృష్టించడంలో సఫలమయ్యారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement