Rajamohan Reddy asks CM Jagan: Set Up Agriculture University Name of Goutham Reddy - Sakshi
Sakshi News home page

Mekapati Rajamohan Reddy: ‘మెరిట్స్‌’ ఆస్తులు ప్రభుత్వానికి.. గౌతమ్‌రెడ్డి పేరిట అగ్రికల్చర్‌ యూనివర్సిటీ

Published Fri, Feb 25 2022 1:06 PM | Last Updated on Sat, Feb 26 2022 10:06 AM

Rajamohan Reddy asks CM Jagan to set up Agriculture University Name of Gouthtam Reddy - Sakshi

సీఎం వైఎస్‌ జగన్‌తో మాట్లాడుతున్న మేకపాటి రాజమోహన్‌రెడ్డి (ఫైల్‌)  

సాక్షి, ఉదయగిరి: మేకపాటి రాజమోహన్‌రెడ్డి ఇంజినీరింగ్‌ కళాశాల (మెరిట్స్‌)ను మేకపాటి గౌతమ్‌రెడ్డి పేరుతో అగ్రికల్చర్‌ యూనివర్సిటీగా మార్చాలని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని రాజమోహన్‌రెడ్డి కోరారు. అత్యంత విషాదకర సమయం.. తన ముద్దుల కొడుకు, మేకపాటి కుటుంబ రాజకీయ ఆశాసౌధం హఠాన్మరణం తట్టుకోలేక దుఃఖాన్ని పంటి బిగువున బిగబట్టుకున్న వేళ.. ఇంతటి బాధాతప్త సమయంలో కూడా నెల్లూరు పెద్దాయన రాజమోహన్‌రెడ్డి ఉదయగిరి, ఆత్మకూరు మెట్ట ప్రాంతాల అభివృద్ధిని మరువలేదు.

బుధవారం ఇంజినీరింగ్‌ కళాశాలలో జరిగిన మంత్రి గౌతమ్‌రెడ్డి అంత్యక్రియలకు సీఎం వైఎస్‌ జగన్‌ విచ్చేశారు. ఈ సందర్భంగా సీఎంతో పెద్దాయన మెట్ట ప్రాంత అభివృద్ధి, పలు విషయాల గురించి మాట్లాడారు. ఉదయగిరిలో వందెకరాల్లో తాను ఏర్పాటుచేసిన ఇంజినీరింగ్‌ కళాశాలకు చెందిన రూ.225 కోట్ల విలువైన ఆస్తులను ప్రభుత్వానికి స్వచ్ఛందంగా అప్పగించేందుకు సిద్ధంగా ఉన్నట్లు సీఎంతో చెప్పారు. దీనికిగానూ మేకపాటి గౌతమ్‌రెడ్డి పేరుతో అగ్రికల్చర్‌ యూనివర్సిటీగా మార్చాలని కోరారు. స్పందించిన సీఎం త్వరలో జరిగే అసెంబ్లీ సమావేశాల్లోనే కళాశాల పేరు మార్చడంతోపాటు అగ్రికల్చర్‌ యూనివర్సిటీగా మార్చేందుకు తగిన చర్యలు తీసుకుంటామని పెద్దాయనకు హామీ ఇచ్చారు.

ఉదయగిరి, ఆత్మకూరు నియోజకవర్గాలతోపాటు గతంలో తాను ప్రాతినిధ్యం వహించిన ఒంగోలు మెట్ట ప్రాంతాలకు తాగు, సాగునీరందించే వెలుగొండ ప్రాజెక్టు, సోమశిల హై లెవెల్‌ కెనాల్, ఫేజ్‌–1, ఫేజ్‌–2లను పూర్తి చేసి త్వరగా డెల్టాగా మార్చాలని రాజమోహన్‌రెడ్డి కోరారు. వెలుగొండ ప్రాజెక్టును వీలైనంత త్వరగా పూర్తి చేస్తామని సీఎం హామీ ఇచ్చారు. 

చదవండి: (పోలీస్‌ స్టేషన్ల పరిధి మార్పు.. ప్రభుత్వం ఉత్తర్వులు)

వీఎస్‌యూలో ఘన నివాళి 
వెంకటాచలం: మండలం కాకుటూరులోని విక్రమ సింహపురి యూనివర్సిటీ (వీఎస్‌యూ)లో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డికి గురువారం ఘన నివాళులర్పించారు. వీఎస్‌యూ వీసీ జీఎం సుందరవల్లి, రెక్టార్‌ ఎం.చంద్రయ్య, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎల్‌.విజయకృష్ణారెడ్డి తదితరులు గౌతమ్‌రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ మంచి వ్యక్తిత్వం కలిగిన గౌతమ్‌రెడ్డి అకాల మరణం చాలా బాధాకరమన్నారు.

రిజిస్ట్రార్‌ మాట్లాడుతూ ఉన్నత విద్యావంతుడు, వ్యాపారవేత్త అయిన వ్యక్తి ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రిగా బాగా పనిచేసి మంచి పేరు తెచ్చుకున్నారన్నారు. అనతికాలంలోనే పలు అంతర్జాతీయ సంస్థలు, పరిశ్రమలను రాష్ట్రానికి తీసుకువచ్చి అభివృద్దిలో కీలకపాత్ర పోషించారని కొనియాడారు. ఆయన అకాలమరణం రాష్ట్రానికి తీరనిలోటని చెప్పారు. కార్యక్రమంలో డిప్యూటీ రిజిస్ట్రార్‌ డాక్టర్‌ సాయిప్రసాద్‌రెడ్డి, అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌ సుజయ్‌కుమార్, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement