సచివాలయంలో మంత్రి పేర్నినానితో భేటీ అయిన సినీ దర్శకుడు రాంగోపాల్‌వర్మ
సాక్షి, అమరావతి: సినిమా టికెట్ రేట్ల విషయంలో అంతిమ నిర్ణయం ప్రభుత్వానిదేనని ప్రముఖ దర్శక, నిర్మాత రామ్‌గోపాల్ వర్మ (ఆర్జీవీ) చెప్పారు. ప్రభుత్వం నియమించిన కమిటీ ద్వారా మంచి నిర్ణయం వెలువడుతుందనే నమ్మకం ఉందన్నారు. రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి పేర్ని నానితో ఆయన సోమవారం సచివాలయంలో భేటీ అయ్యారు. అనంతరం ఆర్జీవీ విలేకరులతో మాట్లాడుతూ ‘టికెట్ రేట్ల తగ్గింపు విషయంలో నా అభిప్రాయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లా. చర్చలు వంద శాతం సంతృప్తినిచ్చాయి. టికెట్ ధరలు తగ్గించొద్దని చెప్పాను. సినిమా తీసిన వాళ్లకే టికెట్ రేటు నిర్ణయించుకునే అధికారం ఇవ్వాలని కోరాను. సినీ పరిశ్రమకు ప్రతినిధిగా రాలేదు. ఒక దర్శక, నిర్మాతగా మాత్రమే వ్యక్తిగత వాదన వినిపించాను’ అని చెప్పారు.
రాజకీయ కక్ష సాధింపులో భాగంగా ప్రభుత్వం టికెట్ ధరలను తగ్గించిందనే వాదనతో ఏకీభవించనని చెప్పారు. పవన్, బాలకృష్ణను టార్గెట్ చేయడానికి ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకుంటోందనే ఆరోపణలు సరైనవి కావన్నారు. ‘సినీ రంగమంటే ఒకరిద్దరు కాదు. ఈ ఒక్క చర్చతోనే టికెట్ల అంశానికి ముగింపు రాదు. పరిశ్రమలోని వందల మంది అభిప్రాయాలను ప్రభుత్వం తీసుకుంటుంది. ఇండస్ట్రీకి, ప్రభుత్వానికి భేదాభిప్రాయాలు ఉండకూడదు. అందుకే సినీ పరిశ్రమలో ఏం జరుగుతుందో మంత్రికి వివరించాను.’ అని చెప్పారు. ఏపీలో నిబంధనలు పాటించకపోవడం వల్లే థియేటర్లు మూసివేశారన్నారు. కలెక్షన్లు, పన్ను ఎగవేతపై ప్రభుత్వాన్ని మోసం చేస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవచ్చన్నారు.
ఎవరైనా వచ్చి మాట్లాడొచ్చు: మంత్రి పేర్ని నాని
టికెట్ రేట్ల విషయంలో ఆర్జీవీలానే సినీ పరిశ్రమలో ఎవరైనా వచ్చి అభిప్రాయాలు తెలపవచ్చని మంత్రి పేర్ని నాని చెప్పారు. వర్మతో భేటీ అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. తమ ప్రభుత్వం ఎవరినీ ఇబ్బంది పెట్టడం లేదని తెలిపారు. సినిమాటోగ్రఫీ చట్టంలోని అంశాలనే అమలు చేస్తున్నామన్నారు. 2013లో ఇచ్చిన జీవోతో పోలిస్తే రేట్లు పెంచామని చెప్పారు. అభ్యంతరాలు ఉంటే ప్రభుత్వం నియమించిన కమిటీ దృష్టికి తీసుకెళ్లొచ్చన్నారు.
త్వరలోనే ఈ కమిటీ మరోసారి భేటీ అవుతుందన్నారు. కరోనా నేపథ్యంలో నైట్ కర్ఫ్యూతో పాటు థియేటర్లలో 50 శాతం ఆక్యుపెన్సీ నిబంధన విధించామని చెప్పారు. సంక్రాంతికి సినిమా విడుదలకు ఇబ్బందిపడే వారు వాయిదా వేసుకోవాలన్నారు. కోవిడ్ కారణంగానే ‘ఆర్‌ఆర్‌ఆర్’, రాథే శ్యామ్ విడుదల వాయిదా వేసుకున్నారని గుర్తు చేశారు. కోవిడ్ టాస్క్‌ఫోర్స్ పరిస్థితులను అధ్యయనం చేసి నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment