AP at US : వరుసగా నాలుగోసారి రత్నాకర్‌కు కీలక బాధ్యతలు | Ratnakar appointed as special representative for US & Canada for the fourth time | Sakshi
Sakshi News home page

AP at US : వరుసగా నాలుగోసారి రత్నాకర్‌కు కీలక బాధ్యతలు

Published Sat, Oct 14 2023 3:27 PM | Last Updated on Thu, Oct 19 2023 6:44 AM

Ratnakar appointed as special representative for US & Canada for the fourth time - Sakshi

ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి (నార్త్ అమెరికా) పదవికి పండుగాయల రత్నాకర్ మరోసారి ఎంపిక అయ్యారు. కడప జిల్లా రాజంపేట కు చెందిన వైయస్ఆర్ సీపీ నేత అయిన రత్నాకర్‌ను ఈ పదవిలో నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.  ఈ పదవి ఆయన్ను వరించడం ఇది వరుసగా నాలుగోసారి. 2019లో తొలిసారి బాధ్యతలు చేపట్టిన రత్నాకర్ రెండేళ్లపాటు పదవిలో కొనసాగారు. ఆపై 2021, 2022లో ప్రభుత్వం రత్నాకర్ పదవీకాలాన్ని పొడిగిస్తూ వచ్చింది. ఇపుడు తాజాగా మరో ఏడాదిపాటు పదవిలో కొనసాగేలా ఉత్తర్వులు జారీ చేసింది. 

ముఖ్యమంత్రికి ధన్యవాదాలు
వరుసగా నాలుగోసారి పదవి వరించడంతో రత్నాకర్ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్‌ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. తనకు అన్ని విధాలుగా సహకరించి ప్రోత్సహిస్తున్న పార్టీలోని కీలక నాయకులకు, సహచర కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. బుధవారం ముఖ్యమంత్రి కార్యాలయానికి వచ్చిన రత్నాకర్.. తన పట్ల నమ్మకం ఉంచినందుకు సీఎం YS జగన్ మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. తనకు అప్పగించిన బాధ్యతలకు నూరు శాతం న్యాయం చేస్తానని,  ప్రవాసాంధ్రులకు అన్ని రకాలుగా ఏపీ ప్రభుత్వం నుంచి అండగా నిలుస్తామని, వచ్చే ఎన్నికల్లో సీఎం జగన్ ప్రభుత్వాన్ని మళ్లీ నిలబెట్టుకునేందుకు తన వంతుగా శాయశక్తుల కృషి చేస్తానని తెలిపారు.

దశాబ్ద కాలంగా పార్టీతో ప్రయాణం
బలిజ/ కాపు సామాజికవర్గానికి చెందిన రత్నాకర్ వైయస్ఆర్ సీపీ ఆవిర్భావం నుండి పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. వివిధ పదవుల్లో పార్టీకి సేవలందించారు. 2014 ఎన్నికలు, 2017లో జరిగిన నంద్యాల ఉపఎన్నికల్లో పార్టీ కోసం తనవంతుగా కృషిచేశారు. 2017 నుండి 2019 వరకు సాగిన వైయస్ జగన్ జగన్ ప్రజాసంకల్ప పాదయాత్రలో అధినేతతో కలిసి అడుగులు వేశారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా అభ్యర్థులతో కలిసి ప్రచారంలో పాల్గొన్నారు. బద్వేలు, తిరుపతి పార్లమెంట్ ఉపఎన్నికలు, స్థానికసంస్థల ఎన్నికల్లో పార్టీ యంత్రాoగంతో కలిసి అభ్యర్థుల గెలుపుకు పనిచేశారు. 2015 నుండి రత్నాకర్ వైయస్ఆర్ సీపీ అమెరికా విభాగానికి కన్వీనర్ గా వ్యవహరిస్తున్నారు. అమెరికాలో వైయస్ఆర్ సీపీ మద్దతుదారులను ఏకీకృతం చేయడం, పార్టీ కార్యక్రమాలను నిర్వహించడంతో పాటు ఏపీలో జరిగే వైయస్ఆర్ సీపీ కార్యక్రమాల్లో ఆయనను చురుగ్గా పాల్గొంటున్నారు. సోషల్ మీడియాలోనూ నిత్యం యాక్టివ్ గా ఉంటూ వేలాది వైయస్ఆర్ సీపీ సోషల్ మీడియా  కార్యకర్తలకు రత్నాకర్ చేరువయ్యారు. సమర్థత, విధేయతకు పట్టం కడుతూ వరుసగా నాలుగోసారి ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్‌రెడ్డి అమెరికా, కెనడాలకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా రత్నాకర్‌ను ఎంపిక చేశారు. 

అమెరికాలో తెలుగు విద్యార్థులకు తోడుగా
ఇటీవల ఏపీ ప్రభుత్వ పాఠశాలలకు చెందిన 10 మంది విద్యార్థులతో కూడిన బృందం అమెరికాలో పర్యటించింది. ఈ పర్యటనను రత్నాకర్ దగ్గరుండి పర్యవేక్షించారు. పర్యటన ఆద్యంతం ఏపీ నుండి వచ్చిన బృందానికి సహాయ సహకారాలు అందించారు. ఐక్యరాజ్యసమితి, వరల్డ్ బ్యాంక్, ఐఎంఎఫ్, వైట్ హౌస్, కొలంబియా యూనివర్సిటీలో ఏపీ విద్యార్థులు "విద్య" పై ప్రసంగించారు. విద్యావ్యవస్థలో సీఎం వైయస్ జగన్ ప్రవేశపెట్టిన సంస్కరణలు, నిరుపేదల చదువుల కోసం అమలు చేస్తున్న ప్రభుత్వ పథకాలను గురించి వివరించారు. నిరుపేదలైన విద్యార్థులు ప్రపంచ వేదికలపై అనర్గళంగా మాట్లాడడం పట్ల రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరిగింది. సోషల్ మీడియా మాధ్యమాల్లో సీఎం వైయస్ జగన్ విద్యావిధానాలను ప్రశంసిస్తూ నెటిజన్లు పోస్టులు పెట్టారు. ఈ పర్యటన విజయవంతం కావడంతో రత్నాకర్ ను ముఖ్యమంత్రి వైయస్ జగన్ అభినందించారు. ఇదొక్కటే కాదు, అమెరికా, కెనడాల్లో ప్రవాసాంధ్రులకు ఎప్పుడు అందుబాటులో ఉంటూ ఏ ఇబ్బంది వచ్చినా తానున్నానంటూ అండగా ఉన్నారు రత్నాకర్.

ఇచ్చిన ప్రతీ హామీ నెరవేర్చిన ప్రభుత్వం ఇది
సీఎం వైయస్ జగన్ దేశ చరిత్రలోనే గొప్ప నాయకుడని, నాలుగున్నరేళ్ల పాలనలో పేదల జీవితాలు మార్చేలా అద్భుతాలు సృష్టించిన ఘనత ఆయనదని రత్నాకర్ కొనియాడారు. ఇలాంటి నాయకుడితో కలిసి పనిచేయడం తన అదృష్టమన్నారు. 2024 ఎన్నికల్లో YSRCP ప్రభుత్వం మళ్లీ ఘనవిజయం సాధిస్తుందని.. సీఎం జగన్ 2.0 ప్రభుత్వం కోసం రాష్ట్రప్రజలంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని అన్నారు. 2024 తర్వాత కూడా మరిన్ని విప్లవాత్మక కార్యక్రమాలతో ఏపీని దేశంలోనే నెం 1 రాష్ట్రంగా సీఎం జగన్ నిలబెడతారని రత్నాకర్ పేర్కొన్నారు. 

మిషన్‌ 2024
వచ్చే ఏడాది ఆంధ్రప్రదేశ్‌కు ఎన్నికలు రానున్నాయని, ఈ ఎన్నికల్లో ప్రజలు సమర్థత, సంక్షేమానికి పట్టం కట్టాలని విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్‌నుంచి వేలాది మంది అమెరికాలో ఉన్నారని, వీరందరిని ఎన్నికలకు సమాయత్తం చేస్తున్నామని, సీఎం జగన్‌ ప్రభుత్వం చేస్తోన్న అభివృద్ధి సంక్షేమాన్ని ఎప్పటికప్పుడు వివిధ కార్యక్రమాలు, తెలుగు  మహా సభల ద్వారా ప్రవాసాంధ్రుల మద్ధతుతో YSRCP ఘనవిజయానికి శాయశక్తులా కృషి చేస్తామని రత్నాకర్‌ తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement