అనుబంధాలకూ కరోనా గండం! | Relationship Struggles During Pandemic | Sakshi
Sakshi News home page

అనుబంధాలకూ కరోనా గండం!

Published Fri, Apr 30 2021 4:19 AM | Last Updated on Fri, Apr 30 2021 4:20 AM

Relationship Struggles During Pandemic - Sakshi

సాక్షి, అమరావతి: ఏడాది క్రితం లాక్‌డౌన్‌ సమయంలో కృష్ణ జిల్లా గుమ్మడిదూరులోని వెంకటేశ్వరరావుకు నెల రోజుల పాటు ఆనందమే కన్పించింది. హైదరాబాద్‌ నుంచి అన్న కొడుకు సంజీవ్‌.. బెంగళూరు నుంచి తమ్ముడి కూతురు స్వప్న.. పుణె నుంచి తన కొడుకు మనోహర్‌.. ఊరొదిలిన ఇంకా అనేక మంది వచ్చారు. రోజుకో ఇంట్లో కలిసేవాళ్లు. చిన్నతనంలో ఆడిన అష్టాచెమ్మా.. దాడితో పాటు.. క్యారం బోర్డు.. సందడే సందడి. ఇప్పుడూ.. మళ్లీ అంతా ఇల్లు చేరారు. కానీ ఎవరూ ఎవరింటికీ వచ్చే సాహసం చేయడం లేదు. సంజీవ్‌ వస్తుంటేనే ముఖానికి గుడ్డ (మాస్క్‌) కట్టుకుంటున్నాడు మనోహర్‌. ఆఖరుకు పక్కింటికి వెళ్లడానికి ఇష్టపడడం లేదు. అప్పట్లో లాగా ఉదయం నడక కూడా లేదు. పలకరింపులన్నీ ఫోన్లోనే. వీడియో కాల్‌లోనే యోగక్షేమాలు.  

మొదటి దశలో ఇలా.. 
మొదటి విడత కరోనా కాలంలో ఒక రకంగా కుటుంబ అనుబంధాలు పెరిగాయి.‘అబ్బా ఎన్నాళ్లకు ఆనందం చూశాం’ అంటూ ఇంటి పెద్దల్లో ఆనందం ఉండేది. ఉపాధి వేటలో ఊరొదిలిన వాళ్లు సైతం సొంతూళ్లకు రావడంతో జ్ఞాపకాలు నెమరు వేసుకునే అవకాశం చిక్కింది. మనసారా మాట్లాడుకునే సమయం వచ్చింది. ‘ఉదయం అంతా కలిసే వాకింగ్‌కు వెళ్లే వాళ్లం. మధ్యాహ్నం అంతా కలిసే భోజనం చేసేవాళ్లం’ గతేడాది సన్నివేశాన్ని తెలిపింది లక్ష్మి. వాళ్లకే తెలియని చిన్ననాటి విషయాలు చెబుతుంటే.. పొలం గట్టుకు తీసుకెళ్లి చూపిస్తుంటే.. ఆ సాఫ్ట్‌వేర్‌ పిల్లలు నిజంగా చిన్నపిల్లలే అయ్యారని వెంకటేశ్వరరావు తెలిపారు.

ఎక్కడ్నుంచో ఊరికొచ్చిన వాళ్లు కాకపోతే ఓ వారం పాటు ఇల్లు కదలకుండా (క్వారంటైన్‌) ఉండేవాళ్లు. ఆ తర్వాత అంతా ఫ్రీనే.  అమ్మమ్మ, తాతయ్యతో నెలకోసారి కూడా మాట్లాడే వీల్లేని వాళ్లు దాదాపు మూడు నెలలు కలిసిమెలిసి ఉన్నారు. ఎక్కడ్నుంచో వచ్చి.. ఊళ్లో చిన్ననాటి మిత్రులతో ఆడుకోవడం కొత్త అనుభవంగా ఫీలయ్యారు. నిజానికి కరోనా కష్టకాలమే అయినా.. ఊరంతా ఓ పండుగ వాతావరణమే ఉండేది.  

ప్రస్తుతం అంతా రివర్స్‌.. 
ఇప్పుడా పరిస్థితి ఎక్కడా కన్పించడం లేదు. ఒక ఇంట్లో వాళ్లే కారులో వెళ్లినా మాస్క్‌ వేసుకోవడం తప్పనిసరి. కలిస్తే కరోనా.. మాట్లాడితే కరోనా.. దగ్గరగా వెళ్తే కూడా వచ్చే ఛాన్స్‌ ఉందంటూ జరిగే ప్రచారంతో భయం పట్టుకుంది. కనీసం పక్కింటి నుంచి మంచినీళ్లు కూడా అడగలేకపోతున్నారు. ‘జగ్గయ్యపేటలో ఉండే బంధువు ఇంట్లో చిన్న పూజ పెట్టుకున్నారు. పిలవడానికొస్తామంటే.. వద్దు ఫోన్‌లో చెప్పారుగా చాలు’ అనాల్సి వచ్చిందని విజయవాడలో ఉంటున్న సంధ్యారాణి తెలిపింది. వత్సవాయికి చెందిన సత్యవేణి విజయవాడలో ఉన్న తన తండ్రికి బాగోలేకపోతే వీడియో కాల్‌లోనే పరామర్శించినట్టు చెప్పింది.

గ్రామాల్లోనైతే మెయిన్‌ గేట్‌కు తాళం పెట్టుకుని ఇంట్లోకి ఎవరూ రాకుండా కట్టడి చేస్తున్నారు. ఏడాదిలోనే ఆ బంధం ఏమైంది? ఇంతలోనే ఆ అనుబంధాన్ని కరోనా ఎలా కమ్మేసింది? మనిషికి మనిషి దూరం అనివార్యమే అయినా... పెనవేసుకున్న అనుబంధాన్ని అది దూరం చేసిందనే బాధ ప్రతిఒక్కరిలోనూ కన్పిస్తోంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement