సాక్షి, అమరావతి: ప్రతి నెలా విద్యుత్ బిల్లు చేతికందగానే చాలామంది చేసే తప్పు.. దాన్ని సకాలంలో చెల్లించకపోవడం. ‘కడదాంలే’ అని బిల్లును పక్కనపెట్టి మర్చిపోతుంటారు. ఇలా బిల్లు చెల్లించడంలో జరుగుతున్న జాప్యంతో వారికి అదనపు చార్జీలు పడుతున్నాయి. ఇలా కాకుండా కరెంట్ బిల్లుని నిర్దేశిత సమయంలోగా కడితే సర్‌చార్జ్, ఇంధన చార్జ్, జరిమానాల నుంచి తప్పించుకోవచ్చని అధికారులు చెబుతున్నారు.
ఆ లోగా కట్టేస్తే సరి..
రాష్ట్రంలో తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థల పరిధిలో 1.91 కోట్ల మంది విద్యుత్ వినియోగదారులున్నారు. వీరంతా రోజుకి 229 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను వినియోగిస్తున్నారు. అయితే నెలవారీ బిల్లులు చెల్లించడంలో మాత్రం జాప్యం చేస్తున్నారు. ప్రతి నెల 1 నుంచే స్పాట్ బిల్లింగ్ రీడర్లు ఇళ్లకు వచ్చి విద్యుత్ మీటర్ నుంచి రీడింగ్ తీసి వినియోగదారులకు బిల్లు అందిస్తున్నారు. ఆ బిల్లు తీసిన రోజు నుంచి 14 రోజుల్లోపు బిల్లు కట్టేస్తే ఏ సమస్య ఉండదు. పైగా రూ.35 నుంచి రూ.85 వరకు ఆదా కూడా చేయొచ్చు.
సకాలంలో కట్టకపోతే ఏం జరుగుతుందంటే
ఒక విద్యుత్ సర్వీస్‌కి రూ.100 బిల్లు వస్తే.. ఆ బిల్లును ప్రతి నెల 1న తీస్తే 14లోగా, 5న తీస్తే 19లోపు చెల్లిస్తే వినియోగదారుడిపై తర్వాత నెలలో రూ.25 సర్ చార్జ్, రూ.10 ఇంధన చార్జ్ పడదు. అదే బిల్లును ఒక వారం తర్వాత చెల్లిస్తే ఆ తర్వాత నెలలో రూ.100 బిల్లుకు సర్‌చార్జ్, ఇంధన చార్జ్ కలిపి రూ.135 బిల్లు వస్తుంది. ఒకవేళ ఆ వారానికి కూడా అనివార్య కారణాలతో బిల్లు కట్టలేకపోతే రూ.135కు ఇంకొక రూ.50 ఆలస్య రుసుం కలిపి మొత్తం రూ.185 చెల్లించాల్సి ఉంటుంది.
ఆలస్యమైతే అనర్థమే..
గతంలో విద్యుత్ సిబ్బంది గ్రామాలకే వచ్చి విద్యుత్ బిల్లులు కట్టించుకునేవారు. ఇప్పుడు డిజిటల్ యుగం కావడంతో ఆన్‌లైన్‌లోనే విద్యుత్ బిల్లు కట్టే అవకాశం ఉంది. అయినా చాలామంది ఆలస్యం చేస్తున్నారు. దీనివల్ల బిల్లు ఎక్కువ రావడంతో డబ్బులు వృథా కావడమే కాకుండా పలు ప్రభుత్వ సంక్షేమ పథకాలకు కూడా దూరం కావాల్సి వస్తుంది. కాబట్టి బిల్లు అందిన 14 రోజుల్లోపు చెల్లించేస్తే మంచిదని అధికారులు చెబుతున్నారు.
త్వరగా కడితే తక్కువే!
Published Sun, Mar 20 2022 3:53 AM | Last Updated on Sun, Mar 20 2022 3:53 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment