
నెల్లూరు(క్రైమ్): ప్రేమ పేరిట వంచించాడని ఆర్‌ఎస్‌ఐపై ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రెండు రోజులుగా పోలీసు అధికారులు రహస్య విచారణ సాగిస్తున్నారు. వివరాలు.. ప్రకాశం జిల్లాకు చెందిన ఓ వ్యక్తి జిల్లాలో ఆర్‌ఎస్‌ఐగా విధులు నిర్వహిస్తున్నారు. అతను ఇంజినీరింగ్ చదివే సమయంలో హైదరాబాద్‌కు చెందిన సహచర విద్యార్థినితో పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమకు దారితీసింది.
ఇంజినీరింగ్ పూర్తయిన అనంతరం ఉద్యోగ నిమిత్తం అతను హైదరాబాద్‌లో కోచింగ్ తీసుకున్నారు. ఆ సమయంలో వారి మధ్య సాన్నిహిత్యం మరింత పెరిగింది. ఈ క్రమంలోనే ఆయనకు పోలీసుశాఖలో ఆర్‌ఎస్‌ఐగా ఉద్యోగం వచ్చింది. నెల్లూరులో విధులు నిర్వహిస్తూ ఓ గదిని అద్దెకు తీసుకుని నివాసం ఉంటున్నారు. తరచూ ఆ యువతి నెల్లూరుకు వచ్చి వెళ్లేది. గత కొంతకాలంగా ఆమెను దూరంగా పెడుతూ వచ్చారు.
ఈ క్రమంలో ఈ నెల 10వ తేదీ అర్ధరాత్రి వారి మధ్య చిన్నపాటి వివాదం చెలరేగింది. దీంతో కోపోద్రిక్తుడైన ఆయన యువతిపై చేయిచేసుకోవడంతో ఆమె డయల్ 100కు కాల్ చేసింది. దర్గామిట్ట పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సదరు అధికారిని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. అనంతరం విచారించగా ప్రేమ పేరిట వంచించాడని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో దర్గామిట్ట పోలీసులు రెండు రోజులుగా గోప్యంగా విచారణ సాగిస్తున్నారు. ఇది ఇలా ఉంటే సదరు అధికారి వ్యవహార శైలిపై అనేక విమర్శలు ఉన్నాయి. ఆర్‌ఎస్‌ఐగా విధుల్లో చేరిన కొత్తలో ఓ యువతి ఇతని వ్యవహార శైలిపై అప్పటి పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో తీవ్రస్థాయిలో అతన్ని వారు మందలించారని సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment