సాక్షి, భోపాల్: మధ్యప్రదేశ్‌లోని కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్నికల పోరు ఆసక్తికరంగా మారింది. ఒకే కుటుంబంలోని వారు వేర్వేరు పార్టీల తరఫున పోటీ చేస్తున్నారు. ఇలా అధికారం కోసం బద్ధ వైరులుగా మారిన వారిలో అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీల నేతలున్నారు. నవంబర్ 17వ తేదీన జరగనున్న అసెంబ్లీ ఎన్నికల బరిలో తోబుట్టువులు, మామ– మేనల్లుడు, బావమరుదులు, అల్లుళ్లు, అత్తలు, మామలు..ఇలా రాజకీయ ప్రత్యర్థులుగా రంగంలోకి దిగారు.
నర్మదాపురం స్థానంలో బీజేపీ అభ్యరి్థ, అసెంబ్లీ స్పీకర్ సీతాశరణ్ శర్మపై స్వయానా ఆయన సోదరుడు గిరిజాశంకర్ శర్మ కాంగ్రెస్ తరఫున బరిలో నిలిచారు. బీజేపీ మాజీ ఎమ్మెల్యే అయిన గిరిజా శంకర్ సొంత పార్టీ టిక్కెట్ నిరాకరించడంతో ఇటీవలే కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. మరో ఉదాహరణ..సాగర్ అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్‌కు చెందిన నిధి సునీల్ జైన్, తన బావ, సిట్టింగ్ బీజేపీ ఎమ్మెల్యే శైలేంద్ర జైన్‌పై పోటీకి దిగారు.
శైలేంద్ర జైన్ చిన్న తమ్ముడు సునీల్ జైన్ భార్యే నిధి జైన్. దియోరి నియోజకవర్గ కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే సునీల్ జైన్. అదేవిధంగా, రేవా జిల్లా డియోతలాబ్‌లో కాంగ్రెస్ పార్టీ పద్మేష్ గౌతమ్‌ను పోటీకి నిలిపింది. ఈయన మామ, బీజేపీకి చెందిన ప్రస్తుత అసెంబ్లీ స్పీకర్ గిరీశ్ గౌతమ్ ఇక్కడ పోటీ చేస్తున్నారు. హర్దా జిల్లా తిమారి్నలో సిట్టింగ్ ఎమ్మెల్యే, బీజేపీ అభ్యర్థి సంజయ్ షాపై ఆయన మేనల్లుడు అభిజీత్ షా కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్నారు. వీరిద్దరూ ముఖాముఖి తలపడటం ఇది రెండోసారి.
గ్వాలియర్ జిల్లా దాబ్రాలో బీజేపీకి చెందిన మాజీ మంత్రి ఇమార్తి దేవిపై ఆమె బంధువు సిట్టింగ్, కాంగ్రెస్ ఎమ్మెల్యే సురేశ్ రాజేతో తలపడుతున్నారు. ఇమార్తి దేవి మేనకోడలు రాజే కుటుంబంలో కోడలిగా ఉన్నారు. కుటుంబసభ్యులు ఎన్నికల్లో పరస్పరం తలపడటంపై సీనియర్ జర్నలిస్ట్, వ్యాఖ్యాత ఆనంద్ పాండే మాట్లాడుతూ..‘ఇది సైద్ధాంతిక సంఘర్షణ కానే కాదు. కేవలం అధికారం, పదవుల కోసం జరిగే పోరాటం’అని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment