ఎస్తర్‌కు నగదు అందిస్తున్న భూమన పీఏ
యూనివర్సిటీ క్యాంపస్: తిరుమల శ్రీవారి దర్శనం కోసం తిరుపతికి వచ్చిన రష్యన్ యువతి ఎస్తర్ తిరుపతిలో కష్టాలు పడుతోంది. శ్రీవారి దర్శన భాగ్యం లభించక తెచ్చుకున్న నగదు ఖర్చయిపోయి సాయం కోసం ఎదురుచూస్తోంది. ఈ విషయం తెలుసుకున్న తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి ఆమెకు నగదు సాయం అందించారు. రష్యాకు వెళ్లేందుకు సహాయం చేస్తానని హామీ ఇచ్చారు. రష్యాకు చెందిన ఎస్తర్ (32) ఈ ఏడాది ఫిబ్రవరి 6న తన తల్లి ఒలివియాతో కలిసి ఇండియా వచ్చింది. వృత్తి ఫిజియోథెరపిస్ట్. ఆమెకు ఆధ్యాత్మిక చింతన ఎక్కువ. ఆలయ అలంకరణలో ప్రవేశం ఉంది. టూరిస్ట్ వీసాపై వచ్చాక మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్‌లో వివిధ ప్రదేశాలు సందర్శించారు. ఈ లోపు దేశంలో కరోనా ప్రభావం పెరగడంతో లాక్‌డౌన్ విధించారు. విదేశీ విమానాలు రద్దు చేయడం, తిరిగి వెళ్లే అవకాశం లేకపోవడంతో ఇండియాలోనే గడిపారు.
ఈ నేపథ్యంలో తిరుమలలో శ్రీవారి దర్శనం చేసుకోవటానికి ఈ నెల 19న తిరుపతి వచ్చారు. కోవిడ్ కారణంగా విదేశీ భక్తులకు శ్రీవారి దర్శన భాగ్యం లేదని తెలుసుకుని నిరాశ చెందారు. అధికారులు అవకాశం ఇస్తే దర్శనం చేసుకోవాలని ఎదురుచూశారు. ఈ దశలో వారి వద్ద డబ్బులు అయిపోవడంతో తల్లి ఒలివియా రష్యన్లు ఎక్కువగా వచ్చే యూపీలోని బృందావనం పట్టణం చేరింది. కరోనా కారణంగా విదేశీ యాత్రికులు రాకపోవడంతో అక్కడ నిరాశ ఎదురైంది. ఈ కారణంగా తల్లి ఉత్తరప్రదేశ్‌లో, కూతురు తిరుపతిలో ఉండాల్సి వచ్చింది. చేతిలో డబ్బులేని కారణంగా తాను ఉన్న హోటల్ గది ఖాళీ చేసి ఇస్కాన్‌లో ఆశ్రయం కోసం ప్రయత్నించింది. అక్కడ యాత్రికుల వసతిపై ఆంక్షలు ఉండటంతో ఇస్కాన్‌లో ఉండే సదా రాందాస్ తాను భోజనం వరకు తగిన ఏర్పాట్లు చేయగలనని, వసతి కోసం ఎక్కడైనా ఇంటిని అద్దెకు ప్రయత్నిస్తానని చెప్పారు.
అయితే చేతిలో డబ్బులేక అలిపిరి రోడ్‌లో తిరుతున్న ఎస్తర్ పరిస్థితి గమనించి కపిల తీర్థం సమీపంలోని ఒక రెసిడెన్సీలో వసతి కల్పించారు. ఆమె మంగళవారం ‘సాక్షి’తో మాట్లాడుతూ తమ వద్ద ప్రస్తుతం కేవలం వెయ్యి రూపాయలు మాత్రమే ఉన్నాయ న్నారు. డబ్బు కోసం యూపీలోని బృందావనం వెళ్లిన తన తల్లి అక్కడే ఇరుక్కుపోయిందన్నారు. ఎవరైనా సహాయం చేస్తే తన తల్లితో కలిసి రష్యా వెళ్లిపోతానని చెప్పారు. తనకు ఉచితంగా సాయం వద్దని తనకు తెలిసిన వైద్యం అవసరమైన వాళ్లకు అందిస్తానని తెలిపారు. ఆమె వసతి పొందుతున్న రెసిడెన్సీ ఉద్యోగి పాండు మాట్లాడుతూ అలిపిరి రోడ్డులో తిరుగుతుంటే వివరాలు తెలుసుకుని వసతి కల్పించామన్నారు. ఆమె కష్టాలు తెలిసి కొంతమంది సçహాయం చేయటానికి ముందుకొచ్చారన్నారు. ఎస్తర్ కష్టాలు తెలుసుకుని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి తక్షణం స్పందించారు. తన పీఏ ఆర్.వెంకటేశ్వర్లును పంపి నగదు సాయం అందించారు.
శ్రీవారి దర్శనం కల్పిస్తాం: చెవిరెడ్డి
ప్రభుత్వ విప్, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఆమెను మంగళవారం స్వయంగా కలిసి భరోసా ఇచ్చా రు. తన కోటాలో శ్రీవారి దర్శనం కల్పిస్తామని హామీ ఇచ్చారు. తన సొంత నిధులతో రష్యాకు పంపడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. అప్పటివరకు భోజన వసతి ఏర్పాట్లు చేస్తామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment