
దివాకర్‌రెడ్డి భౌతికకాయానికి నివాళులర్పిస్తున్న వైఎస్ విజయమ్మ, వైఎస్ భారతి తదితరులు
సాక్షి, అమరావతి/బంజారాహిల్స్/కడప కార్పొరేషన్: రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి సోదరుడు, పారిశ్రామికవేత్త సజ్జల దివాకర్‌రెడ్డి(66) కన్నుమూశారు. దివాకర్‌రెడ్డి కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతు న్న ఆయన మంగళవారం తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. భౌతిక కాయాన్ని బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12 ఎమ్మెల్యే కాలనీలోని స్వగృహానికి తరలించారు. వైఎస్సార్ జిల్లా కమలాపురం మాజీ ఎమ్మెల్యే శివరామిరెడ్డికి అల్లుడైన దివాకర్‌రెడ్డి.. ప్రతిపక్షనేత చంద్రబాబుకు సహ విద్యార్థి కూడా. ఈయనకు సతీమణి భగీరథమ్మ, కుమారుడు, కుమార్తె ఉన్నారు.
సోదరుని మరణవార్త తెలిసిన వెంటనే సజ్జల రామకృష్ణారెడ్డి హైదరాబాద్‌కు హుటాహుటిన చేరుకున్నారు. దివాకర్‌రెడ్డి పార్థివ దేహానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తల్లి వైఎస్ విజయమ్మ, సతీమణి వైఎస్ భారతి నివాళులు అర్పించారు. కుటుంబసభ్యులను పరామర్శించారు. ఏపీ లోకాయుక్త జస్టిస్ పి.లక్ష్మణ్‌రెడ్డి, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఎమ్మెల్యేలు భూమన కరుణాకర్‌రెడ్డి, శిల్పా చక్రపాణిరెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, ఇంకా దేవులపల్లి అమర్, ఏకే.ఖాన్, మాజీ ఎమ్మెల్యే రామసుబ్బారెడ్డి, ఎస్వీ మోహన్‌రెడ్డి తదితరులు నివాళి అర్పించారు. సాయంత్రం 5 గంటలకు అశ్రునయనాల మధ్య అంతిమయాత్ర ఎమ్మెల్యే కాలనీలోని ఆయన ఇంటినుంచి ప్రారంభమైంది.మహాప్రస్థానంలో అంత్యక్రియలు ముగిశాయి.