
సాక్షి, అమరావతి: కుప్పం అడ్డాలో చంద్రబాబు పరాజయం పాలయ్యారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. బుధవారం వెలువడిన ఫలితాల్లో కుప్పం మున్సిపాలిటీని వైఎస్సార్‌సీపీ కైవసం చేసుకుంది. ఈ సందర్భంగా సజ్జల మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబుకు కుప్పం ప్రజలు తుది వీడ్కోలు పలికారని అన్నారు. కుప్పం ప్రజలు బాబుకు దండం పెట్టేశారని ఎద్దేవా చేశారు. పారదర్శకంగా జరిగిన ఎన్నికల్లో చంద్రబాబు దారుణంగా ఓడిపోయారని అన్నారు.
చదవండి: Kuppam Municipal Election Results: కుప్పంలో కుప్పకూలిన టీడీపీ
ఎన్ని జిమ్మిక్కులు చేసినా ప్రజలు చంద్రబాబును నమ్మలేదని తెలిపారు. కుప్పం ఓటమికి చంద్రబాబు ముందే సాకులు వెతుకున్నారని అన్నారు. వరుస ఎన్నికల్లో ప్రజలు వైఎస్సార్‌సీపీ పట్టం కడుతున్నారని తెలిపారు. పలు ఎన్నికల్లో టీడీపీకి జనసేన బహిరంగంగానే మద్దుతు ఇచ్చిందని అన్నారు. 100 స్థానాల్లో ఎన్నికలు జరిగితే 97 శాతం స్థానాల్లో విజయం సాధించామని సజ్జల పేర్కొన్నారు.
కాలం గడిచే కొద్దీ సీఎం జగన్ సుపరిపాలనకు ప్రజల్లో ఆదరణ పెరిగిందన్నారు. బద్వేల్ ఎన్నికల్లోనూ టీడీపీ.. బీజేపీకి మద్దతు పలికినా అందరూ ఏకమైనా ఆ మెజారిటీ వచ్చిందని ఎద్దేవా చేవారు. 2019లో 50శాతం ఓట్లతో ప్రారంభమైన యాత్ర ఇప్పుడు 90 శాతాన్ని మించిందని అన్నారు. దౌర్జన్యాలు జరిగినట్లు చూపించాలని నానా యాగీ చేశారని, ఎదో విధంగా అలజడి సృష్టించి ఎన్నిక ఆపాలని చూశారని తెలిపారు. గుంటూరులో ఒక డివిజన్ గెలిచామని పండగ చేసుకుంటున్నారని, కళ్లు మూసుకుని తమదే విజయం అంటుంటే జాలి పడాల్సిందేనని అన్నారు. కుప్పం ప్రజలు బాబు చెర నుంచి విముక్తులైనందుకు అభినందనలు తెలిపారు.
తమ పార్టీని అక్కడ ఆదరించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో తమకు ఈ విజయాన్ని అందించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు. టీడీపీ ప్రజలకు మోయలేని బరువైందని, అందుకే ప్రజలు దించేశారని అన్నారు. కుప్పం కూడా జనజీవన స్రవంతిలోకి వచ్చినట్లయ్యిందని, వైఎస్సార్, జగన్ కుప్పాన్ని అబివృద్ది చేశారని తెలిపారు. ఒక్క చంద్రబాబే దాన్ని వదిలేశాడని అన్నారు. ప్రజలు ఓటు వేయకపోతే చంద్రబాబు వాళ్లని నిందిస్తాడు కానీ సీఎం జగన్ తమ లోపం ఎక్కడ ఉందో సమీక్షించుకుంటాడని సజ్జల పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment