ఏలూరులో బంతిపూల ముగ్గువేస్తున్న తెలుగింటి ఆడపడుచులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో చాలా కాలం తర్వాత సంక్రాంతి సంబరాలు కొత్త శోభను సంతరించుకున్నాయి. వర్షాలు సకాలంలో, సమృద్ధిగా కురవడంతో సాగు చేసిన పంటలు గరిష్ట దిగుబడులు ఇవ్వడం.. వాటికి ప్రభుత్వం చేపట్టిన చర్యలతో మద్దతు ధర దక్కడంతో రైతుల్లో ఆనందోత్సాహాలు నెలకొన్నాయి. నవరత్నాల ద్వారా సంక్షేమ పథకాల ఫలాలు అందడంతో ప్రతి పేద ఇంటా సం‘క్రాంతి’ నెలకొంది.
ఫిట్‌మెంట్.. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న డీఏలను ప్రభుత్వం మంజూరు చేయడం, పదవీ విరమణ వయసును 62 ఏళ్లకు పెంచడం, జగనన్న స్మార్ట్ టౌన్‌షిప్‌లలో ఉద్యోగులకు 10 శాతం ప్లాట్లను 20 శాతం రాయితీపై ఇవ్వాలని నిర్ణయించడంతో ప్రభుత్వ ఉద్యోగుల్లో నూతనోత్సాహం వెల్లివిరిసింది. పల్లెలు, పట్టణాలు, నగరాలు అనే తేడా లేకుండా అన్ని ప్రాంతాల్లోనూ తెలుగింట ఏడాదిలో తొలి పండగ సంక్రాంతి సంబరాలు ఘనంగా మొదలయ్యాయి. అన్ని వర్గాల ప్రజలూ బంధుమిత్రుల మధ్య, ఆనందోత్సాహాల నడుమ సంక్రాంతి సంబరాలు జరుపుకోవడానికి కొత్త వస్త్రాలు, పిండి వంటల కోసం ముడి పదార్థాల కొనుగోళ్లతో షాపింగ్ మాల్స్ నుంచి చిన్న చిన్న దుకాణాల వరకూ కిటకిటలాడటంతో వ్యాపార వర్గాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి.
విజయవాడలో పొట్టేలు బండిపై చిన్నారి
పల్లెలకు చేరుకున్న నగరవాసులు
ఉద్యోగాలు, వ్యాపారాల కోసం పట్టణాలు, నగరాల్లో స్థిరపడిన వారందరూ అయిన వారి మధ్య సంక్రాంతి పండగ చేసుకోవడం కోసం సొంతూళ్లకు చేరుకున్నారు. దాంతో పట్టణాలు, నగరాలు బోసిపోయాయి. సంక్రాంతి పండగకు రావాలంటూ ఆహ్వానాలు అందడంతో అల్లుళ్లు, ఆడపడుచులు పల్లెలకు చేరుకోవడంతో గ్రామ సీమల్లో సరి కొత్త సందడి నెలకొంది.
ఘనంగా భోగి
సంక్రాంతి పండగలో తొలి రోజు భోగిని శుక్రవారం ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. కోడి కూయగానే నువ్వా నేనా అన్నట్లుగా పోటీ పడుతూ భోగి మంటలు వెలిగించారు. భోగి మంటల వద్ద చలి కాచుకుంటూ ఆహ్లాదకర వాతావరణంలో అందరూ కబుర్లు చెప్పుకున్నారు. సూర్యోదయానికి ముందే ఇళ్ల ముందు మహిళలు కళ్లాపు చల్లి, పోటీ పడుతూ ముత్యాల ముగ్గులు వేశారు. వాటికి రంగులు అద్ది.. ముగ్గు మధ్య గొబ్బెమ్మలు పెట్టి.. రకరకాల పూలతో అలంకరించారు. ముత్యాల రంగ వల్లుల చుట్టూ తిరుగుతూ పాటలు పాడారు. ధనుర్మాసం కావడంతో హరిదాసులు హరినామ సంకీర్తనలను రాగయుక్తంగా పాడుతూ వీధుల్లో తిరుగుతుండటం కనువిందు చేసింది. పిల్లల తలపై రేగి పండ్లు పోసి పెద్దలు దీవించారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో బంధు మిత్రుల సందడి మధ్య మకర సంక్రాంతికి ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు.
నవరత్నాలతో పేదల లోగిళ్లలో కొంగొత్త సంక్రాంతి
కులం, మతం, వర్గం, పార్టీలకు అతీతరంగా అర్హులైన వారందరికీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నవరత్నాల ద్వారా సంక్షేమ ఫలాలను అందిస్తున్నారు. ఈ నెల 1న వృద్ధాప్య, వితంతు పెన్షన్‌ను రూ.2,250 నుంచి రూ.2,500కు పెంచారు. ఏకంగా 61.16 లక్షల మందికి ఈ నెల పింఛన్లు అందజేశారు. ఇందులో కొత్తగా 1,41,562 మందికి పింఛన్లు మంజూరయ్యాయి. వైఎస్ జగన్ ప్రభుత్వం ఇప్పటిదాకా రూ.45 వేల కోట్లు పింఛన్లుగా చెల్లించింది. వైఎస్సార్ ఆసరా, వైఎస్సార్ చేయూత పథకాల ద్వారా మహిళలకు ప్రయోజనం చేకూర్చారు. ఇలా అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ ఫలాలను అందజేశారు. రెండున్నరేళ్లలో సంక్షేమ పథకాల ద్వారా రూ.1.16 లక్షల కోట్లను నేరుగా అర్హులైన లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశారు. కరోనా మహమ్మారి ప్రభావం వల్ల ఆర్థిక ఇబ్బందుల్లోనూ సంక్షేమ పథకాల ఫలాల ఎక్కడా ఆగకుండా లబ్ధిదారులకు అందడంతో పేదల లోగిళ్లలో సరి కొత్త సంక్రాంతి కనిపిస్తోంది.
సీఎం క్యాంపు కార్యాలయం పక్కనే ఉన్న గోశాల వద్ద నిర్వహించిన సంక్రాంతి సంబరాలు
రైతుల్లో ఆనందోత్సాహాలు
వైఎస్సార్ రైతు భరోసా–పీఎం కిసాన్ యోజన ద్వారా రూ.13,500 వంతున పెట్టుబడి సాయం.. బ్యాంకుల నుంచి సర్కార్ విరివిగా రుణాలు అందించడంతో రైతులు పెట్టుబడి కోసం ప్రైవేటు వ్యాపారులను ఆశ్రయించాల్సిన అవసరం లేకుండా పోయింది. రైతు భరోసా కేంద్రాల్లో తక్కువ ధరకే నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందించడంతో అన్నదాతలకు కష్టాలు తప్పాయి. సకాలంలో వర్షాలు కురవడంతో కొంగొత్త ఆశలతో భారీ ఎత్తున పంటలు సాగు చేశారు. వర్షాలు సమృద్ధిగా కురవడంతో మంచి దిగుబడులు వచ్చాయి. వాటికి గిట్టుబాటు ధర కల్పించేలా ప్రభుత్వమే కొనుగోలు చేస్తుండటంతో రైతులకు అధికంగా ప్రయోజనం చేకూరింది. పంటలను విక్రయించిన డబ్బులు చేతికి అందడంతో రైతుల్లో ఆనందోత్సాహాలు నెలకొన్నాయి.
రైతులు, రైతు కూలీలు.. ఉద్యోగులు, వ్యాపారులు ఇలా అన్ని వర్గాల ప్రజలు ఆనందోత్సాహాల మధ్య పండగ జరుపుకుంటున్నారు. సంప్రదాయ పిండి వంటలైన అరిసెలు, కర్జికాయలు, గారెలు, సున్నండలు, కాజాలు, పూతరేకులు వంటివి చేస్తుండటంతో ఇంటింటా ఘుమ ఘుమలు వెదజల్లుతున్నాయి.
ఉత్తరాయణ పుణ్యకాలం ఆరంభం
సంక్రాంతి పండగ రోజున శనివారం సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. అందుకే సంక్రాంతిని మకర సంక్రాంతిగా పిలుస్తారు. ఈ రోజునే సూర్యడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణంలోకి ప్రవేశిస్తారు. అంటే సంక్రాంతి రోజునే ఉత్తరాయణ పుణ్యకాలం ఆరంభమవుతుంది. అత్యంత శుభప్రదమైన సంక్రాంతి రోజున పెద్దలకు నూతన వస్త్రాలు పెట్టుకుని.. తర్పణాలు వదిలేందుకు ప్రజలు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
పింఛన్‌తో సంతోషం
భర్త చనిపోయి బోలెడు దుఃఖంలో ఉన్న నాకు ప్రభుత్వం ఈ నెలలో కొత్తగా పింఛను మంజూరు చేసింది. పది రోజుల క్రితం వలంటీరు స్వయంగా ఇంటికి వచ్చి రూ.2,500 పింఛను డబ్బులు ఇచ్చి వెళ్లారు. పండ్లు, కూరగాయలు విక్రయించుకొని జీవించే మాకు ఈ డబ్బులు ఎంతో ఉపయోగపడతాయి. ఈ సంక్రాంతి పండుగ రోజున ఆ పింఛను డబ్బులు కొత్త సంతోషాన్ని తెచ్చాయి.
– కొలగాని పద్మ, వడ్లమూడి, చేబ్రోలు, గుంటూరు జిల్లా
రంగవల్లుల మధ్య మహిళల కోలాహలం.. భోగి మంటల వద్ద చిన్నారుల కేరింతలు.. వంట గదిలో అమ్మలక్కల హడావుడి.. నగరం నుంచి వచ్చిన బంధువులతో పెద్దల కబుర్లు.. ఆట పాటలతో గంగిరెద్దులు, హరిదాసుల సందడి.. వెరసి గ్రామ సీమల్లో సందడే సందడి.. ఈ తరం పిల్లలు అబ్బుర పడే రీతిలో ఈ ఏడాది రాష్ట్రంలో ఊరూరా సంక్రాంతి సంబరాలు మిన్నంటాయి.
Comments
Please login to add a commentAdd a comment