![Sathya Sai: Paritala Sunitha and Son Misbehave With Police Department - Sakshi](/styles/webp/s3/article_images/2022/06/13/Paritala-Sunitha.jpg.webp?itok=UQqu8ssT)
సాక్షి, శ్రీ సత్యసాయి జిల్లా: మాజీ మంత్రి పరిటాల సునీత, ఆమె కుమారుడు పరిటాల శ్రీరామ్ సోమవారం పోలీసులపైనే దౌర్జన్యానికి దిగారు. వీరిద్దరూ అనుచరులతో కలిసి భారీ సంఖ్యలో వాహనాల్లో పుట్టపర్తిలోని శ్రీసత్యసాయి జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నాకు బయల్దేరారు. రామగిరి పోలీస్ స్టేషన్ సమీపంలో ఉన్న చెక్‌పోస్టు వద్ద వీరి వాహనాలను ఎస్‌ఐ జనార్దన్ నాయుడు ఆపారు.
సీఎం పర్యటన ఉన్నందున భద్రత కారణాల దృష్ట్యా ఇన్ని వాహనాలను అనుమతించలేమని, కొన్నింటిని మాత్రమే పంపుతామని చెప్పారు. దీంతో పరిటాల సునీత శివాలెత్తారు. ‘గేటు ఎత్తరా.. ఏం చేస్తాడో చూద్దాం’ అంటూ అనుచరులు, రౌడీషీటర్లను ఉసిగొల్పారు. ఇది మంచి పద్ధతి కాదని, పరిస్థితులను అర్థం చేసుకుని పోలీసులకు సహకరించాలని ఎస్‌ఐ కోరినా పట్టించుకోలేదు. ఎస్‌ఐతో సునీత, శ్రీరామ్ దురుసుగా ప్రవర్తించారు.
‘మీరు పంపకపోతే మేం దౌర్జన్యం చేస్తాం’ అంటూ బెదిరించారు. ఎస్‌ఐ అనే గౌరవం లేకుండా ‘ఏందయ్యా.. నువ్వు..’ అంటూ ఏకవచనంతో మాట్లాడారు. చివరకు చెక్‌పోస్టు గుండా నాలుగు వాహనాలు వెళ్లేందుకు ఎస్‌ఐ అనుమతించారు. కానీ పరిటాల అనుచరులు పోలీసుల ఆదేశాలను సైతం లెక్కచేయలేదు. దౌర్జన్యంగా చెక్‌పోస్టు గేటు పైకెత్తారు. వేరే మార్గాల గుండా వాహనాల్లో తరలివెళ్లారు.
చదవండి: (అయ్యో జనార్దనా: ముందు చూస్తే నుయ్యి.. వెనుక చూస్తే గొయ్యి)
Comments
Please login to add a commentAdd a comment