సాక్షి, అమరావతి : ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల పదోన్నతుల్లో రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలు చేయడంతోపాటు, ఇప్పటికే వారికి కేటాయించిన సంఖ్య కంటే ఎక్కువ సంఖ్యలో పదోన్నతులు పొందిన వారికి నష్టం కలగకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది.
అధిక సంఖ్యలో పదోన్నతులు పొందిన వారికి డిమోషన్ ఇవ్వకుండా, సూపర్ న్యూమరరీ పోస్టులు సృష్టించి.. అదే స్థానాల్లో కొనసాగించే దిశగా కసరత్తు చేస్తోంది. పదోన్నతులపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుల నేపథ్యంలో ఉద్యోగులు ఎవరికీ నష్టంలేకుండా అత్యంత బాధ్యతతో వ్యవహరిస్తోంది. అందుకు అనుగుణంగా సలహా మండలిని ఏర్పాటు చేసింది. వాస్తవ లెక్కలు తేల్చడం ద్వారా ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులు నష్టపోకుండా చర్యలు చేపట్టనుంది.
♦ ప్రమోషన్లలో ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 6 శాతం రిజర్వేషన్ అమలుపై ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అన్ని విభాగాల్లోని అన్ని కేటగిరీల పోస్టులకు తగిన ప్రాతినిధ్యం ఉండేలా పదోన్నతిలో రిజర్వేషన్లు అమలు చేయాలని సాంఘిక సంక్షేమ శాఖ 2003 ఫిబ్రవరి 14న జీవో నంబర్ 5 జారీ చేసింది.
♦రిజర్వేషన్ ఉపయోగించుకొని ప్రమోషన్ పొందిన తర్వాత నుంచి ప్రమోషన్ పోస్టు సీనియారిటీ గణించి తదుపరి ప్రమోషన్ ఇవ్వడానికి అవకాశం కలి్పంచే ‘కాన్సిక్వెన్షియల్ సీనియారిటీ’ని అమలు చేస్తూ 2009 ఫిబ్రవరి 20న సాంఘిక సంక్షేమ శాఖ జీవో నంబర్–26 జారీ చేసింది.
♦ కాన్సిక్వెన్సియల్ సీనియారిటీ వల్ల ఎస్సీ, ఎస్టీలకు న్యాయంగా దక్కాల్సిన ప్రాతినిధ్యం (ఎస్సీ–15 శాతం, ఎస్టీ–6శాతం) కంటే ఎక్కువ మంది ప్రమోషన్లు పొందారని, ఫలితంగా మిగతా ఉద్యోగులు నష్టపోతున్నారని సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో వేసిన కేసుల్లో వారికి అనుకూలంగా తీర్పులు వచ్చాయి.
జీవో–26ను రద్దు చేసి, వాస్తవంగా ఎస్సీ, ఎస్టీలు కేటాయించిన పోస్టులకు మించి ప్రమోషన్లు పొందిన వారి సంఖ్యను గణించి, మిగతా వారికీ న్యాయం చేయాలని తీర్పులు చెప్పాయి. ఈ నేపథ్యంలో సలహా కమిటీ సిఫార్సుల మేరకు అడుగులు ముందుకు వేయనుంది.
పోస్టులెన్ని? ఎంత మంది ఉన్నారు?
తెలంగాణ రాష్ట్రం కూడా సలహా కమిటీని ఏర్పాటు చేయడం ద్వారా ప్యానెల్‌లను సమీక్షించడానికి కసరత్తు చేపట్టింది. ఆ కమిటీ సిఫార్సుల ఆధారంగా.. ఎస్సీ, ఎస్టీలు కేటాయించిన పోస్టుల కంటే ఎక్కువగా ఉన్న వారి కోసం సూపర్ న్యూమరీ పోస్టులు సృష్టించాలని నిర్ణయించింది.
ఫలితంగా వారిని ఉన్న ఉద్యోగాల్లోనే తెలంగాణ ప్రభుత్వం కొనసాగించింది. అడిషనల్ సెక్రటరీ, డిప్యూటీ సెక్రటరీ, అసిస్టెంట్ సెక్రటరీ కేటగిరీలుగా ఐదు సూపర్ న్యూమరీ పోస్టులు, 30 నోషనల్ ప్రమోషన్‌లను అనుమతించింది. ఏపీ ప్రభుత్వం కూడా ఇదే విధంగా కసరత్తు చేస్తోంది.
ఈ నేపథ్యంలో ఎస్సీ, ఎస్టీలకు దక్కాల్సిన పోస్టుల కంటే అధిక సంఖ్యలో ప్రమోషన్లు పొందిన పోస్టుల వివరాలు తీసుకొని నివేదిక సమర్పించడానికి ఓ కమిటీని ఏర్పాటు చేసింది. రాష్ట్ర విభజన తర్వాత ఏపీ సచివాలయంలోని అన్ని ప్యానెల్‌లు, ప్రమోషన్‌లను అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ నుండి ప్రభుత్వ అదనపు కార్యదర్శి వరకు అమలు చేయడానికి కసరత్తు చేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment