కరోనా ఆయుర్వేద మందుపై శాస్త్రీయ అధ్యయనం | Scientific study on corona ayurvedic medicine | Sakshi
Sakshi News home page

కరోనా ఆయుర్వేద మందుపై శాస్త్రీయ అధ్యయనం

Published Sun, May 23 2021 5:58 AM | Last Updated on Sun, May 23 2021 8:19 AM

Scientific study on corona ayurvedic medicine - Sakshi

సాక్షి ప్రతినిధి, నెల్లూరు/సాక్షి తిరుపతి/ముత్తుకూరు/సాక్షి, అమరావతి: కరోనా నియంత్రణకు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో బొణిగి ఆనందయ్య ఇస్తున్న ఆయుర్వేద మందుపై శాస్త్రీయ అధ్యయనం కోసం ప్రభుత్వ యంత్రాంగం రంగంలోకి దిగింది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు శనివారం ఆయుష్‌ కమిషనర్‌ రాములు, ఆయన బృందం కృష్ణపట్నంలో పర్యటించింది. మందు తయారీకి వినియోగించే దినుసులను పరిశీలించడంతోపాటు మందు విని యోగించిన వారి వివరాలు తెలుసుకుంది. మందు ను వాడిన 500 మందితో మాట్లాడి వారిచ్చిన వివరాలను నివేదికలో పొందుపర్చనుంది. శనివారం తెలుసుకున్న వివరాలతో ప్రభుత్వానికి వెంటనే నివేదిక ఇస్తామని.. వారం నుంచి పది రోజుల్లో సమగ్ర నివేదిక సమర్పిస్తామని రాములు తెలి పారు. తర్వాత ప్రభుత్వ అనుమతి మేరకు ఆయుర్వేద మందు పంపిణీ ఉంటుందని చెప్పారు. అప్పటివరకు పంపిణీని నిలిపివేస్తున్నామన్నారు.

ఆనందయ్య తయారుచేసిన మందు నమూనాలను ఉత్తరప్రదేశ్‌లోని సీసీఆర్‌ఏఎస్‌ (సెంట్రల్‌ కౌన్సిల్‌ ఫర్‌ రీసెర్చ్‌ ఇన్‌ ఆయుర్వేదిక్‌ సైన్స్‌) ల్యాబ్‌కు పంపుతున్నామని తెలిపారు. అంతకుముందు నెల్లూరు పట్ట ణంలో రాములుకు.. ఆనందయ్య మందు తయారీని వివరించి.. చేసి చూపించారు. ఇప్పటివరకు నిర్వహించిన ప్రాథమిక పరీక్షల్లో మందు తయారీకి వినియోగించే వస్తువులు అన్నీ శాస్త్రబద్ధమైనవేనని, వాటివల్ల ఎలాంటి చెడు ప్రభావం లేదని ఆయుష్‌ నిర్ధారించింది. ఈ మేరకు ప్రాథమిక నివేదిక ఇచ్చింది. కాగా, భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌) బృందం ఆయుర్వేద మందు శాస్త్రీయతపై అధ్యయనం కోసం ఈ నెల 24న కృష్ణపట్నానికి రానుంది. ఇదిలా ఉండగా శుక్రవారం మధ్యాహ్నం నుంచి మందు పంపిణీ నిలిపివేయడంతోపాటు పోలీసులు పహారా కాస్తుండడంతో కృష్ణపట్నం నిర్మానుష్యంగా మారింది. 

కరోనా కట్టడిపై టీటీడీ దృష్టి 
కరోనా నియంత్రణకు ఆయుర్వేద మందును తయారుచేయడంపై తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) దృష్టి సారించింది. ఇందులో భాగంగా ఆనందయ్య తయారుచేస్తున్న మందుపై ఆసక్తి చూపుతోంది. ఐసీఎంఆర్‌ నివేదిక అనుకూలంగా వస్తే ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ ఆయుర్వేద మం దును ప్రపంచానికి అందించాలని భావిస్తోంది. శేషాచలం అడవుల్లో అపార ఔషధ గుణాలు కలిగిన 1,300 మొక్కల జాతులు ఉన్నాయి.  వీటిలో అపార ఔషధ గుణాలున్న పెర్రూత, తంబ జాలరీ, కొండ సామ్రాణి, అడవి నీలిమందు, ఎరచ్రందనం, అడవి కంది, అడవి బిల్లు, తెల్ల కరక, మోగి, అడవి కొత్తివీుర, చిన్న పూలతుమ్మి లాంటి 11 రకాల మొక్కలకు శేషాచలం ప్రత్యేకం.

ఈ నేపథ్యంలో ఆనందయ్య తయారుచేస్తున్న మందు ముడిసరుకును పరిశీలించేందుకు ప్రభుత్వ విప్‌ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఎస్వీ ఆయుర్వేద కళాశాల వైద్య బృందం శనివారం కృష్ణపట్నంలో పర్యటించింది. అక్కడ మందు మందు తయారీ విధానం, ముడిసరుకును పరిశీలించారు. మందు పనితీరుపై స్థానికులతో మాట్లాడారు. ఈ మందుకు ప్రభుత్వ అనుమతి వస్తే టీటీడీ వద్ద ఉన్న అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీతో ఆయుర్వేద మందును తయారు చేస్తామని ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి తెలిపారు. టీటీడీ పరిధిలో అధునాతన ఫార్మా విభాగంతోపాటు సీనియర్‌ ప్రొఫెసర్లు, శాస్త్రవేత్తలు ఉన్నారన్నారు. ఈ మందుపై టీటీడీ పాలకమండలి ఆసక్తిగా ఉందని చెప్పారు. 

ఔషధ మొక్కలకు నెలవు శేషాచలం
అనేక ఔషధ మొక్కలకు శేషాచలం నిలయం. అన్ని మొక్కలు పెంచేందుకు శేషాచలం అనువైన ప్రాంతం కూడా. ఐసీఎంఆర్‌ నివేదిక అనుకూలంగా వస్తే టీటీడీ ఆధ్వర్యంలో మందు తయారీ మొదలుపెడతాం. ఇందుకు వారం పట్టొచ్చు. మందు తయారీకి ఔషధ మొక్కలు భారీ మొత్తంలో సేకరించాల్సి ఉంటుంది. 
– డాక్టర్‌ రమేష్‌బాబు, అసోసియేట్‌ ప్రొఫెసర్, ఎస్వీ ఆయుర్వేద కళాశాల, తిరుపతి 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement