సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, కార్యక్రమాలను ‘కోడ్’ పేరుతో సుదీర్ఘ కాలం అడ్డుకునేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ సుప్రీంకోర్టు తీర్పులకు సైతం వక్రభాష్యం చెబుతున్నారని రాజ్యాంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ప్రభుత్వంతో దీర్ఘకాలిక ఘర్షణ దిశగా ఆయన సాగుతున్నారని పేర్కొంటున్నారు. గతేడాది మార్చిలో నిమ్మగడ్డ అర్థాంతరంగా నిలిపివేసిన ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికల ప్రక్రియను తిరిగి ప్రారంభించేందుకు పోలింగ్ తేదీకి నాలుగు వారాల ముందు మాత్రమే ఎన్నికల కోడ్ అమలులోకి తేవచ్చని నాడు సుప్రీం కోర్టు తీర్పు వెలువరించగా ఎస్‌ఈసీ ఇప్పుడు దీన్ని పంచాయతీ ఎన్నికలకు వర్తింపచేస్తుండటం గమనార్హం. అత్యున్నత న్యాయస్థానం తీర్పులో పేర్కొన్న విధంగా నాలుగు వారాల ఎన్నికల కోడ్ నిబంధనను మధ్యలో నిలిపివేసిన ఎన్నికలను తిరిగి నిర్వహించడానికి వర్తింపచేయడానికి బదులు కొత్త నోటిఫికేషన్ ఇచ్చిన పంచాయతీ ఎన్నికల్లో అమలు చేసేందుకు ఎస్‌ఈసీ ఉపక్రమించారని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.
నోటిఫికేషన్ విడుదలకు పక్షం ముందే షెడ్యూలు..
సాధారణంగా స్థానిక ఎన్నికలు ఎప్పుడు జరిగినా ఎన్నికల నోటిఫికేషన్‌కు ఒకట్రెండు రోజుల ముందు షెడ్యూల్ ప్రకటించి అప్పటి నుంచే ఎన్నికల కోడ్‌ను అమల్లోకి తేవడం ఆనవాయితీ. అయితే పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలకు దాదాపు 15 రోజుల ముందు షెడ్యూల్‌ను ప్రకటించి ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు కోడ్ అమలులో ఉంటుందని ఎస్‌ఈసీ ఉత్తర్వులు జారీ చేశారు. సుప్రీంకోర్టు 2020 మార్చి 18వ తేదీన వెలువరించిన తీర్పును కారణంగా చూపుతూ నాలుగు వారాల నిబంధన మేరకు వెంటనే కోడ్ అమలులోకి తెస్తున్నట్టు నిమ్మగడ్డ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
నిమ్మగడ్డ వాదనను తిరస్కరించిన సుప్రీం...
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను నామినేషన్ల ప్రక్రియ ఉపసంహరణ తర్వాత, మున్సిపల్ ఎన్నికలను నామినేషన్ల స్వీకరణ తర్వాత గతేడాది మార్చిలో నిమ్మగడ్డ వాయిదా వేశారు. అప్పుడు కేవలం ఆ ఎన్నికలకు మాత్రమే నోటిఫికేషన్ జారీ చేశారు. పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్‌ను జారీ చేయలేదు. ఎన్నికలను వాయిదా వేస్తూ నాడు నిమ్మగడ్డ తీసుకున్న నిర్ణయంపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. 2020 మార్చి 18వ తేదీన సుప్రీంకోర్టు తీర్పు వెలువరిస్తూ.. అర్థాంతరంగా వాయిదా పడిన ఎన్నికల ప్రక్రియ ఎక్కడ ఆగిపోయిందో అదే స్థాయి నుంచి తిరిగి ప్రారంభించాలని స్పష్టం చేయడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించాకే ఎన్నికల తేదీలను ప్రకటించాలని ఆదేశించింది. ఎన్నికలను వాయిదా వేసినప్పటికీ ఎన్నికల కోడ్ అమలులో ఉంటుందన్న నిమ్మగడ్డ వాదనను సుప్రీంకోర్టు తిరస్కరించింది. వాయిదా పడిన ఆ ఎన్నికలను తిరిగి ప్రారంభించే సమయంలో పోలింగ్ తేదీకి నాలుగు వారాల ముందు మాత్రమే కోడ్ అమలులోకి వస్తుందని స్పష్టం చేసింది.
ఒక్క మాటా ప్రస్తావించలేదు..
తాజాగా పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించే సమయంలో ఎస్‌ఈసీ గతంలో అర్ధాంతరంగా వాయిదా వేసిన ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికల నిర్వహణ గురించి ఒక్క మాటా ప్రస్తావించలేదు. సుప్రీం తీర్పులో ప్రస్తావించిన 4 వారాల ముందు నుంచి ఎన్నికల కోడ్ అమలులోకి వస్తుందన్న నిబంధనను గ్రామ పంచాయతీ ఎన్నికలకు వర్తింపచేస్తున్నట్లు పేర్కొన్నారు.
సంక్షేమాన్ని అడ్డుకునే కుట్రలు..
సుప్రీంకోర్టు తీర్పునకు వక్రభాష్యం చెబుతూ పంచాయతీ ఎన్నికలకు చాలా ముందు నుంచే కోడ్‌ను అమలులోకి తీసుకు రావడం ద్వారా రాష్ట్రంలో పెద్ద ఎత్తున అమలవుతున్న సంక్షేమ పథకాలను అడ్డుకోవాలనే కుట్ర దాగి ఉందని రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. రాష్ట్రంలో 44.84 లక్షల మంది తల్లులకు ఈ నెల 11న అమ్మ ఒడి పథకం కింద రెండో విడత ఆర్థిక సహాయం అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సీఎం వైఎస్ జగన్ నెల్లూరు జిల్లాలో ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మరోవైపు ఈ నెల 20 వరకు ఇళ్ల పట్టాల పంపిణీ కొనసాగనుంది.
Comments
Please login to add a commentAdd a comment