కడు పేదరికం నుంచి.. బ్రిక్స్ వేదిక దాకా..
రష్యాలో జరుగుతున్న బ్రిక్స్ యూత్ సదస్సు
భారత్ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయేషా
సదస్సుకు హాజరైన ఏకైక తెలుగమ్మాయి
హెచ్‌సీయూలో ఆర్గానిక్ సింథసిస్‌లో పీహెచ్‌డీ
సాక్షి, హైదరాబాద్: రష్యాలోని ఉలియనోస్క్ సిటీలో జరుగుతున్న బ్రిక్స్ దేశాల యూత్ మినిస్టర్స్ సదస్సులో భారత్‌తోపాటు వివిధదేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ అంతర్జాతీయ వేదికపై పలువురు తమ ఆలోచనలు పంచుకుంటున్నారు. అప్పుడే ఒకమ్మాయి లేచి నిల్చుంది. తన మదిలో మెదులుతున్న భావనలను వేదికపై నిలబడి సగర్వంగా చాటిచెప్పింది. ఆమె చెప్పిన మాటలకు అక్కడున్న వారంతా చప్పట్లు కొట్టి ప్రశంసలతో ముంచెత్తారు. ఆమె పేరే షేక్ ఆయేషా. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పీహెచ్‌డీ చేస్తున్న ఆయేషా దేశం తరఫున బ్రిక్స్ సదస్సులో ప్రతినిధిగా పాల్గొన్న ఏౖకైక తెలుగమ్మాయి కావడం విశేషం.
పెందుర్తి టు సెంట్రల్ యూనివర్సిటీ ఏపీలోని గాజువాక జిల్లా పెందుర్తికి చెందిన మదీనాబీబీ– రెహ్మాన్ దంపతులకు ముగ్గురు కుమార్తెలు. వారిలో చిన్నకూతురు ఆయేషా. చిన్నప్పటి నుంచి చదువుతోపాటు సామాజిక చైతన్యంలో ఆయేషా ముందుండేది. డిగ్రీ వరకు విశాఖపట్నంలో చదవగా, విజయనగరంలోని కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయంలో పీజీ పూర్తి చేసింది. మూడేళ్ల క్రితం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో సింథటిక్ కెమిస్ట్రీలో పీహెచ్‌డీలో చేరింది.
సామాజిక సమస్యలపై పోరాటం చదువుతోపాటు సామాజిక స్పృహ కూడా ఆయేషాకు ఎక్కువే. ఎప్పుడూ తన తోటి విద్యార్థులతో కలిసి హక్కుల కోసం గొంతుక వినిపించేది. ఇటీవల హెచ్‌సీయూలో జరిగిన స్టూడెంట్ ప్రెసిడెంట్ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయింది. గెలుపోటములు పక్కన పెడితే విద్యార్థుల కోసం తాను ఉన్నానంటూ తెలియజెప్పడమే తన ధ్యేయమని ఆయేషా చెబుతోంది.
ఐదు రోజుల సదస్సు..
ఈ నెల 22న రష్యాలో ప్రారంభమైన బ్రిక్స్ యూత్ సదస్సు శుక్రవారంతో ముగియనుంది. ఈ సదస్సులో సామాజిక సేవ విషయంలో బ్రిక్స్ దేశాల మధ్య ఎక్సే్చంజ్ ప్రోగ్రామ్ ఉంటే బాగుంటుందని ఆయేషా ప్రతిపాదించింది. సంస్కృతి, యువతనాయకత్వం, కమ్యూనిటీ సర్వీస్ విషయంలో వలంటీర్ వర్క్ ఎలా జరుగుతుందనే విషయాలను బ్రిక్స్ దేశాల యువత పరస్పరం పంచుకోవాలని చెప్పింది. దీనిపై సదస్సులో చర్చ జరిగిందని, బ్రిక్స్ దేశాలు మద్దతు ఇచ్చాయని ఆయేషా వెల్లడించింది. కేంద్ర యూత్ అఫైర్స్, స్పోర్ట్స్ సహాయమంత్రి రక్ష నిఖిల్ ఖడ్సే కూడా తనపై ప్రశంసలు కురిపించారని ఆమె పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment