సాక్షి, అమరావతి: మన దేశంలో 1996 నాటికి కేవలం 7 కోట్ల విద్యుత్ సర్వీసులుండేవి. ఇప్పుడు దాదాపు 26 కోట్ల సర్వీసులతో ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద విద్యుత్ వినియోగదారులున్న దేశంగా అవతరించింది. వీటిలో 41 శాతం పరిశ్రమలు, 26 శాతం గృహావసరాలకు వినియోగిన్నారు. కేవలం ఈ లెక్కలే కాదు.. విద్యుత్ రంగంపై జరుగుతున్న అధ్యయనాలు సైతం భారత్ విద్యుత్ వెలుగులు విరజిమ్ముతోందని స్పష్టం చేస్తున్నాయి.
అయితే, దేశంలో 13 శాతం గృహాలకు మాత్రం ఇప్పటికీ విద్యుత్ అందుబాటులో లేదు. విద్యుత్ వినియోగదారులు, డిస్కంపై రాక్‌ఫెల్లర్ ఫౌండేషన్, నీతి ఆయోగ్‌తో కలిసి స్మార్ట్ పవర్ ఇండియా జరిపిన సర్వేలో పలు ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. దేశ జనాభాలో దాదాపు 87 శాతం మందికి గ్రిడ్ ఆధారిత విద్యుత్ అందుబాటులో ఉందని సర్వే వెల్లడించింది.
సగటున 17 గంటల సరఫరా
దేశంలో విద్యుత్ అందుబాటులో లేని 13 శాతం మంది ఇతర మార్గాల్లో విద్యుత్‌ను పొందడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ 13 శాతంలో ఎక్కువగా 62 శాతం మంది వ్యవసాయదారులు ఉండటం గమనార్హం. కేవలం 4 శాతం గృహాలకు మాత్రమే గ్రిడ్ ఆధారిత విద్యుత్ లేదు. 92 శాతం మంది కస్టమర్లకు కేవలం 50 మీటర్ల లోపుగానే విద్యుత్ మౌలిక సదుపాయాలు లభిస్తున్నాయి.
వ్యవసాయ కేటగిరీ సర్వీసులకు ఇది 75 శాతంగా ఉంది. మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్న వినియోగదారులకు కనెక్షన్ రేటు 86 శాతం, వ్యవసాయ వినియోగదారులకు కనెక్షన్ రేటు 70 శాతం, సంస్థాగత వినియోగదారులకు కనెక్షన్ రేటు 81 శాతంగా ఉంది.
విద్యుత్ అందుబాటులో లేకపోవడానికి కారణాలివీ
కొందరికి విద్యుత్ అందుబాటులో లేకపోవడానికి కారణాలను కూడా అధ్యయనం వెల్లడించింది. కస్టమర్‌కు దూరంగా విద్యుత్ స్తంభం ఉండటం 47 శాతం, విద్యుత్ ఖర్చులు, వినియోగదారు చార్జీలు 35 శాతం, పేలవమైన సేవల నాణ్యత 20 శాతం కారణంగా ఉన్నాయి. వాణిజ్య కస్టమర్లలో దాదాపు సగం మంది సర్వీసు తీసుకోకపోవడానికి ప్రధాన కారణం ఖర్చులు భరించలేకపోవడం అని అధ్యయనంలో వెల్లడించారు.
గ్రిడ్ ఆధారిత విద్యుత్ కనెక్షన్ ఉన్న గృహ వినియోగదారులలో 92 శాతం మంది తక్కువ మంజూరైన లోడ్ 0–1 కిలోవాట్ పరిధిలోనే ఉన్నారు. విద్యుత్ సరఫరా సగటున రోజుకు సుమారు 17 గంటలు ఉంటోంది. 70 శాతం మంది గృహ వినియోగదారులు వారంలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ విద్యుత్ కోతలను ఎదుర్కొంటున్నారు. దాదాపు 75 శాతం మంది గృహ వినియోగదారులకు విద్యుత్ కోతల గురించి ముందస్తు నోటిఫికేషన్ అందటం లేదు. 63 శాతం మంది వినియోగదారులు వారంలో ఒకటి కంటే ఎక్కువ వోల్టేజి సమస్యలకు గురయ్యారు. 16 శాతం మంది వినియోగదారులు విద్యుత్ ప్రమాదాలను చవిచూశారు.
Comments
Please login to add a commentAdd a comment