సాక్షి రాయచోటి : అన్నమయ్య జిల్లాలో ప్రజలు ప్రశాంత వాతావరణంలో జీవించేలా పోలీసు యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపడుతోంది. ఎక్కడికక్కడ అసాంఘిక కార్యకలాపాల నిర్మూలనకు జిల్లా పోలీసుశాఖ నిఘాను ముమ్మరం చేసింది. సీసీ కెమెరాల ఏర్పాటు మొదలుకొని అవసరమైన అన్ని భద్రతా చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలోని అడవుల్లో అత్యధికంగా విస్తరించిన ఎర్రచందనం అక్రమ రవాణా జరగకుండా ఉండేందుకు అవసరమైన ప్రణాళికను రూపొందించి అమలు చేస్తున్నారు.
ఇందులోభాగంగా స్మగ్లర్లు ఎర్రచందనం కూలీలకు కౌన్సెలింగ్ ఇవ్వడంతోపాటు ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేస్తున్నారు. జిల్లాలోని రౌడీషీటర్లు, అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై నిఘా ఉంచడంతోపాటు ఇసుక దొంగలు, మట్కా, గ్యాంబ్లింగ్, దొంగతనాలకు పాల్పడిన పాత నేరస్తులను స్టేషన్‌కు పిలిచి బైండోవర్ చేస్తున్నారు. ఈ కార్యక్రమం ప్రతి మంగళవారం అన్ని స్టేషన్లలో నిర్వహించేలా ఎస్పీ హర్షవర్దన్‌రాజు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. వేళ్లూనుకున్న నాటుసారా స్థావరాలను కూకటివేళ్లతో పెకలించేలా పోలీసులను కదిలిస్తున్నారు.
జిల్లాలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడేవారిపై పోలీసులు చర్యలకు ఉపక్రమించారు. గ్రామాల్లో గొడవలకు సంబంధించి అనుమానాస్పద వ్యక్తులుగా ముద్రపడిన వారితోపాటు రౌడీషీటర్లు, దొంగతనాలకు పాల్పడే పాత నేరస్తులు, ఇసుక దొంగలు, పేకాట, మట్కా, క్రికెట్ బెట్టింగ్ నిర్వహించే వారిని స్టేషన్‌కు పిలిపించి కౌన్సెలింగ్ ఇవ్వడంతోపాటు బైండోవర్ కేసులు నమోదు చేస్తున్నారు. బైండోవర్‌లో భాగంగా రూ. 50 వేల నుంచి రూ. లక్ష, కేసులను బట్టి రూ. లక్ష నుంచి రూ. 2 లక్షల వరకు బైండోవర్ చేస్తున్నారు.
అయితే పాత నేరస్తులకు గతం గతించింది...ఇప్పుడు ప్రశాంతంగా ఉండండి...అలా కాకుండా మళ్లీ నేరాలకు పాల్పడితే కచ్చితంగా బైండోవర్ ప్రకారం కేసులతోపాటు పూచీకత్తు కింద రాసిన సొమ్మును చెల్లించాల్సి ఉంటుందని కరాఖండిగా వివరిస్తున్నారు. జిల్లాలో ఇప్పటివరకు నెల రోజుల వ్యవధిలో 850 మందిపై బైండోవర్ కేసులు నమోదు చేయడం విశేషం.
జిల్లాలో నాటుసారా స్థావరాలపై ఎస్‌ఈబీ అధికారులతో కలిసి పోలీసులు సంయుక్త దాడులు చేస్తున్నారు. నాటుసారా కాస్తున్న ప్రాంతాలకు వెళ్లి బట్టీలను ధ్వంసం చేయడంతోపాటు నిర్వాహకులపై కేసులు నమోదు చేస్తున్నారు. ఇప్పటివరకు 95 నాటుసారా బట్టీలను ధ్వంసం చేయడమే కాకుండా 35 మందిపై కేసులు నమోదు చేశారు. గ్రామాల్లోకి వెళ్లి నాటుసారా వల్ల కలిగే అనర్థాలను వివరిస్తూ ఎవరూ కూడా బట్టీలు ఏర్పాటు చేయకుండా ఉండేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు.
‘ఎర్ర’బంగారం వైపు చూస్తే ఖబడ్దార్
జిల్లాలోని రాజంపేట, రైల్వేకోడూరు, రాయచోటి, పీలేరు ప్రాంతాల్లో విస్తరించిన శేషాచలం, పాలకొండలు ప్రాంతాల్లోని ఎర్రచందనం అక్రమ రవాణా వ్యవహారంపై ఎస్పీ ప్రత్యేక దృష్టి సారించారు. అక్రమ రవాణా నిరోధానికి సంబంధిత స్మగ్లర్లతోపాటు కూలీలను స్టేషన్‌కు పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చేలా చర్యలు చేపట్టారు. ఎర్రచందనం అక్రమ రవాణాలో పాత కేసులు ఉన్న వారిని కూడా డీఎస్పీ స్థాయి అధికారుల ద్వారా హెచ్చరిస్తున్నారు. జిల్లాలోని సుమారు 250 మందికి పైగా స్మగ్లర్లు, కూలీలు, సానుభూతి పరులను స్టేషన్‌కు పిలిపించి కౌన్సెలింగ్ నిర్వహించడంతోపాటు అక్రమ వ్యవహారానికి పాల్పడితే పీడీ యాక్టు నమోదు లాంటి కఠిన చర్యలు చేపడతామని స్పష్టం చేస్తున్నారు.
అసాంఘిక కార్యకలాపాల జోలికి వెళ్లొద్దు
జిల్లాలో శాంతి భద్రతలకు సంబంధించి అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ప్రజలు ప్రశాంత వాతావరణంలో జీవించేలా వాతావరణం కల్పిస్తున్నాం. రౌడీ షీటర్లు, సమస్యలు సృష్టించేవారు, ఇసుక అక్రమ రవాణా చేసేవారు, దొంగతనాలకు పాల్పడే వారిపై ఇప్పటికే పెద్ద ఎత్తున బైండోవర్ కేసులు పెట్టాం. అలా కాదని మళ్లీ నేరాలకు పాల్పడితే కేసులతోపాటు కఠిన చర్యలు ఉంటాయి. ఎర్రచందనం అక్రమ రవాణా జరగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నాం. చెక్‌పోస్టులతోపాటు పోలీసుల వ్యూహాలు అమలు చేస్తున్నాం. ఇప్పటికే 250 మందికి పైగా స్మగ్లర్లు, కూలీలను స్టేషన్‌కు పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చాం. ప్రతిరోజు ప్రత్యేకంగా అక్రమ రవాణా అడ్డుకోవడం కోసమే పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ప్రతి మంగళవారం రౌడీషీటర్లు, ఇతర నేరస్తులు స్టేషన్‌కు వచ్చి సంతకాలు చేసేలా చర్యలు తీసుకున్నాం. నాటుసారాపై కొరడా ఝళిపిస్తున్నాం.
– వి.హర్షవర్దన్‌రాజు, జిల్లా ఎస్పీ
Comments
Please login to add a commentAdd a comment