కోటీ, రెండు కోట్లు కాదు.. ఏకంగా రూ.35 వేల కోట్లు. బ్యాంకుల్లో పదేళ్లుగా ఎటువంటి లావాదేవీలు జరగని, క్లెయిమ్ చేయని డిపాజిట్ల మొత్తమిది. డిపాజిట్‌దారులు మరణించిన తర్వాత వారి కుటుంబ సభ్యుల(వారసులు)కు కూడా తెలియని డిపాజిట్లు కొన్నయితే, వారసులు ఎవరో తేలక బ్యాంకులోనే ఉండిపోయినవి కొన్ని.
సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో పదేళ్లు, అంతకంటే ఎక్కువ కాలం ఎవరూ క్లెయిమ్ చేయని ఈ డిపాజిట్ల మొత్తం రూ. 35,012 కోట్లుగా కేంద్ర ఆర్థి క మంత్రిత్వ శాఖ తెలిపింది. 10,24,00,599 ఖాతాలకు చెందిన ఈ మొత్తాన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు నిబంధనల మేరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ)కి బదిలీ చేసినట్లు పేర్కొంది. ఈ సొమ్ము మృతుల వారసులకు చెందాల్సి ఉందని తెలిపింది.
ఈ క్లెయిమ్‌లను పరిష్కరించడంలో కుటుంబ సభ్యులకు సహకరించేందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటుందని తెలిపింది. మృతుల ఖాతాలకు సంబంధించి చట్టపరమైన ప్రాతినిధ్యం లేకుండా క్లెయిమ్‌లు పరిష్కరించరు. ఇందుకోసం నిర్దిష్టమైన దరఖాస్తు, నిబంధనలు ఉంటాయి. వీటిని మృతుల కుటుంబ సభ్యులు సులభంగా అర్థం చేసుకునేలా రూపొందించినట్లు ఆర్థి క మంత్రిత్వ శాఖ తెలిపింది.
క్లెయిమ్ దరఖాస్తులు సరైన వివరాలు లేకుండా, అసంపూర్తిగా ఉంటే వాటిని బ్యాంకులు తిరస్కరిస్తాయని, అయితే వాటిని తిరస్కరించడానికి కారణాలను క్లెయిమ్‌దారులకు బ్యాంకులు తెలియజేయాలని, సక్రమంగా నమోదు చేయడానికి సహకరించాలని ఆదేశాలు జారీ చేసినట్లు కేంద్ర ఆర్థి క శాఖ పేర్కొంది. ఈ ఖాతాల వివరాలను వెబ్‌సైట్‌లో ఉంచాలని ఆదేశించినట్లు చెప్పింది.
ఎవరూ క్లెయిమ్ చేయకపోతే, చట్టబద్ధమైన వారసులను కనుగొనేందుకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని కూడా ఆదేశించినట్లు తెలిపింది. ఒక సంవత్సరానికంటే ఎక్కువ కాలం కార్యకలాపాలు లేని ఖాతాలను ప్రతి ఏడాదీ సమీక్షించాలని ఆర్‌బీఐ బ్యాంకులను ఆదేశించిందని తెలిపింది. ఆ ఖాతాదారులను సంప్రదించి కారణాలను తెలుసుకోవడంతో పాటు ఎటువంటి లావాదేవీలు జరగలేదని లిఖితపూర్వకంగా నిర్ధారించుకోవాలని సూచించినట్లు చెప్పింది.
Comments
Please login to add a commentAdd a comment