కోతులకు అరటిపండ్లను అందజేస్తున్న బాషామోహిద్దీన్
ఆదివారమొస్తే చాలు... తమ నేస్తం వస్తాడని.. తమ కోసం కమ్మనైన ఆహారం తెస్తాడని ఆవులు ఆశగా ఎదురుచూస్తుంటాయి. అతను కంట పడితే చాలు చిటారు కొమ్మనున్న కోతులు చటుక్కున వచ్చి చుట్టూ చేరతాయి.. ఇక పిచుకలు.. కాకులు తమ గొంతును సవరిస్తూ ఒళ్లోకొచ్చి వాలిపోతాయి. మూగ జీవాల ఆకలి తీరుస్తూ.. కారుణ్య పథంలో పయనిస్తున్నాడు కడప నగరానికి చెందిన బాషా. ‘మూగజీవాలు నా ఆత్మబంధువులు’ అంటున్న ఈ ‘బాద్‌షా’ కథేంటో చదవండి.
పక్కనోడి కోసం పది రూపాయలు ఖర్చు పెట్టాలంటే పదిసార్లు ఆలోచిస్తాం....అందులో మనకేం లాభం, ఎంత లాభమని ఆలోచిస్తాం..ఎలాంటి స్వార్థం లేకుండా ఏ పని చేయని ఈ రోజుల్లో తమకేం కావాలో అడగలేని, ఆకలైతే అన్నం పెట్టమని కోరలేని మూగజీవాల కడుపు నింపడం, అందుకు వేలాది రూపాయలు ఖర్చు చేయడం నిజంగా విశేషమే. అందుకే పిచుకలు, కాకులు, చిలకలు, గోరింక లాంటి పక్షులు, ఉడతలు, పిల్లులు, కుక్కలు, కోతులు తదితర జంతువులు బాషాకి నేస్తాలయ్యాయి. ఆదివారం కాగానే తమ కడుపునింపే నేస్తం వస్తాడని అవి ఆశగా ఎదురు చూస్తాయి. ఆయన కనిపించగానే చిరకాల స్నేహితుల్లా ఆప్యాయంగా దగ్గరకొస్తాయి. అతనిచ్చే ఆహారాన్ని హక్కులా లాక్కుంటాయి. మా ఆకలి తీరుస్తున్న నేస్తమా....కలకాలం క్షేమంగా వర్దిల్లు అంటూ తృప్తిగా మెరిసే కళ్లతో మౌనంగా దీవిస్తూ వెనక్కి తిరిగి తిరిగి చూస్తూ వెళ్లిపోతాయి. మళ్లీ ఆదివారం కోసం ఎదురు చూస్తాయి.
కడప కల్చరల్: కడప నగరం కో– ఆపరేటివ్ కాలనీలోగల ‘బీ–3 జిమ్’ సెంటర్ నిర్వాహకులు షేక్ బాషా మోహిద్దీన్. ఆయనకు ఫ్రెండ్స్ సర్కిల్ పెద్దదే. కానీ ఆయనకు పక్షులు, జంతువులతో కూడా మంచి సఖ్యత ఉంది. నాలుగేళ్లుగా వాటితో అనుబంధం పెంచుకుంటూ ఉన్నారు. వాటికి వారంలో ఒకరోజైనా కడుపునిండా ఆహారం పెట్టే అవకాశం లభించడం తనకు దక్కిన అరుదైన వరంలా ఆయన భావిస్తున్నారు. తనకు వచ్చే ఆదాయంలో అందరిలాగానే ఆనందంగా గడిపేవాడు. కానీ 2010లో ఓ సంఘటన ఆయన జీవితాన్ని మలుపు తిప్పింది. కడప నుంచి సిద్దవటం మీదుగా అటవీ ప్రాంతం గుండా వెళు తున్న సమయంలో రోడ్డు వారగా కోతుల గుంపులను చూశాడు.
తాగి పడేసిన వాటర్ బాటిల్‌లో నీటి చుక్క కోసం అవి కీచులాడుతుండడం గమనించి తన వద్దగల నీటి బాటిల్‌ను సమీపంలో పడేశాడు. అవి కొట్లా డుకుంటూ నీళ్లు తాగడం గమనించాడు. తర్వాత ఆదివారం నీటి క్యాన్లతో తిరిగి ఆ ప్రాంతానికి వెళ్లి అక్కడి గుంతల్లో నీరు పోశాడు. కోతులు ఆ నీటిని తాగడం చూశాడు. ఆ తర్వాత వారం కొన్ని ప్లాస్టిక్ తొట్లు సమకూర్చుకుని దారిలో సిద్దవటం వద్దనున్న పెన్నానదిలో వాటర్ క్యాన్లలో నీరు నింపుకుని వెళ్లి కోతులకు అందజేశాడు. కోతులుండే ప్రాంతానికి వెళ్లి తొట్లు అక్కడ ఉంచి నీరు పోశాడు. వాటి తాగునీటి అవసరాన్ని గుర్తించాడు. ప్రతి ఆదివారం స్నేహితులతో కలిసి ఆటోలో వాటర్ క్యాన్లు పట్టుకెళ్లి కోతుల దాహం తీర్చడం ప్రారంభించాడు. నీరు తెస్తున్న తమ ఆటోను చూడగానే కోతుల సంతోషాన్ని గమనించిన ఆయన ఆ కార్యక్రమాన్ని అలవాటుగా మార్చుకున్నాడు. నాటి నుంచి అతని కారుణ్య దృష్టి విస్తృతి పెరిగింది.
కోతికి ఆహారాన్ని అందజేస్తున్న బాషామోహిద్దీన్ ఆవులకు అరటిపండ్లను తినిపిస్తూ...
నగరంలో ఆవులు సేద తీరే ప్రాంతానికి వెళ్లి వాటికి గడ్డి, అవిశాకు అందజేయడం మొదలెట్టాడు. తన ఇంటి పరిసరాల్లో తిరుగుతున్న పిల్లలు, కుక్కలకు పాలు, మాంసం అందించేవాడు. కాకులు, పిచుకలు లాంటి ఇతర పక్షులకు ఆహారం అందజేసేవాడు. కాలక్రమంలో అవన్నీ బెరుకు వదలి అతనికి సన్నిహితంగా రాసాగాయి. దీంతో బాషామోహిద్దీన్ క్రమంగా తన సేవలను విస్తరించాడు. నగర శివార్లలోని జేఎంజే కళాశాల ప్రాంతం, భాకరాపేట, సిద్దవటం, అట్లూరు, రాపూరు, రామాపురం, గువ్వలచెరువు ఘాట్ లాంటి అటవీ ప్రాంతాల్లో ప్రతి ఆదివారం కోతులకు పండ్లు, ఇతర ఆహార పదార్థాలను అందిస్తున్నాడు.
ఆహారంతో వచ్చే తమ వాహనాన్ని చూడగానే ఆ మూగ ప్రాణాలు కిచకిచలాడుతూ పరుగెత్తుకుంటూ వచ్చి ఎగబడి ఇచ్చిన ఆహారాన్ని తినడం గమనించిన తనకు ఎంతో ఆనందం కలిగిందని బాషామోహిద్దీన్ పేర్కొంటున్నారు. 2011 నుంచి ప్రతి ఆదివారం జంతువులకు ఆహారం అందించడం అలవాటుగా మార్చుకున్నాడు. అప్పటి నుంచి ఆదివారాలు బంధుమిత్రులు, ఇతరుల వివాహాలు, ఇతర ఫంక్షన్లు, కనీసం కుటుంబంలో జరిగే విందు వినోదాలకు కూడా పుల్‌స్టాప్ పెట్టేశాడు.
బాషా మోహిద్దీన్ తన ఆదాయంలో కుటుంబ అవసరాలకుపోగా మిగతా సొమ్మును పూర్తిగా ఇలాంటి కార్యక్రమాలకే ఖర్చు చేస్తున్నాడు. ఉదయాన్నే వెళ్లి పలు రకాల పండ్లను హోల్‌సేల్‌గా కొని బాడుగ ఆటోలో వాటిని తీసుకెళ్లి అటవీ ప్రాంతాల్లో రోడ్డు వారగా ఎదురు చూస్తూ ఉండే మూగ జీవాలకు అందజేస్తున్నాడు. సాయంగా వచ్చే స్నేహితుల బైకులపై ఆహారం మూటలు వేసుకు వెళుతూ వాటి ఆకలి తీరుస్తున్నాడు. కరోనా సమయంలో కూడా ఈ కార్యక్రమం ఆపలేదు. పాలు, చికెన్ ఉదయాన్నే అందజేయడానికి ప్రత్యేకంగా వ్యక్తులను ఏర్పాటు చేసుకున్నాడు. నిబంధనలతో పోలీసులు ఆహార వాహనాన్ని ఆపినా... విషయాన్ని తెలిపి అనుమతి పొందుతూనే ఉన్నాడు.
మూగ జీవాలు.. ఆత్మీయ బంధువులు
మూగజీవాలే నా ఆత్మ బంధువులు. వాటి సేవను దైవ కార్యంగా భావిస్తున్నా. అడవుల విస్తీర్ణం తగ్గడం, చెట్లు నరికివేత, వర్షాభావం తదితర కారణాలతో అడవిలోని పలు చిన్న జంతువులకు ఆహారం లభించడం లేదు. ముఖ్యంగా తాగునీటికి కూడా చాలా ఇబ్బందులు పడుతున్నాయి. అందుకే నా శక్తి మేరకు ఆదివారం వీటిని అందిస్తున్నా. కరోనా కారణంగా పలుచోట్ల హోటళ్లు, ఆహారం విక్రయించే దుకాణాలు తెరవకపోవడంతో పిల్లులు, కుక్కలు, కాకులు లాంటి పక్షులకు ఆహారం లభించడం లేదు. ఇలాంటి వాటిని బతికించుకుంటేనే ప్రకృతి సమతుల్యంగా ఉంటుంది. అందుకే తన స్వంత పనులైనా మానుకుంటాగానీ, ఆదివారాలు మాత్రం ఎలాంటి స్థితిలోనూ మూగ జీవాలకు ఆహారం అందించడానికే కేటాయిస్తా. బంధుమిత్రులు, కుటుంబ సభ్యుల మద్దతు కూడా లభిస్తోంది గనుకనే నిరంతరాయంగా సేవలు అందించగలుగుతున్నా.
– బాషా మొహిద్దీన్, మూగజీవాల ప్రేమికుడు
చదవండి: కొద్ది గంటల్లో పెళ్లి.. అంతలోనే ఊహించని ట్విస్ట్
'లగ్గసరి'.. కన్యాశుల్కం ఇవ్వాల్సిందే మరి
Comments
Please login to add a commentAdd a comment