animal lover
-
పెంపుడు శునకానికి ఘనంగా అంత్యక్రియలు
కోదాడ (సూర్యాపేట జిల్లా): మనిషి చనిపోతే అంత్యక్రియలు ఎలా నిర్వహిస్తారో చనిపోయిన పెంపుడు శునకానికి కూడా అదేవిధంగా కర్మకాండలు నిర్వహించారు ఓ జంతు ప్రేమికుడు. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని నయానగర్‌కు చెందిన భూసాని మల్లారెడ్డి, ఈశ్వరమ్మ దంపతులకు పిల్లలు లేకపోవడంతో పదిహేనేళ్ల క్రితం ఓ శునకాన్ని తెచ్చుకున్నారు. శుక్రవారం ఆ శునకం చనిపోవడంతో ఆయన బ్యాండ్ మేళాన్ని ఏర్పాటు చేసి మరీ అంత్యక్రియలు పూర్తి చేశారు ఆ దంపతులు. ఇక ఆ శునకానికి చిన్న, పెద్ద కర్మ కాండలు కూడా నిర్వహిస్తామని మల్లారెడ్డి దంపతులు చెబుతున్నారు. -
పర్యావరణం.. పక్షికి పండగ దూరం చేయవద్దు!
ఆమె రాగానే అప్పటివరకు గోలగోలగా ఉన్న హాలు సద్దుమణిగింది. ‘అందరూ వచ్చినట్లే కదా!’ అని ఆత్మీయంగా అడిగింది సీమ. ‘ఏమిటో మేడమ్ సెలవ రోజుల్లో ఈ క్లాసు...’ అని ఆవులించాడు ఒక కాలేజి విద్యార్థి. కొన్ని నవ్వులు వినిపించాయి. ‘ఇవి చూడండి’ అంటూ ఆమె కొన్ని చిత్రాలు చూపించింది. నీలాకాశంలో రంగురంగుల గాలిపటాలు ఎగురుతున్న చిత్రాలు, ఆబాలగోపాలం ఆనందంతో పతంగులు ఎగరేస్తున్న చిత్రాలు, ‘కీంచ్...కాట్’ అంటూ వేరేవాళ్ల గాలిపటాలను ఆకాశంలో కట్ చేస్తున్న చిత్రాలు, తెగిపడిన గాలిపటాల వెంట అరుపులతో పరుగులు తీస్తున్న పిల్లలు... ఇలా ఎన్నో ఉన్నాయి. ‘ఈ చిత్రాలు కూడా చూడండి’ అంటూ మరికొన్ని చిత్రాలు చూపించింది. రెక్కలు తెగిన పక్షుల చిత్రాలు. మెడ తెగి నేలరాలి బాధతో కొట్టుకుంటున్న పక్షుల చిత్రాలు. కరెంటు తీగలకు, చెట్ల కొమ్మలకు అల్లుకున్న దారాల్లో చిక్కుకుపోయి ఊపిరాడక చనిపోతున్న పక్షుల చిత్రాలు... హృదయాన్ని మెలిపెట్టే చిత్రాలు ఇవి. ‘సంతోషం ముఖ్యమే కాని, మన సంతోషం పక్షుల చావుకు కారణం కావద్దు కదా!’ అన్నది సీమ. కొద్దిసేపు ఆ హాల్లో నిశ్శబ్దం. ‘గాలిపటాలు ఎగిరేస్తున్నప్పుడు అప్పుడప్పుడు మన చేతివేళ్లు కోసుకుపోతాయి. ఆ కాస్త దానికే తల్లడిల్లిపోయి హాస్పిటల్‌కు పరుగెత్తుతాం. కాని పక్షులు మాత్రం మన గాలిపటాల వల్ల తీవ్రగాయాలపాలై చనిపోతున్నాయి. మనం హాస్పిటల్‌కు పరుగెత్తినట్లు అవి పరుగెత్తలేవు కదా!’ అని సీమ అన్నప్పుడు ఎంతటి హృదయాలైనా కరిగిపోవాల్సిందే. నవీ ముంబైకి చెందిన సీమా టాంక్ జంతు ప్రేమికురాలు. పండగరోజుల్లో గాలిపటాలు పక్షుల పాలిట మృత్యుపాశాలుగా మారకుండా ఉండడానికి ఆమె అవగాహన సదస్సులు నిర్వహిస్తుంటుంది. మొదట్లో ఈ సదస్సుకు రావడానికి ఇష్టపడని వారు కూడా ఆ తర్వాత నిజం గ్రహించి మార్పు దిశగా పయనించడం ఆమెకు సంతోషం ఇస్తోంది. సీమ మాటలతో ప్రభావితమైనవారు ‘పక్షులకు పండగ దూరం చేయవద్దు ప్లీజ్’ ‘మన సంతోషానికి పక్షులు మూల్యం చెల్లించుకోవాలా?’ ‘ఆకాశంలో గాలిపటం ఎగరేసేముందు, అదే ఆకాశంలో ఎగురుతున్న పక్షి వైపు కూడా చూడు’... లాంటి పోస్ట్‌లు సామాజికవేదికల్లో పెడుతుంటారు. సీమలాంటి వ్యక్తులే కాదు ‘ప్లాంట్స్ అండ్ యానిమల్ వెల్ఫేర్ సొసైటీ’లాంటి సంస్థలు కూడా అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాయి. ఫేస్బుక్ వేదికగా హెల్ప్‌లైన్ నంబర్స్, రెస్క్యూ టిప్స్ షేర్ చేస్తున్నాయి. ‘సేవ్ బర్డ్స్’ అనేది యానిమల్ లవర్స్, యాక్టివిస్ట్‌ల నినాదం మాత్రమే కాదు, అది అందరి కనీస బాధ్యత అనే ఎరుక మనకు కలిగితే చాలు... పండగ సంతోషం మనతోపాటు పక్షులకూ దక్కుతుంది. -
'పీకాబు' అంటూ తన పిల్లల్ని పలకరిస్తున్న టర్కీ చిలుక
టర్నీ: మనం అప్పుడే పుట్టిన నవజాతువు శిశువుల్ని చూడగానే చిన్నతల్లి లేదా చిన్న తండ్రి లేదా మరేదైనా ముద్దు పేరుతో పిలుస్తూ ఆనందిస్తాం కదా. అచ్చం మనిషిలాగేనే టర్కీలోని బుర్సాలో ఒక చిలుక తన పిల్లలను ముద్దు ముద్దుగా పలకరిస్తోంది. కాకాటిల్స్ అనే పక్షి రామచిలుక జాతికి చెందినది. (చదవండి: "సైక్లోథాన్‌తో మానసిక ఆరోగ్యం పై అవగహన కార్యక్రమాలు") ఈ పక్షి మనుషులను చక్కగా అనుకరించడమే కాక మనం ఏదైన శిక్షణ ఇస్తే అత్యంత సులభంగా నేర్చుకోగలదు. ఇది అత్యంత తెలివైన పక్షి. ఆ చిలుకకు ఇష్టమైన ఆట పికాబు కావడంతో ఆ పేరుతోనే తన పిల్లలను చక్కగా పలకరిస్తోంది. పైగా వాటిని పింగాణి పాత్రలో భద్రపరుస్తోంది. ప్రస్తుతం ఈ వీడియోను నెస్టేక్ కనట్లర్ అనే జంతు ప్రేమికుడు ఇన్‌స్ట్రాగామ్‌లో పోస్ట్ చేశాడు. దీంతో ఈ వీడియో ప్రస్తుతం నెట్టింగ తెగ వైరల్ అవుతోంది. ఎంత చక్కగా తన పిలల్ని పలకరిస్తోందో మీరు కూడా ఓ లుక్ వేయండి. (చదవండి: బుడిబుడి నడకల బుడతడు డ్యాన్స్ చేసి అదరగొడుతున్నాడు) -
పిల్లిని తెచ్చిస్తే.. రూ.30 వేలిస్తా
సుల్తాన్‌బజార్ (హైదరాబాద్): తాను ప్రాణానికి ప్రాణంగా పెంచుకున్న పిల్లి తప్పిపోవడంతో ఓ జంతు ప్రేమికురాలు కలత చెందారు. ఆచూకీ కోసం పోలీసులను ఆశ్రయించారు. వారు ఫిర్యాదు తీసుకోకపోవడంతో పిల్లి ఫొటోతో రోడ్డుపై కరపత్రాలు సైతం పంచారు. అయినప్పటికీ పిల్లి ఆచూకీ దొరకకపోవడంతో ఏకంగా విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. పిల్లి జాడ తెలిపిన వారికి నగదు రివార్డు సైతం ప్రకటించారు. టోలిచౌకీ ప్రాంతానికి చెందిన జరీనా 8 నెలల నుంచి ఓ పిల్లిని పెంచుకుంటున్నారు. దానికి జింజర్ అని పేరు కూడా పెట్టారు. జింజర్‌కు జూబ్లీహిల్స్‌లోని ట్రస్టీ పెట్ క్లినిక్‌లో జూన్ 17న కుటుంబ నియంత్రణ సర్జరీ చేయించారు. అనంతరం వాపు రావడంతో తిరిగి జూన్ 23న అక్కడికే తీసుకెళ్లారు. ఈ క్రమంలో క్లినిక్ నుంచి పిల్లి అదృశ్యమైంది. జూన్ 27న రాయదుర్గం పోలీసులను ఆశ్రయించగా వారు ఫిర్యాదు తీసుకోకపోవడంతో జూబ్లీహిల్స్ పరిసర ప్రాంతాలలో పిల్లి ఫొటోతో కరపత్రాలు కూడా పంచారు. 20 రోజులుగా తన పిల్లి జాడ దొరకడం లేదని, ఆస్పత్రి వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నారని జరీనా వాపోయారు. మంగళవారం హైదర్‌గూడలోని ఎన్ఎస్ఎస్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసిన జరీనా, జింజర్ ఆచూకీ తెలిపిన వారికి రూ. 30 వేల రివార్డు ఇస్తానని, తను ప్రాణంగా పెంచుకుంటున్న జింజర్‌ను తెచ్చివ్వాలని కోరారు. -
ఆదివారమొస్తే చాలు... తమ నేస్తం వస్తాడని..
ఆదివారమొస్తే చాలు... తమ నేస్తం వస్తాడని.. తమ కోసం కమ్మనైన ఆహారం తెస్తాడని ఆవులు ఆశగా ఎదురుచూస్తుంటాయి. అతను కంట పడితే చాలు చిటారు కొమ్మనున్న కోతులు చటుక్కున వచ్చి చుట్టూ చేరతాయి.. ఇక పిచుకలు.. కాకులు తమ గొంతును సవరిస్తూ ఒళ్లోకొచ్చి వాలిపోతాయి. మూగ జీవాల ఆకలి తీరుస్తూ.. కారుణ్య పథంలో పయనిస్తున్నాడు కడప నగరానికి చెందిన బాషా. ‘మూగజీవాలు నా ఆత్మబంధువులు’ అంటున్న ఈ ‘బాద్షా’ కథేంటో చదవండి. పక్కనోడి కోసం పది రూపాయలు ఖర్చు పెట్టాలంటే పదిసార్లు ఆలోచిస్తాం....అందులో మనకేం లాభం, ఎంత లాభమని ఆలోచిస్తాం..ఎలాంటి స్వార్థం లేకుండా ఏ పని చేయని ఈ రోజుల్లో తమకేం కావాలో అడగలేని, ఆకలైతే అన్నం పెట్టమని కోరలేని మూగజీవాల కడుపు నింపడం, అందుకు వేలాది రూపాయలు ఖర్చు చేయడం నిజంగా విశేషమే. అందుకే పిచుకలు, కాకులు, చిలకలు, గోరింక లాంటి పక్షులు, ఉడతలు, పిల్లులు, కుక్కలు, కోతులు తదితర జంతువులు బాషాకి నేస్తాలయ్యాయి. ఆదివారం కాగానే తమ కడుపునింపే నేస్తం వస్తాడని అవి ఆశగా ఎదురు చూస్తాయి. ఆయన కనిపించగానే చిరకాల స్నేహితుల్లా ఆప్యాయంగా దగ్గరకొస్తాయి. అతనిచ్చే ఆహారాన్ని హక్కులా లాక్కుంటాయి. మా ఆకలి తీరుస్తున్న నేస్తమా....కలకాలం క్షేమంగా వర్దిల్లు అంటూ తృప్తిగా మెరిసే కళ్లతో మౌనంగా దీవిస్తూ వెనక్కి తిరిగి తిరిగి చూస్తూ వెళ్లిపోతాయి. మళ్లీ ఆదివారం కోసం ఎదురు చూస్తాయి. కడప కల్చరల్: కడప నగరం కో– ఆపరేటివ్ కాలనీలోగల ‘బీ–3 జిమ్’ సెంటర్ నిర్వాహకులు షేక్ బాషా మోహిద్దీన్. ఆయనకు ఫ్రెండ్స్ సర్కిల్ పెద్దదే. కానీ ఆయనకు పక్షులు, జంతువులతో కూడా మంచి సఖ్యత ఉంది. నాలుగేళ్లుగా వాటితో అనుబంధం పెంచుకుంటూ ఉన్నారు. వాటికి వారంలో ఒకరోజైనా కడుపునిండా ఆహారం పెట్టే అవకాశం లభించడం తనకు దక్కిన అరుదైన వరంలా ఆయన భావిస్తున్నారు. తనకు వచ్చే ఆదాయంలో అందరిలాగానే ఆనందంగా గడిపేవాడు. కానీ 2010లో ఓ సంఘటన ఆయన జీవితాన్ని మలుపు తిప్పింది. కడప నుంచి సిద్దవటం మీదుగా అటవీ ప్రాంతం గుండా వెళు తున్న సమయంలో రోడ్డు వారగా కోతుల గుంపులను చూశాడు. తాగి పడేసిన వాటర్ బాటిల్లో నీటి చుక్క కోసం అవి కీచులాడుతుండడం గమనించి తన వద్దగల నీటి బాటిల్‌ను సమీపంలో పడేశాడు. అవి కొట్లా డుకుంటూ నీళ్లు తాగడం గమనించాడు. తర్వాత ఆదివారం నీటి క్యాన్లతో తిరిగి ఆ ప్రాంతానికి వెళ్లి అక్కడి గుంతల్లో నీరు పోశాడు. కోతులు ఆ నీటిని తాగడం చూశాడు. ఆ తర్వాత వారం కొన్ని ప్లాస్టిక్ తొట్లు సమకూర్చుకుని దారిలో సిద్దవటం వద్దనున్న పెన్నానదిలో వాటర్ క్యాన్లలో నీరు నింపుకుని వెళ్లి కోతులకు అందజేశాడు. కోతులుండే ప్రాంతానికి వెళ్లి తొట్లు అక్కడ ఉంచి నీరు పోశాడు. వాటి తాగునీటి అవసరాన్ని గుర్తించాడు. ప్రతి ఆదివారం స్నేహితులతో కలిసి ఆటోలో వాటర్ క్యాన్లు పట్టుకెళ్లి కోతుల దాహం తీర్చడం ప్రారంభించాడు. నీరు తెస్తున్న తమ ఆటోను చూడగానే కోతుల సంతోషాన్ని గమనించిన ఆయన ఆ కార్యక్రమాన్ని అలవాటుగా మార్చుకున్నాడు. నాటి నుంచి అతని కారుణ్య దృష్టి విస్తృతి పెరిగింది. కోతికి ఆహారాన్ని అందజేస్తున్న బాషామోహిద్దీన్ ఆవులకు అరటిపండ్లను తినిపిస్తూ... నగరంలో ఆవులు సేద తీరే ప్రాంతానికి వెళ్లి వాటికి గడ్డి, అవిశాకు అందజేయడం మొదలెట్టాడు. తన ఇంటి పరిసరాల్లో తిరుగుతున్న పిల్లలు, కుక్కలకు పాలు, మాంసం అందించేవాడు. కాకులు, పిచుకలు లాంటి ఇతర పక్షులకు ఆహారం అందజేసేవాడు. కాలక్రమంలో అవన్నీ బెరుకు వదలి అతనికి సన్నిహితంగా రాసాగాయి. దీంతో బాషామోహిద్దీన్ క్రమంగా తన సేవలను విస్తరించాడు. నగర శివార్లలోని జేఎంజే కళాశాల ప్రాంతం, భాకరాపేట, సిద్దవటం, అట్లూరు, రాపూరు, రామాపురం, గువ్వలచెరువు ఘాట్ లాంటి అటవీ ప్రాంతాల్లో ప్రతి ఆదివారం కోతులకు పండ్లు, ఇతర ఆహార పదార్థాలను అందిస్తున్నాడు. ఆహారంతో వచ్చే తమ వాహనాన్ని చూడగానే ఆ మూగ ప్రాణాలు కిచకిచలాడుతూ పరుగెత్తుకుంటూ వచ్చి ఎగబడి ఇచ్చిన ఆహారాన్ని తినడం గమనించిన తనకు ఎంతో ఆనందం కలిగిందని బాషామోహిద్దీన్ పేర్కొంటున్నారు. 2011 నుంచి ప్రతి ఆదివారం జంతువులకు ఆహారం అందించడం అలవాటుగా మార్చుకున్నాడు. అప్పటి నుంచి ఆదివారాలు బంధుమిత్రులు, ఇతరుల వివాహాలు, ఇతర ఫంక్షన్లు, కనీసం కుటుంబంలో జరిగే విందు వినోదాలకు కూడా పుల్‌స్టాప్ పెట్టేశాడు. బాషా మోహిద్దీన్ తన ఆదాయంలో కుటుంబ అవసరాలకుపోగా మిగతా సొమ్మును పూర్తిగా ఇలాంటి కార్యక్రమాలకే ఖర్చు చేస్తున్నాడు. ఉదయాన్నే వెళ్లి పలు రకాల పండ్లను హోల్‌సేల్‌గా కొని బాడుగ ఆటోలో వాటిని తీసుకెళ్లి అటవీ ప్రాంతాల్లో రోడ్డు వారగా ఎదురు చూస్తూ ఉండే మూగ జీవాలకు అందజేస్తున్నాడు. సాయంగా వచ్చే స్నేహితుల బైకులపై ఆహారం మూటలు వేసుకు వెళుతూ వాటి ఆకలి తీరుస్తున్నాడు. కరోనా సమయంలో కూడా ఈ కార్యక్రమం ఆపలేదు. పాలు, చికెన్ ఉదయాన్నే అందజేయడానికి ప్రత్యేకంగా వ్యక్తులను ఏర్పాటు చేసుకున్నాడు. నిబంధనలతో పోలీసులు ఆహార వాహనాన్ని ఆపినా... విషయాన్ని తెలిపి అనుమతి పొందుతూనే ఉన్నాడు. మూగ జీవాలు.. ఆత్మీయ బంధువులు మూగజీవాలే నా ఆత్మ బంధువులు. వాటి సేవను దైవ కార్యంగా భావిస్తున్నా. అడవుల విస్తీర్ణం తగ్గడం, చెట్లు నరికివేత, వర్షాభావం తదితర కారణాలతో అడవిలోని పలు చిన్న జంతువులకు ఆహారం లభించడం లేదు. ముఖ్యంగా తాగునీటికి కూడా చాలా ఇబ్బందులు పడుతున్నాయి. అందుకే నా శక్తి మేరకు ఆదివారం వీటిని అందిస్తున్నా. కరోనా కారణంగా పలుచోట్ల హోటళ్లు, ఆహారం విక్రయించే దుకాణాలు తెరవకపోవడంతో పిల్లులు, కుక్కలు, కాకులు లాంటి పక్షులకు ఆహారం లభించడం లేదు. ఇలాంటి వాటిని బతికించుకుంటేనే ప్రకృతి సమతుల్యంగా ఉంటుంది. అందుకే తన స్వంత పనులైనా మానుకుంటాగానీ, ఆదివారాలు మాత్రం ఎలాంటి స్థితిలోనూ మూగ జీవాలకు ఆహారం అందించడానికే కేటాయిస్తా. బంధుమిత్రులు, కుటుంబ సభ్యుల మద్దతు కూడా లభిస్తోంది గనుకనే నిరంతరాయంగా సేవలు అందించగలుగుతున్నా. – బాషా మొహిద్దీన్, మూగజీవాల ప్రేమికుడు చదవండి: కొద్ది గంటల్లో పెళ్లి.. అంతలోనే ఊహించని ట్విస్ట్ 'లగ్గసరి'.. కన్యాశుల్కం ఇవ్వాల్సిందే మరి -
తాత.. నాన్న.. ఓ తణుకు అమ్మాయి
తణుకు అర్బన్: మూగ జీవాలపై ఆ బాలికకు విపరీతమైన ప్రేమ.. వాటికి ఎక్కడ ఏ కష్టం వచ్చిందని తెలిసినా వెంటనే అక్కడ వాలిపోతుంది. అక్కున చేర్చుకుని వాటిని ఆరోప్రాణంగా కాపాడుతుంది. ఆమే తణుకుకు చెందిన జనత హాస్పటల్ దంత వైద్యుడు డాక్టర్ దాట్ల సుందరరామరాజు, శ్రీలక్ష్మి దంపతుల కుమార్తె పావని వర్మ. ఈ వారసత్వం ఆమెకు తాతయ్య డాక్టర్ దాట్ల సత్యనారాయణరాజు(జనతా రాజు), నాన్న సుందరరామరాజుల నుంచి వచ్చిందని చెప్పవచ్చు. తణుకు లయన్స్‌క్లబ్ ప్రాంతంలోని నివాసం వద్ద అవుట్ హౌస్‌లో తాత, నాన్న, పావని ఎప్పటి నుంచో వివిధ రకాల కోళ్లు, బాతులు, కవుజు పిట్టలు, కుందేళ్లను సంరక్షిస్తున్నారు. పావని మరో అడుగు ముందుకేసి జంతు సంరక్షణ చేస్తూ యానిమల్ రెస్క్యూ టీంని సృష్టించేందుకు ప్రయతిస్తోంది. అకారణంగా ఏ జంతువును ఇబ్బంది పెట్టినా వారిపై సంబంధిత అ«ధికారులకు ఫిర్యాదుతో పాటు సదరు జంతువును రక్షించేందుకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి స్ఫూర్తిగా వాలంటీర్లను నియమించేందుకు సమాయత్తమవుతోంది. ఇందుకు ఆమె సోషల్ మీడియాను వేదికగా చేసుకుంది. మూగజీవాల సంరక్షణకు ఇప్పటికే తణుకు ఎమ్మెల్యే కారుమూరి వెంకట నాగేశ్వరరావును స్థలం ఇప్పించాల్సిందిగా కోరిగా ఆయన సానుకూలంగా స్పందించినట్లు పావని చెప్పింది. తనకు మూగజీవాలంటే ఇష్టమని, అయితే చదువు పరంగా తాను ఐఏఎస్ కావాలన్నదే లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపింది. ప్రస్తుతం వీరి వద్ద చైనా కోళ్లు, పోలీస్ క్యాప్ కోళ్లు, కజానా బాతులు, గిరిరాజు కోళ్లు ఉన్నాయి. వీటి సంరక్షణకు సీసీ కెమెరాలతో పాటు సెయింట్ బెర్నాడ్ జాతికి చెందిన సింహాల్లాంటి మూడు శునకాలు కూడా గస్తీ నిర్వహించడం విశేషం. జంతువులంటే పిచ్చిప్రేమ కుక్కలు, గోవులతో పాటు ఇతర జంతువులంటే మా అమ్మాయికి ఎంతో ఇష్టం. వాటిని బాధించకూడదని తాపత్రయపడుతుంది. ఐదేళ్లుగా మా ఇంటి ఆవరణలో నాన్న సహకారంతో వివిధ రకాల కోళ్లు, బాతులు, కుందేళ్లు, కౌజు పిట్టలను సంరక్షిస్తున్నాను. వాటిని చూసిన మా అమ్మాయి చలించిపోయి యానిమల్స్ రెస్క్యూ టీంను ఏర్పాటుకు నాంది పలికింది. – డాక్టర్ దాట్ల సుందరరామరాజు, జనతా హాస్పటల్ వైద్యుడు -
జనారణ్యంలో కారుణ్యమూర్తి
ఆమె జైనమతాన్ని అవలంబించలేదు. జైనం ఏం చెప్పిందో విననూ లేదు. అయినా... జైన బోధనల్లోని అహింసను నమ్మింది. జీవకారుణ్యతనే జీవితంగా మలుచుకుంది. సాటి జీవికి హాని కలిగించని సమాజాన్ని కోరుకుంది. మూగజీవికి బతుకునిచ్చే సమాజస్థాపన కోసం శ్రమిస్తోంది. నోరు లేని జీవులకు అమ్మయింది. వాటి గొంతుక తానే అయింది. మనుషులకు ఉన్నట్లే జంతువులకు కూడా హక్కులుంటాయి. ఆ హక్కుల పరిరక్షణ జరగాలి. ప్రకృతి మనిషికి ఇచ్చినట్లే జంతువులకు కూడా జీవించే హక్కునిచ్చింది. మనుషులతో పని లేకుండా వాటి జీవిక ఏదో అవి జీవించేస్తుంటాయి. అయితే ఆ మూగజీవాల హక్కులకు తరచూ భంగం జరుగుతూ ఉంటుంది. తమ హక్కులను కాపాడుకోవడంలో ఏ మాత్రం రాజీ పడని మనిషి... జంతువుల హక్కును కాలరాయడానికి మాత్రం అత్యుత్సాహం చూపిస్తుంటాడు. జంతువులు తమకు హక్కులున్నాయని నోరు తెరిచి చెప్పలేవు. ఆ నోరు లేని మూగ జీవాలు... తమకు చేతనైన సైగలు, సంకేతాలతో తెలియచేసినా సరే... నోరున్న మనుషులు వాటి మనసును గ్రహించలేరు. గ్రహించలేరు... అనడానికంటే గ్రహించాలనుకోరు అనడమే కరెక్ట్. మనిషి తన సౌకర్యాల కోసం జంతువుల జీవించే హక్కును కాలరాయడం మీద కొరడా ఝళిపించి, వాటి హక్కులను పరిరక్షించడానికి పూనుకున్నారు డాక్టర్ షిరానీ పెరైరా. వెయ్యి ప్రాణుల తల్లి చెన్నై, రెడ్ హిల్స్‌లోని షిరాని ఇంటికి వెళ్తే... ముప్పైకి పైగా పెట్ డాగ్స్ ఆమె చుట్టూ తిరుగుతుంటాయి. అవన్నీ ఎవరో కొంతకాలం పెంచుకుని ఆ తర్వాత రోడ్డు మీద వదిలేసినవే. ఆమె సంరక్షణలో అలాంటి కుక్కలు, పిల్లులు, ఆవులు, ఎడ్లు, గుర్రాలు, కోతులు, పక్షులతోపాటు అనేక రకాల జంతువులు, స్తబ్దుగా పడుకుని ఉండే ఎలుకలు... మొత్తం వెయ్యికి పైగా ఉన్నాయి. ‘‘నాకు పిల్లలు లేరు. అలాగని నన్ను తల్లి కాదంటే ఒప్పుకోను. వెయ్యికి పైగా అందమైన ప్రాణులకు తల్లిని. రోజూ సాయంత్రం హోమ్‌కి వెళ్లి పలకరిస్తాను. చేత్తో తాకినప్పుడు అవి ఉత్సాహంగా ఉరకలు వేస్తాయి. తల్లికి అంతకంటే గొప్ప సంతోషం ఏముంటుంది?’’ అంటారు షిరాని. ప్రయోగాల కోసం పుట్టలేదు అక్వాటిక్ బయాలజీలో పీహెచ్డీ చేసిన 55 ఏళ్ల షిరానీ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ (ఐసిఎఆర్) లో సైంటిస్టుగా 20 ఏళ్ల పాటు ఉద్యోగం చేశారు. ఆ తర్వాత రిటైర్మెంట్ తీసుకుని పూర్తి సమయాన్ని యానిమల్ వెల్ఫేర్ కోసం కేటాయించారు. గాయపడిన జంతువులకు ఆశ్రయం ఇవ్వడంతో సరిపెట్టుకోవడం లేదామె. జంతువుల హక్కుల కోసం పోరాడుతున్నారు. జంతువులు పుట్టేది లాబొరేటరీల్లో ప్రయోగాల కోసం కాదు, అందమైన జీవితాన్ని ఆస్వాదిస్తూ జీవించడానికేనంటారామె. ‘‘జంతుప్రేమికుల ఇంట్లో పుట్టడం నా అదృష్టం. పదిహేడు పిల్లుల మధ్య పెరిగాను. మా అన్నయ్య... బయట ఎక్కడైనా గాయపడిన పిల్లి కనిపిస్తే చాలు, ఇంటికి తీసుకువచ్చేవాడు. నేను దాని బాగోగులు చూసేదాన్ని. ఒక కప్పు కింద నివసిస్తున్న ప్రాణులన్నీ కలిస్తేనే కుటుంబం. తమ కోసం తాము మాట్లాడలేని నా స్నేహితుల కోసం నేను మాట్లాడుతున్నాను. యానిమల్ టెస్టింగ్‌ని పూర్తిగా నిర్మూలించాలి, అన్ని రంగాల్లోనూ టెస్టింగ్‌కు ప్రత్యామ్నాయమార్గాలను పెంపొందించుకోవాలి’’ అన్నారు షిరాని. సౌందర్యం చాటు అనైతికం డాక్టర్ షిరానీ పెరైరా సైంటిస్టు, యానిమల్ యాక్టివిస్టు మాత్రమే కాదు, సిపిసిఎస్ఈఏ (కమిటీ ఫర్ ద పర్పస్ ఆఫ్ కంట్రోల్ అండ్ సూపర్విజన్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ ఆన్ యానిమల్స్) మెంబరు కూడా. సిపిసిఎస్ఈఏ భారత ప్రభుత్వం ఆధీనంలో పనిచేస్తున్న చట్టబద్ధమైన సంస్థ. పరిశోధనల కోసం జంతువుల మీద విచక్షణ రహితంగా మందులను ప్రయోగించడానికి వ్యతిరేకంగా పోరాడుతుందీ కమిటీ. ఆమె 2007లో చేపట్టిన ఉద్యమ ఫలితంగా డిసెక్షన్ కోసం జంతువులను ఉపయోగించడాన్ని ప్రభుత్వం 2012లో నిషేధించింది. ఆ తర్వాత రెండేళ్లకు భారత ప్రభుత్వం జంతువుల మీద కాస్మటిక్స్ ప్రయోగాన్ని కూడా నిషేధించింది. ‘మనుషులు... తాము అందంగా కనిపించడానికి మేకప్ చేసుకుంటారు. అందుకోసం వివిధ రకాల సౌందర్య సాధనాలను వాడతారు. రకరకాల రసాయనాల సమ్మేళనమైన సౌందర్యసాధనాలు మనిషి చర్మం మీద ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తాయో అనే కోణంలో పరిశోధనలు జరుగుతాయి. ఆ పరిశోధనలకు బలయ్యేది కూడా జంతువులే. కాస్మటిక్ ప్రోడక్ట్ మార్కెట్లోకి రావడానికి ముందు ఆ ప్రోడక్ట్‌ను అనేక దశల్లో జంతువుల మీద ఉపయోగిస్తారు. మనం చర్మం పాడవకుండా ఉండడానికి మూగ జీవాల చర్మం మీద ప్రయోగాలు చేయడం అనైతికమని గళాన్ని వినిపించారు డాక్టర్ షిరానీ పెరైరా. ఔషథాల తయారీ పరిశ్రమలు, వ్యవసాయ ఎరువులు– పురుగుమందుల తయారీ కంపెనీలు కూడా లాబొరేటరీల్లో జంతువుల ప్రాణాలను ఫణంగా పెట్టి పరిశోధనలు చేస్తుంటాయి. ఆఖరుకి నొప్పిని తగ్గించే చిన్న మాత్ర కూడా ముందు జంతువుల మీదనే దాడి చేసి తీరుతుంది. మూగరోదన లాబొరేటరీల్లో మూగజీవుల మీద ప్రయోగాలు నిర్వహించిన తర్వాత అవి తిరిగి ఆరోగ్యవంతం కావడానికి తీసుకోవాల్సిన చర్యల మీద చాలా పరిశ్రమలు చిత్తశుద్ధితో వ్యవహరించడం లేదంటారు షిరాని. ‘‘ప్రయోగానికి ముందు మత్తు ఇస్తారు. ప్రయోగం తర్వాత వాటిని అలాగే వదిలేస్తుంటారు. మత్తు వదిలే కొద్దీ ఆ ప్రాణులకు నొప్పి తెలుస్తుంటుంది. రకరకాల మందుల ప్రభావం వల్ల అవి హృదయవిదారకంగా మూలుగుతుంటాయి. మూగప్రాణుల రోదన మనసుని పిండేస్తుంది’’ అని ఆవేదన చెందారామె. కుక్కల వంటి ఒక మోస్తరు పెద్ద ప్రాణుల మీద అనేక దఫాలుగా ప్రయోగాలు చేస్తారు. కాలేయం, ఊపిరితిత్తులతోపాటు ఇతర దేహభాగాలు నిర్వీర్యమై పోయి చివరికి అవి జీవచ్ఛవాలుగా మారుతుంటాయి. ఒంటికి ఎండ తగిలినా భరించలేనంతగా బలహీనపడిపోతాయి. మనదేశంలో సరాసరిన ఏడాదికి ఐదు నుంచి ఏడు వేల శునకాలు ప్రయోగాల బారిన పడి అనారోగ్యం పాలై, ప్రాణాలు కోల్పోతున్నాయన్నారామె. అమెరికా, యూరప్ దేశాల్లో నిబంధనలు కఠినంగా ఉండడంతో అనేక బహుళ జాతి కంపెనీలు యానిమల్ టెస్టింగ్‌కి మనదేశాన్ని వాడుకుంటున్నాయి. యానిమల్ టెస్టింగ్‌లో ప్రధానంగా ‘రిఫైన్మెంట్, రిడక్షన్, రీప్లేస్మెంట్’ అనే మూడు ఆర్‌లకే పరిమితమవుతుంటారు. యానిమల్ టెస్టింగ్‌లో అతిముఖ్యమైనది రీ హాబిలిటేషన్ను మర్చిపోతున్నారని చెప్పారామె. అందుకే అలాంటి ప్రాణులను కాపాడే బాధ్యత చేపట్టినట్లు కూడా చెప్పారు డాక్టర్ షిరాని. మహావీర్ అవార్డు అందుకుంటున్న డాక్టర్ షిరాని అహింసకు అవార్డు డాక్టర్ షిరాని గత ఏడాది భగవాన్ మహావీర్ ఫౌండేషన్ నుంచి ‘మహావీర్ అవార్డు’ అందుకున్నారు. ఇది అహింసాయుతమైన సమాజ స్థాపన, శాకాహార సాధన కోసం కృషి చేసేవారికి ఇచ్చే పురస్కారం. పాతికేళ్లకు పైగా చేసిన నిస్వార్థ సేవకు ఆమె అందుకున్న గౌరవం ఇది. డెబ్బయ్ ఏళ్లకు పైగా వాడుకలో ఉన్న విద్యుదాఘాతంలో అత్యంత కిరాతకంగా జంతువులను సంహరించే పద్ధతికి అడ్డుకట్ట వేశారామె. ప్రయోగశాలల్లో పరిశోధనలకు మూగజీవాలకు బదులుగా ప్రత్యామ్నాయ విధానాన్ని ప్రవేశ పెట్టారు. గుర్రాలు, శునకాల వంటి జంతువుల మీద ప్రయోగాలు నిర్వహించేటప్పుడు పాటించాల్సిన నియమావళిని ప్రతిపాదించారామె. ఆమె సూచించిన నియమావళి ఆధారంగా ప్రభుత్వం జాతీయస్థాయిలో గైడ్‌లైన్స్ రూపొందించింది. జంతువుల పరిరక్షణ కోసం ఇలాంటి నిబంధనల రూపకల్పన చేసిన తొలిదేశం మనదే. జంతువుల అక్రమ రవాణా మీద సహేతుకమైన వివరాలతో ఆధారాలతో అంతర్జాతీయ వేదికల మీద ప్రసంగించారు. సర్కస్ కంపెనీల్లో ప్రాణాంతకమైన విన్యాసాలకు బలవుతున్న దాదాపు తొంభై జంతువులను రక్షించారు షిరాని. తమిళనాడులోని సఖి మండల్ సహోద్యోగ్ సంస్థ 2016లో మహిళా దినోత్సవం నాడు అత్యంత శక్తివంతమైన, స్ఫూర్తిదాయకమైన మహిళలను సత్కరించింది. ఆ సందర్భంగా గవర్నర్ రోశయ్య చేతుల మీదుగా ‘వాయిస్ ఫర్ ద వాయిస్‌లెస్ అవార్డు’ అందుకున్నారు షిరాని. నిశ్శబ్దమైన శబ్దం తమ మీద జరుగుతున్న అకృత్యాల మీద తిరగబడాలని మనుషులకే కాదు మూగ ప్రాణులకు కూడా ఉంటుంది, అయితే తమ ఆక్రోశాన్ని గళమెత్తి చెప్పలేవు. అందుకే ‘సౌండ్ ఆఫ్ సైలెన్స్’ ప్రచారాన్ని చేపట్టారు షిరాని. ఆమె చేపట్టిన నిశ్శబ్ద విప్లవం మూగ ప్రాణుల సంరక్షణ కోసం ప్రభుత్వం చట్టాలు చేసేటంతటి పెద్ద శబ్దాన్నే చేసింది. లక్ష సంతకాలు సేకరించి ఆరోగ్య పరిశోధన మంత్రిత్వ శాఖ, ఇండియన్ మెడికల్ రీసెర్చ్ కౌన్సిల్, డ్రగ్ కంట్రోలర్ జనరల్‌కు ప్రతిపాదన అందచేశారు షిరాని. మూగప్రాణులకు జన్మతః సంక్రమించిన జీవించే హక్కును కాలరాసే హక్కు ఎవరికీ లేదని నినదించారామె. మాంసం కోసం గేదెలు, ఆవులు, పిల్లులను వధించే దురాచారాన్ని కూడా అడ్డుకున్నారు. ఒంట్లో శక్తి ఉన్నంత కాలం రేస్ కోర్సులో పరుగెత్తి పరుగెత్తి... తమ మీద పందెం కాసిన పందెం రాయుళ్లను గెలిపించడానికే అంకితమైన గుర్రాల బాధలు వేరుగా ఉంటాయి. శక్తి ఉడిగిన తరవాత వాటికి ఆహారం పెట్టడమూ వృథానే అన్నట్లు వ్యవహరిస్తారు వాటి నిర్వహకులు. ఒకవేళ గాయపడినట్లయితే ఆ గుర్రాలను ఎంత త్వరగా వదిలించుకుంటే ఆ మేరకు ఖర్చు తగ్గుతుందని కూడా భావిస్తారు. అలాంటి గుర్రాలు కూడా షిరాని ఆశ్రయంలో సేదదీరుతున్నాయిప్పుడు. మూగజీవి గాయపడి నిస్సహాయ స్థితిలో ఉన్నట్లు సమాచారం అందుకున్న వెంటనే షెల్టర్ హోమ్ అంబులెన్స్ వచ్చి ఆ ప్రాణిని హోమ్‌కు చేరుస్తుంది. రిటైర్మెంట్ హోమ్ జంతువుల సంరక్షణ కోసం నడుపుతున్న హోమ్‌ని షెల్టర్ హోమ్ అంటే ఒప్పుకోరు డాక్టర్ షిరాని. ‘ఈ ప్రాణులు పని చేయగలిగినంత కాలం పని చేసి, విశ్రాంత జీవనాన్ని ఈ హోమ్‌లో గడుపుతున్నా’యన్నారు. పని చేయలేని గుర్రాలను పోలీసులు తుపాకీతో కాల్చి చంపేసేవాళ్లు. 2009 వరకు ఇదే కొనసాగింది. ఇప్పుడు రిటైర్ అయిన గుర్రాలు షిరాని రిటైర్మెంట్ హోమ్‌లో అంత్యకాలాన్ని ప్రశాంతంగా గడపగలుగుతున్నాయి. చెన్నై నగరంలో 1932 నుంచి 1995 వరకు ఏటా ఇరవై వేల శునకాలను బేసిన్ బ్రిడ్జి లేథాల్ చాంబర్లో కరెంట్ షాక్‌తో అత్యంత కిరాతకంగా చంపేసేవాళ్లు. మూగజీవాలకు ప్రేమను పంచుతూ, శ్రద్ధగా చూసుకోవాల్సిన సమయంలో వాటి ప్రాణాలు తీయడం ఏమిటని ప్రశ్నించారు షిరాని. ఆమె పోరాట ఫలితంగా ఎలక్ట్రిక్ షాక్‌తో ప్రాణాలు తీయడం వంటి మొరటు పద్ధతులను 1995లో నిషేధించింది ప్రభుత్వం. ఇది ఆమె తొలి విజయం, పాతికేళ్లకు పైగా కొనసాగుతున్న తన సర్వీస్‌లో ఇప్పటి వరకు లక్షల ప్రాణాలను కాపాడారు షిరాని. మాజీ కేంద్రమంత్రి మనేకా గాంధీ 1994లో పీపుల్ ఫర్ యానిమల్ సంస్థను స్థాపించారు. చెన్నై విభాగాన్ని నడిపించే బాధ్యతను షిరాని చేపట్టారు. ఆ వివరాలను చెబుతూ ‘‘పీపుల్ ఫర్ యానిమల్ స్థాపనతో నా ఆలోచనలకు ఒక రూపం వచ్చినట్లయింది. మనేకా గాంధీ ప్రోత్సాహం, ఆర్థిక సహకారం అందించడం వల్లనే ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఇన్నేళ్లపాటు కొనసాగించగలిగాను’’ అన్నారు డాక్టర్ షిరాని పెరైరా.– వాకా మంజులారెడ్డి -
భైరవ కుటీరం
కుక్కలు కనిపించగానే చాలా మంది భయపడతారు. కొందరు కసురుకుంటారు. వీలుంటే ఓ రాయి విసురుతారు. కానీ ఈ కుటుంబం ఇందుకు భిన్నం. 53 శునకాలను తమతోపాటు ఇంట్లో ఉంచుకుంటున్నారు. వాటికి ప్రేమాభిమానం పంచుతున్నారు. ఇతరులకు ఇబ్బంది కలగకూడదని ఊరికి చివర నివాసమేర్పరుచుకున్నారు. వాటి సేవలోనే రోజంతా గడుపుతున్నారు. ఆ ఇంటికి వెళ్తే భౌ భౌ అంటూ అరుపులు వినిపిస్తాయి. ఇదేంటి ..చాలా ఇళ్లలో పెంపుడు కుక్క అరుస్తుంది కదా అనుకుంటున్నారా..ఒకటైతే ఓకే..ఏకంగా 53శునకాలు.. ఆశ్చర్యంగా ఉంది కదూ..ఔను నిజమే..ఇన్ని భైరవులున్న ఆ ఇల్లు చిన్నదే..కానీ ఆ ఇంటి యజమాని మనసు మాత్రం చాలా పెద్దది. ఓ చిన్న గదిలో కుటుంబ సభ్యులుంటూ మిగిలిన చోటంతా కుక్కలకే ఇచ్చేశారు. రోజూ వాటిని ప్రేమతో సాకుతున్నారు. ఒక కుక్కను పెంచడమే కష్టమనుకునే రోజుల్లో తనసంపాదనంతా వాటికే వెచ్చిస్తున్నారు. అవి కూడా తమ కుటుంబ సభ్యులే అనిచిరునవ్వుతో సమాధానమిస్తారీ మధ్యతరగతి ప్రకృతి వైద్యుడు..ఆయన వాటినిభైరవులుగా సంబోధిస్తారు. ఆయన నిస్వార్ధ సేవ గురించి తెలుసుకుందామా.. చిత్తూరు, నాగలాపురం: అది నాగలాపురం మండలం.. రాజులకండ్రిగ గ్రామానికి దూరంగా కొండలు..పచ్చని పొలాల మధ్య ఓ ఇల్లు.. జన సంచారం పెద్దగా కనిపించదు. ఆ ఇంట్లోకి తొంగి చూస్తే ఓ ముగ్గురు వ్యక్తులు శునకాలకు సేవ చేస్తూ కనిపిస్తారు. వారే ఏసుపాదం బాబు, ఆయన భార్య రిబ్కా, కుమార్తె ప్రియ. వీరు ముగ్గురూ జీవకారుణ్యమున్నవారే. ఆయనేమీ పెద్ద స్థోమతుపరుడు కాదు. ఇల్లుకూడా సొంతం కాదు. ఆయన సోదరిచ్చినదే. ఆత్మాభిమానం మెండు. చిన్న పాటి సేవలకే ఎంతో ప్రచారం కోరుకునే రోజుల్లో ఆయన ఏనాడూ తన సేవల గురించి ఎవరికీ చెప్పరు. ఎవరి సాయమూ తీసుకోరు కూడా. తన చిరు సంపాదనతో కుటుంబాన్ని ..భైరవులను పోషిస్తున్నారు. ఇక్కడున్న భైరవుల్లో అధిక భాగం ఎవరో గాలికొదిలేసినవే. వాటిని కన్నబిడ్డల్లా కాపాడుతున్నారు. స్వార్థ చింతన లేని ప్రేమను పంచుతున్నారు. జీవకారుణ్యం పదానికి నిలువెత్తు నిదర్శనం ఈ కుటుంబమే. రోజంతా వీటి సేవే.. రోజూ ఈ 53 శునకాలకు స్నానపానాదులు చేయించడం, ఆహారాన్ని అందించడంలో భార్య, కుమార్తె పాలుపంచుకుంటున్నారు. వారి దినచర్య పూర్తిగా వీటితో గడిచిపోతోంది. ఏరోజూ వీటిని విడిచి ఉండలేదు..ఉండలేం కూడా అంటుంది ఆయన కుమార్తె ప్రియ. కేవలం వాటికి భోజనం పెట్టడమే కాదు అంటు వ్యాధులు రాకుండా ముందస్తు వ్యాక్సిన్లు వేయిస్తున్నారు. ఇటీవలే ఒక శునకానికి చెవి వ్యాధి సోకితే చెన్నై తీసుకెళ్లి నయం చేయించారు. ఈ ఒక్క ఉదాహరణ చాలు వారు ఎలా వాటిని సాకుతున్నారో తెలుసుకోడానికి. మూలికా వైద్యనిపుణలు.. ఏసుపాదం బాబుకు మూలికా వైద్యంపై మంచి పట్టు ఉంది. ఈ వైద్యాన్ని కూడా ఆయన వాణిజ్య దృక్పథం లేకుండానే అందిస్తున్నారు. జీవనశైలి మార్చుకోవడం ద్వారానే రోగాలను నయం చేసుకోవచ్చునని చెబుతారీయన. తనదగ్గర కొచ్చే రోగులకు ఈ మార్గం ద్వారానే స్వçస్థత చేకూర్చుతున్నారు. రెండు కిడ్నీలకు తీవ్రమైన ఇన్ఫెక్షన్ సోకిన ఓ అసిస్టెంట్ ప్రొఫెసరు ఇప్పుడు మామూలు మనిషయ్యారు. పూర్తిగా రోగం నయమైంది. ఫెయిత్ పవర్ పేరున పెయిన్ రిలీవర్ ఎక్స్టర్నల్ తైలం, గర్భధారణలో స్పెర్మ్ కౌంటింగ్ పెరగడానికైన వాల్యూం పౌడర్, చర్మవ్యాధులు నివారించ గలిగే (38 మూలికలతో తయారు చేసిన) పౌడర్, కరివేపాకు, నువ్వులు, సాంబార్, పప్పుల పొడులను తయారు చేస్తున్నారు. ఈ ఉత్పత్తులను తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ ఖాదీ భాండార్‌లో విక్రయిస్తారు. రోజు ఎనిమిదివందల రూపాయల వరకు శునకాల పోషణకు వెచ్చించడం వారి ఉదారత్వానికి నిదర్శనం. చెన్నై టు రాజుల కండ్రిగ ఇంతకీ ఏసుపాదం బాబుకు ఈ జంతుప్రేమ ఎలా వచ్చిందో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం.. మేం చాలా క్రితం చెన్నైనగరంలో ఉండేవాళ్లం. మొదట్లో ఒకటే భైరవుడు (శునకం) ఉండేవాడు. అది పిల్లలను పెట్టడంతో సంఖ్య నాలుగైంది. వాటి శబ్దాలకు చాలామంది అటుగా వచ్చేవారు కాదు. దీంతో ఇంటి యజమాని ఒప్పుకోలేదు. ఇల్లు ఖాళీ చేయాల్సిందేనన్నారు. ఏం చేస్తాం..ప్రేమాభిమానంతో పెంచుకున్న భైరవులను విడిచిపెట్టడానికి మనసు అంగీకరించలేదు. దీంతో ఉద్యోగం మానుకున్నాను. వాటిని తీసుకుని ఊతుకోట తాలూకా బాలిరెడ్డి కండ్రిగకు మకాం మార్చాను. రాన్రానూ భైరవుల సంఖ్య పెరిగింది. అక్కడ ఉండడం కూడా ఇబ్బంది అయ్యింది. ఏదో ఒకటో చేయాలి. మనుషుల మధ్య ఉండాలంటే ఇవి దగ్గర ఉండకూడదు. కానీ మనసొప్పుకోలేదు. అందుకే మనుషులకు దూరంగా వచ్చేయాలనుకున్నాను. నాగలాపురం మండలం రాజులకండ్రిగకు కొంచెం దూరంలో భైరవులకు సౌకర్యార్థంగా ఉండేలా చిన్న ఇల్లు కట్టుకున్నాం. ఇరుకుగానే ఉంది. కానీ ఇల్లు చిన్నదని పిల్లలను వదిలేయలేం కదా..అందుకే కష్టమో నష్టమో వాటితో కలిసే ఈ ఇంటిలో జీవిస్తున్నామని ఏసుపాదంబాబు వివరించారు. ఇప్పుడు వారిల్లే భైరవాశ్రమంగా మారిపోయింది. వైద్యులు చేతులెత్తేసిన వారికి వైద్యం మొండిరోగాలని చేతులెత్తేసిన పరిస్థితుల్లోనూ ఏసుపాదం స్పందించి వైద్యం చేస్తున్నారు. ఆయుర్వేద, సిద్ధ్ద విధానాల్లో ప్రకృతి చికిత్స మార్గాలతో నయం చేస్తున్నారని ఇక్కడికొచ్చే రోగులు చెబుతున్నారు. ఇప్పుడున్న జీవన విధానాలే సర్వరోగాలకు కారణమని..వాటిలో మార్పు తెచ్చుకోవాల్సిన అవసరముందని సూచిస్తారీయన. పెద్ద పెద్ద రోగాలకూ ఇందులోనే మందు ఉందంటారు. . క్యాన్సర్ రోగులనూ ఆరోగ్యవంతులుగా మార్చవచ్చంటారీయన.∙తాత, ముత్తాతల నుంచి వంశపారపర్యంగా వస్తున్న మూలికా వైద్యాన్ని ఉచితంగా అందించడం విధిగా పెట్టుకున్నారు. ఈ వైద్యుని ఇంట్లో అన్నీ మట్టి పాత్రలనే వాడటం విశేషం. అల్యూమినియం పాత్రలు, కుక్కర్లు, నాన్‌స్టిక్ తవ్వాల వాడకం శ్రేయస్కరం కాదంటారు. ధ్యానం, యోగా చేస్తూ అందరితో చేయిస్తుంటారు. క్రమశిక్షణకు మారుపేరు.. భైరవాశ్రమంలో శునకాలు పూర్తిగా శాఖాహారులు. వీటికి ఆ రకమైన తర్ఫీదునిచ్చారు. ఇక్కడ వీధి కుక్కలే కాదు వివిధ జాతులకు చెందినవి కూడా ఉన్నాయి. ప్రకృతిసిద్ధంగా లభించే గడ్డి రకాలు, గడ్డిపూలు, ఆకుకూరలు, దుంపలు, క్యారెట్టు, బీటు, నూల్‌కోల్, చౌచౌ, ఉల్లిగడ్డలు, టమాట, అటుకులు, బొరుగులు, బిస్కట్లను ఆహారంగా తీసుకుంటూ ఈ శునకాలన్నీ ఆరోగ్యకరంగా ఉన్నాయి. అంతేకాదు క్రమ శిక్షణను పాటిస్తాయి. ఆహారం తీసుకున్న సమయంలో పోట్లాడుకోవు. తన వంతు వచ్చే వరకు ఎదురుచూస్తాయి. -
బాతుల్ని కాపాడబోయి, ఇద్దర్ని చంపేసింది!
కెనడాకి చెందిన ఒక 25 ఏళ్ల అమ్మాయి రహదారిపై ఉన్న బాతులను కాపాడే ప్రయత్నంలో భారీ యాక్సిడెంట్ కి కారణమైంది. ఆ ప్రమాదంలో ఇద్దరు చనిపోయారు. దీంతో ఇప్పుడు కెనడా కోర్టులు ఆమెని దోషిగా ఖరారు చేశాయి. ఆమెకు 14 ఏళ్లు జైలు శిక్ష పడే అవకాశాలున్నాయి. ఎమ్మా జోర్నోబాజ్ అనే యువతి హైవేలో బాతు పిల్లలు పోవడం చూసి తన వాహనాన్ని ఆపింది. వాటి తల్లి కనిపించకపోవడంతో వాటిని జాగ్రత్తగా దాటించేందుకు ఆమె ప్రయత్నించింది. కానీ దీని వల్ల ఆంద్రే రాయ్ అనే 50 ఏళ్ల వాహనదారుడు ఆగకూడని చోట ఆగిన ఆ కారును ఢీకొన్నాడు. ఆయన, ఆయన కూతురు జెస్సీ (16) చనిపోయారు. ఈ సంఘటన 2010 లో జరిగింది. కోర్టు తన తీర్పులో హైవే లో జంతువులను కాపాడే ప్రయత్నం చేయకూడదని, అవి అడ్డం వస్తే పట్టించుకోవద్దని, ఏది ఏమైనా వాహనాన్ని ఆపవద్దని సూచించింది. తమ తీర్పుతో ఇలాంటి జంతు ప్రేమికులు మనుషుల ప్రాణాల విలువను గుర్తించాలని పేర్కొనడం కొసమెరుపు. అయితే ఎమ్మాకు మద్దతుగా జంతు ప్రేమికులు ఉద్యమాలు చేయాలని, ఆమె కోసం పిటిషన్లు ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ఇంటర్నెట్ లో ఆమెకు మద్దతుగా చాలా మంది గళం విప్పుతున్నారు.