సాక్షి కడప : హలో! నన్ను ఉత్తరం అని పిలుస్తారండి ! ప్రస్తుత ఆధునిక కాలంతో పోటీ పడలేక చాలా రోజుల క్రితమే సెలవు తీసుకున్నా. ఇప్పుడు మీ ముందుకు వచ్చింది కేవలం నా వల్ల ఒకప్పుడు కలిగిన ప్రయోజనాలను వివరిదద్దామనే వచ్చా. ఉత్తరం... ఒక మధురమైన అనుభూతి....గుండె గదిలో నిక్షిఫ్తమైన జ్ఞాపకాల తడి.....ఉత్తరాలు మన ఆత్మీయుల యోగ క్షేమాలకు ఆనవాళ్లు.....ప్రేయసి, ప్రియులకు మధురానుభూతాలు....భావుకుల గుండెల్లో విరబూసిన పారిజాతాలు.....స్వాప్నికుల మనసులను రాగరంజితం చేసే ఊహా చిత్రాలు....సరిహద్దుల్లో...మంచుకురిసే రాత్రుల్లో పహారా కాస్తూ శత్రువుల గుండెలకు తుపాకీ ఎక్కుపెట్టిన సైనికుడు తన భార్యకు చేసుకునే హృదయ నివేదన....ఉత్తరం కోసం ఎన్నెన్ని ఎదురుచూపులో...ఎన్నెన్ని పడిగాపులో...ఇలా మానవ బంధాలకు నిలయంగా వెలుగొందిన ఉత్తరాలు నేడు కనుమరుగయ్యాయి.
సెల్‌ఫోన్లు, ఎస్‌ఎంఎస్‌లు, వాట్సాప్‌లు, ఈ–మెయిల్ లాంటి ఆధునికి సమాచార వ్యవస్థలు రాడవంతో ఉత్తరం అస్థిత్వాన్ని కోల్పొయింది. రంగురంగుల లేఖతో సీతాకోక చిలుకలా గుంపు వాలినట్లు కనిపించే ఇంట్లోని చిలకొయ్య (హ్యాంగర్) ఉత్తరాలు లేక కనుమరుగైంది. ఉత్తరం కోసం పరితపించిన హృదయాన్ని అక్షరాలు మురిసిపోయేలా, అమృతం కురిసిన రాత్రిలో బాలగంగాధర్ తిలక్ వర్ణించిన తీరు అద్బుతం. ఉత్తరాల్లో ఆ మధురానుభూతులు, తీపి జ్ఞాపకాలు నేడు కనుమరుగయ్యాయి. స్మార్ట్ ఫోన్లు, సోషల్ మీడియా రూపంలో ఆత్మీయ స్పర్శ కోల్పొయింది. ఎవరెక్కడుంటారో తెలియదు.
వారపత్రికలు, మాసపత్రికల ద్వారా పరిచయం అయ్యేవారు. ఆ తర్వాత కలం స్నేహంపై ఆసక్తి ఉన్న వారి చిరునామాలను పత్రికల్లో ప్రచురించేవారు. అలాంటి అభిరుచి ఉన్న వారు ఆ చిరునామాకు ఉత్తరాలు రాయడం, తిరిగి వారి నుంచి ప్రత్యుత్తరాలు అందుకునేవారు. కలం స్నేహం అంటే ఒకప్పుడు గొప్ప క్రేజ్ ఉండేది. పేజీలకు పేజీలు ఉత్తరాలు రాసుకునే వారు. ఇదంతా గతం.. పూజ్యులైన అమ్మానాన్నలకు ..... ఇప్పుడంటే సెల్‌ఫోన్లు వచ్చాయి. వాట్సప్ సందేశాలు అందుబాటులో ఉన్నాయి. ఒకప్పుడు ఇలా కాదు...పైచదువుల కోసం, ఉద్యోగం కోసం దూర ప్రాంతాలకు వెళ్లే పిల్లలు ఉత్తరాలు రాస్తే తప్ప వారి తల్లిదండ్రులకు యోగక్షేమాలు తెలిసే అవకాశం ఉండేది కాదు. అలాగే తల్లిదండ్రులు తమ సమాచారాన్ని పిల్లలకు తెలియజేయాలంటే ఉత్తరమే వారధి.
‘పూజ్యులైన అమ్మానాన్నల పాదాలకు నమస్కరించి’ అంటూ దూర ప్రాంతాల నుంచి కొడుకు, అత్తరాంటి నుంచి కూతురు రాసే ఉత్తరాలను చూసుకుని తల్లిదండ్రులు పులకించిపోయారు. ఇలా మానవ సంబంధాలకు నిలయంగా వెలిగొందిన ఉత్తరాలు ఇప్పుడు కనుమరుగయ్యాయి. వాటిస్థానంలో ఆధునిక సమాచార మాధ్యమాలు అల్లుకున్నాయి. ఒకప్పుటి ఉత్తరం ఇప్పుడు సరికొత్త హంగులు సంతరించుకుంది. బంధుమిత్రుల మధ్య ఆప్యాయతతో నిండిన పలకరింపులను పంచిన లేఖలు కార్పొరేట్ సంస్థలకు, వినియోగదారులకు మధ్య వారధులుగా సరికొత్త అవతారం ఎత్తాయి.
సెల్‌ఫోన్లు, ఈ–మెయిల్స్, ఎస్‌ఎంఎస్, ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇంటర్నెట్, టెలిఫోన్లు, ఎంఎంఎస్, చాటింగ్‌లకు దీటుగా సేవలు విస్తరించాయి. పోస్టుకార్డులు, ఇంగ్లాండ్ లెటర్ స్థానంలో ఈ–పోస్టు, స్పీడ్ పోస్టు, బిజినెస్ పోస్టు వచ్చి చేరాయి. ఎక్స్‌ప్రెస్ పార్శిల్ పోస్టు, ఎలక్ట్రానిక్ ట్రాన్స్‌విుషన్ ఉత్తరాలు, బిజినెస్ పోస్ట్ రీటైల్ పోస్టు, బంగారు నాణేలు అమ్మకాలు, పేమెంట్ బ్యాంకులుగా పోస్టాఫీసులు పలు సేవలు అందిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment