ఒంగోలు సబర్బన్: ప్రమాదాల నివారణే లక్ష్యంగా విద్యుత్ శాఖ ముందుకు వెళ్తోంది. ప్రమాదాలు చోటుచేసుకోకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలో విద్యుత్ సిబ్బంది ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ప్రజలు, వినియోగదారులు విద్యుత్ ప్రమాదాల విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. విద్యుత్ చౌర్యం చౌర్యానికి పాల్పడవద్దని, బిల్లులు సకాలంలో చెల్లించి సంస్థ అభివృద్ధికి సహకరించాలని ఆ శాఖ అధికారులు కోరుతున్నారు. విద్యుత్‌కు సంబంధించిన అంశాలపై అధికారులు పలు సూచనలిచ్చారు.
ప్రమాదాల బారిన పడవద్దు
♦ విద్యుత్ ప్రవాహకాలైన ఇనుము, సిల్వర్ నిచ్చెనలు వాడేటప్పుడు చుట్టుపక్కల ఉన్నటువంటి విద్యుత్ తీగలను గమనించి వాటికి సాధ్యమైనంత దూరంగా ఉంటూ పనులు చేసుకోవాలి.
♦ నాణ్యమైన, ప్రమాణాలతో కూడిన విద్యుత్ పరికరాలను మాత్రమే ఉపయోగించాలి. పాడైపోయిన స్విచ్‌లు, విద్యుత్ పరికరాలు, వైర్లను వెంటనే మార్చుకోవాలి.
♦ ముఖ్యంగా అతుకులు వేసిన విద్యుత్ వైర్లను వాడకూడదు.
♦ తడి దుస్తులను, ఇనుప కడ్డీలపై, విద్యుత్ వైర్లకు సమీపంలో ఆరబెట్టకూడదు.
♦ ఇనుము, విద్యుత్ ప్రవాహక వస్తువులను డాబా పైకి తీసుకెళ్లేటప్పుడు చుట్టుపక్కల ఉన్నటువంటి విద్యుత్ తీగలను గమనించాలి.
♦ రైతులు పొలాల్లో విద్యుత్ తీగలను అతి తక్కువ ఎత్తులో కొక్కేలను అమర్చుకుని మోటార్లు ఆడిస్తున్నారు. దీని వల్ల ప్రమాదాలు సంభవిస్తున్నాయి. విద్యుత్ ప్రమాణాలతో కూడిన స్విచ్‌లు, ఫ్యూజ్ క్యారియర్లు ఏర్పాటు చేసుకుని వాడుకుంటే ప్రమాదాలు నివారించవచ్చు.
♦ పంట పొలాలకు ఏర్పాటు కేసిన కంచెకు విద్యుత్‌ను వాడకూడదు.
♦ విద్యుత్ పరికరాలపై పనిచేసుకునేటప్పుడు దాని విద్యుత్ ప్రవాహం నుంచి భూమికి మధ్య 8 అడుగుల క్లియరెన్స్ ఉండేటట్లు ఏర్పాటు చేసుకోవాలి.
♦ తడి చేతులతో విద్యుత్ స్విచ్ మరియు పరికరాలను తాకకూడదు.
ఆన్‌లైన్ పేమెంట్లు సురక్షితం
ఆన్‌లైన్ ద్వారా విద్యుత్ బిల్లులు చెల్లించడం వినియోగదారులకు సురక్షితం. ప్రస్తుతం కరోనా మహమ్మారి బారి నుంచి బయట పడవచ్చు. అందుకోసం గూగుల్ ప్లే స్టోర్ నుంచి విద్యుత్ బిల్లులు చెల్లించేందుకు వివిధరకాల యాప్‌లు అందుబాటులో ఉన్నాయి. వినియోగదారులు తమ మొబైల్ యాప్‌ల ద్వారా ఎప్పుడైనా, ఎక్కడైనా ఇంటి నుంచే విద్యుత్ బిల్లులు చెల్లించే అవకాశం ఉంది. తద్వారా క్యాష్ బ్యాక్ ఆఫర్లు కూడా వినియోగదారులకు అందుబాటులో ఉన్నాయి. విద్యుత్ బిల్లులు చెల్లించేందుకు కార్యాలయాల వద్ద లైన్‌లో నిల్చోవాల్సిన అవసరం లేదు.
విద్యుత్ ఆదాకు చిట్కాలు
► గృహాల్లో, కార్యాలయాల్లో ఉన్న ఏసీల ఉష్ణోగ్రతను 25 డిగ్రీలకు తక్కువ కాకుండా సెట్ చేసుకోవాలి.
► టీవీలను, ఏసీలను రిమోట్‌తోపాటు మెయిన్ స్విచ్ వద్ద కూడా ఆపాలి.
► ఆఫీసులు, కార్యాలయాలు, గృహా నుంచి బయటికి వెళ్లేటప్పుడు లైట్లు, ఫ్యాన్లు ఆపివేయాలి.
► నీరు వేడిచేసేందుకు విధిగా గ్యాస్, సోలార్ గీజర్లు వాడాలి.
► రిఫ్రిజిరేటర్ల డోర్లు తరచ తెరవకుండా మూసి ఉంచాలి.
► ఎల్‌ఈడీ బల్బులు, నాణ్యమైన విద్యుత్ పరికరాలు వాడి వినియోగదారులు విద్యుత్ బిల్లులను తగ్గించుకోవచ్చు.
► వాణిజ్య, పరిశ్రమల వినియోగదారుల కెపాసిటర్ సెల్స్ అమర్చుకుని విద్యుత్ బిల్లులను తగ్గించుకోవచ్చు
అప్రమత్తంగా ఉండాలి
విద్యుత్ ప్రమాదాలు జరగకుండా ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి. చిన్నపాటి జాగ్రత్తలు తీసుకుంటే ప్రాణాపాయం నుంచి బయట పడవచ్చు. కొంతమంది తెలియక నిర్లక్ష్యంగా ఉంటే మరికొందరు తెలిసి కూడా అంతే నిర్లక్ష్యంగా ఉంటారు. వినియోగదారులకు అందుబాటులో ఉండి మంచి సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నాం. నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయడమే ప్రభుత్వ లక్ష్యం. అందుకోసం సిబ్బందిని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నాం. విద్యుత్ సమస్యలపై టోల్ ఫ్రీ నం.1912కు ఫోన్ చేసి పరిష్కారం పొందవచ్చు.
– ఎం.శివప్రసాదరెడ్డి, జిల్లా విద్యుత్ శాఖ ఎస్‌ఈ
Comments
Please login to add a commentAdd a comment