17 ఏళ్ల వయసు నిండకముందే పెళ్లి.. కొంతకాలం కాపురం సజావుగా సాగింది. అంతలోనే ఆ ఇల్లాలికి తీవ్ర అనారోగ్య సమస్య తలెత్తింది. అప్పటికే ఆమె మూడు నెలల గర్భిణి.. భార్య అనారోగ్య విషయం తెలుసుకున్న భర్త కనికరం లేకుండా ఆమెపై దాడి చేసి వెళ్లిపోయాడు. గుండెకు మూడు రంధ్రాలతోపాటు, ముక్కుకు సంబంధించి ఇంకో సమస్య. నిరుపేదరాలైన గృహిణి తల్లిదండ్రుల వద్దకు చేరింది. ప్రాణాపాయ స్థితిలో మంచానికే పరిమితమై వైద్యం చేయించుకునేందుకు దాతల సాయం కోసం ఎదురు చూస్తోంది.
సాక్షి, నెల్లూరు(అర్బన్): నెల్లూరులోని భక్తవత్సలనగర్‌లో నివాసం ఉంటున్న మరియమ్మ, సుబ్బారావు దంపతులు నిరుపేదలు. వారికి ఐదుగురు కుమార్తెలు. ఒక కుమారుడు. వారిలో ఇద్దరు కుమార్తెలు మృతి చెందగా.. సుభాషిణి ఐదో సంతానం. ఆరో సంతానమైన కుమారుడు ప్రభుత్వ హాస్టల్లో ఉంటూ పదో తరగతి చదువుతున్నాడు. సుబ్బారావు కూలి పనులు చేస్తుంటాడు.
ఏమైందంటే..
సుభాషిణికి ఐదేళ్ల క్రితం వివాహమైంది. సంతోషంగా జీవిస్తున్న సమయంలో ఆమెకు ముక్కుల నుంచి రక్తస్రావం జరిగింది. నెల్లూరు ప్రభుత్వ పెద్దాస్పత్రి, కిమ్స్‌లో వైద్యపరీక్షలు చేయించగా గుండెకు రంధ్రాలున్నట్టు తేలింది. దీంతో భర్త భార్యతో గొడవ పెట్టుకుని రోకలి బండతో తల పగులగొట్టి మరో మహిళ వద్దకు వెళ్లిపోయాడు. సుభాషిణికి తీవ్రమైన తలనొప్పి, ముక్కు దిబ్బడ రావడంతో చెన్నైలో చికిత్స చేయించుకున్నారు. అక్కడి డాక్టర్లు వైద్య పరీక్షలు చేసి భర్త చేసిన దాడి కారణంగా మెదడు నుంచి ముక్కుకు వచ్చే నరాలు దెబ్బతిన్నాయని తేల్చారు.
వారి సూచన మేరకు చెన్నై పూనమలై కేకేఆర్ ఆస్పత్రికి సుభాషిణిని తల్లిదండ్రులు తీసుకెళ్లారు. అప్పులు చేసి రూ.3.80 లక్షలతో ఆపరేషన్ చేయించారు. ఆ తర్వాత గుండె వైద్యం కోసం మద్రాస్ మెడికల్ మిషన్ ఆస్పత్రికి వెళ్లగా వారు సీటీ, ఎంఆర్‌ఐ పరీక్షలు చేసి గుండె సాగిందని (ప్రొలాప్స్), 3 రంధ్రాలున్నట్లు తెలిపారు. వైద్యం చేయించుకునేందుకు డబ్బుల్లేక మందులు రాయించుకుని నెల్లూరుకు వచ్చారు. అంతలోనే శరీరం మొత్తం అలర్జీ వచ్చింది. తర్వాత సుభాషిణికి మరో అనారోగ్య సమస్య వచ్చింది. ఉన్నట్టుండి ఫిట్స్ రావడం మొదలైంది. మరో వైపు సరైన తిండి లేక మంచానికే పరిమితమైంది.
ఆపరేషన్ ఒక్కటే మార్గం
సుభాషిణికి వైద్యం చేయించేందుకు తల్లి మరియమ్మ కనిపించిన వారందరిని సాయం అడిగింది. ఎవరైనా నగదు ఇస్తే వైద్యం చేయించింది. రెడ్‌క్రాస్ వారు రూ.5 వేలు సాయం చేశారు. కలెక్టర్ చక్రధర్‌బాబు దృష్టికి విషయం రాగా నారాయణ ఆస్పత్రి వారితో మాట్లాడారు. ఆరోగ్యశ్రీ కింద వైద్యం చేయాలన్నారు. సుభాషిణిని నారాయణ ఆస్పత్రిలో రెండువారాల పాటు వైద్యం చేశారు. రకరకాల పరీక్షలు చేశారు. స్కిన్ సమస్య తగ్గించారు. అయితే అప్పటికే ఆరోగ్యశ్రీ పరిమితి దాటిపోయింది.
కాగా నరాల సమస్యకు, పరీక్షలకు ఆస్పత్రిలో రూ.5 వేల వరకు డబ్బు తీసుకున్నారు. ఫిట్స్ రావడానికి కారణం మెదడులోని ఒక రక్తనాళంలో రక్తం గడ్డ కట్టిందని తెలిపారు. దానిని కరిగించాలని మరో వైపు గుండెకు కూడా ఆపరేషన్ చేయాలని డాక్టర్లు పేర్కొన్నారు. గుండె ఆపరేషన్‌కు రూ.3.50 లక్షలు ఖర్చవుతుందని తెలిపారు. గుండెకు స్టంట్ వేయడం సాధ్యం కాదని, ఆపరేషన్ ఒక్కటే మార్గమన్నారు.
డబ్బుల్లేక..
ప్రస్తుతం సుభాషిణి తీవ్ర దగ్గు, జ్వరంతో బాధపడుతోంది. రోజుకు నాలుగైదు సార్లు ఫిట్స్ వస్తున్నాయి. దీనికి సంబంధించి మందులు కొనుగోలు చేసేందుకు కూడా డబ్బుల్లేవు. ఇప్పుడు మందులు వాడడం లేదు. నారాయణ ఆస్పత్రిలో ఐదు నెలల క్రితం చేసిన పరీక్షల్లో కేవలం 40 శాతం మాత్రమే రక్తం శరీరంలో ఉంది. ఇప్పుడు ఇంకా తగ్గిపోయి శరీరం పాలిపోయింది. మరియమ్మ కూడా అనారోగ్య సమస్యతో బాధపడుతోంది. అయితే కుమార్తె ఆరోగ్య ముఖ్యమని చెబుతోంది. సుభాషిణి తన కుమార్తె ఐశ్వర్య జీవితం గురించి ఆలోచిస్తూ కన్నీరుమున్నీరవుతోంది.
సుభాషిణి బ్యాంక్ అకౌంట్ వివరాలు
ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు
అకౌంట్ నంబర్ 911020 42915
ఎస్‌ఎంబీ బ్రాంచ్, బీవీనగర్
ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్ ఏపీజీబీ 0004114
బాధితురాలి తల్లి ఫోన్ నంబర్ : 72889 03283
నా ఆపరేషన్ వాయిదా వేసుకున్నా
నాకు కడుపునొప్పి వస్తోంది. పెద్దాస్పత్రిలో చూపించాను. గర్భసంచిలో గడ్డ ఉంది ఆపరేషన్ చేయాలన్నారు. నేను ఆపరేషన్ చేయించుకుంటే సుభాషిణి, మనుమరాలు ఐశ్వర్యను చూసే దిక్కులేక కడుపు నొప్పి భరిస్తున్నా. ఆపరేషన్ వాయిదా వేసుకుస్తున్నా. దాతలు స్పందించి సాయం చేస్తే నా బిడ్డకు వైద్యం చేయించుకుని ప్రాణాలు కాపాడుకుంటాను.
– మరియమ్మ, సుభాషిణి తల్లి
Comments
Please login to add a commentAdd a comment