సాక్షి, అమరావతి: సనాతన ధర్మాలను గౌరవిస్తూ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి, ప్రజలందరికీ ఆయురారోగ్య ఐశ్వర్య ప్రాప్తి కోసం రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా దేవదాయ శాఖ ఆధ్వర్యంలో శ్రీలక్ష్మీ మహాయజ్ఞ కార్యక్రమానికి శుక్రవారం శ్రీకారం చుట్టారు. ఆరు రోజుల పాటు కొనసాగనున్న అష్టోత్తర శతకుండాత్మక చండీ, రుద్ర, రాజ శ్యామల, సుదర్శన సహిత శ్రీలక్ష్మీ మహాయజ్ఞం విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో ప్రారంభమైంది.
‘సమస్త ప్రజానాం క్షేమ, స్థైర్య, విజయ, అభయ, ఆరోగ్య, ఐశ్వర్య అభివృద్ధ్యర్థం...’ అంటూ సీఎం వైఎస్ జగన్ వేద పండితుల ఉచ్చారణల మధ్య సంకల్పం చేపట్టడంతో యజ్ఞ కార్యక్రమాలు లాంఛనంగా ప్రారంభమయ్యాయి. ముఖ్యమంత్రి దంపతులతో పాటు వారి పిల్లల గోత్ర నామాలతో వేద పండితులు పూజలు నిర్వహించారు.
అనంతరం యజ్ఞశాలలో ఏర్పాటు చేసిన మండపంలో శ్రీ మహాలక్ష్మీ దేవి విగ్రహం ముందు స్వర్ణలక్ష్మీ అమ్మవారి ప్రతిమకు సీఎం జగన్ పంచామృతాలతో అభిషేకం చేశారు. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య అమ్మవారి విగ్రహానికి హారతి ఇచ్చారు. ముఖ్యమంత్రికి కుర్తాళం శ్రీసిద్ధేశ్వరీ పీఠాధిపతి శ్రీ సిద్ధేశ్వరానంద భారతీస్వామి ఆశీర్వచనం అందజేశారు.
కపిల గోవుకు పూజలు
యజ్ఞ కార్యక్రమాలలో పాల్గొనేందుకు వచ్చిన సీఎం జగన్‌కు వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. వివిధ ఆగమాలకు అనుగుణంగా యజ్ఞశాల చుట్టూ కలియ తిరిగిన సీఎం జగన్ వేద పండితులు, రుత్వికులకు అభివాదం చేశారు. గోశాలలో కపిల గోవుకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తిరిగి వెళ్లే సమయంలో భక్తులను పలుకరించి మాట్లాడారు.
ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ దంపతులు, దేవదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణ దంపతులు యజ్ఞ దీక్షాధారణ స్వీకరించారు. మంత్రులు తానేటి వనిత, ఉషశ్రీచరణ్, జోగి రమేష్, అంబటి రాంబాబు, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ఈ నెల 17 వరకు యజ్ఞ కార్యక్రమాలు కొనసాగుతాయి.
Comments
Please login to add a commentAdd a comment