సాక్షి, అమరావతి: కిసాన్ క్రెడిట్ కార్డుల (కెసీసీ) ద్వారా రైతులకు స్వల్పకాలిక రుణాల మంజూరులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే ఐదో స్థానంలో ఉండగా, దక్షిణాది రాష్ట్రాల్లో అగ్రస్థానంలో ఉంది. వ్యవసాయ రంగానికి వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుండటం, మద్దతు ధర కల్పిస్తుండటంతో రాష్ట్రంలో ఎటువంటి ఆటంకాలు లేకుండా రైతులు పంటలు సాగు చేస్తున్నారు. దీంతో కేసీసీ ద్వారా స్వల్పకాలిక రుణాలు తీసుకోవడానికి రైతులు ముందుకు వస్తున్నారు.
ఈ రుణాల్లో దక్షిణాది రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే అగ్రస్థానంలో ఉందని నాబార్డు, రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్‌ఎల్‌బీసీ) నివేదికలు వెల్లడించాయి. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్ వరుసగా నాలుగు స్థానాల్లో ఉన్నట్లు నాబార్డు నివేదిక తెలిపింది. రాష్ట్రంలో 45.52 లక్షల రైతులకు ఈ కార్డులు మంజూరు చేశారు. ఈ రైతుల్లో చాలా మందికి కేసీపీ కవరేజ్ అయిందని ఎస్‌ఎల్‌బీసీ నివేదిక పేర్కొంది.
పశు సంవర్ధక, డెయిరీ, మత్స్య కార్యకలాపాల రైతులకు అవసరమైన వర్కింగ్ కేపిటల్ కోసం కేసీసీలను సంతృప్త స్థాయిలో ఇవ్వాల్సిన అవసరం ఉందని ఎస్‌ఎల్‌బీసీ పేర్కొంది. ఈ రైతులకు కేసీసీల మంజూరుకు మార్చి నెలాఖరు వరకు ప్రతి శుక్రవారం ప్రత్యేక క్యాంపులు నిర్వహిస్తున్నట్లు తెలిపింది. ఈ శిబిరాల్లో రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించి, అక్కడికక్కడే పరిశీలిస్తారని తెలిపింది. అర్హులైన వారికి కేసీసీ జారీ చేస్తారంది.
ఈ శిబిరాల ద్వారా ఇప్పటివరకు పశు సంవర్ధక, డైరీ కార్యకలాపాలకు కేసీసీ కోసం 82,366 ధరఖాస్తులు రాగా 68,948 దరఖాస్తులకు కేసీసీ మంజూరు చేశారు. మత్స్య కార్యకలాపాల కోసం 36,076 దరఖాస్తులు రాగా 22,856 మందికి కేసీసీ మంజూరు చేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పశుసంవర్ధక రంగంలో 95,445 ఖాతాలకు రూ.1079.26 కోట్లు, మత్స్య రంగంలో 5,112 ఖాతాలకు రూ.285.95 కోట్లు మంజూరు చేశారు. అయితే సంతృప్త స్థాయిలో కేసీసీల మంజూరుకు బ్యాంకులు మరింతగా దృష్టి సారించాలని ఎస్‌ఎల్‌బీసీ సూచించింది.
Comments
Please login to add a commentAdd a comment