సాక్షి, అమరావతి/గుడివాడ రూరల్: ‘నన్ను ఎవరూ ఏం చేయలేరు.. నాకు తిరుగులేదు... అనుకునే చంద్రబాబు అహంకారానికి ఏసీబీ కోర్టు తీర్పు చెంపపెట్టు..’ అని వివిధ సంఘాల నాయకులు అభిప్రాయపడ్డారు. స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ స్కాంలో చంద్రబాబుకు 14 రోజులు రిమాండ్ విధించడాన్ని స్వాగతిస్తున్నామని ప్రకటించారు. ఎంతటివారైనా తప్పు చేస్తే చట్టం నుంచి తప్పించుకోలేరని చంద్రబాబు విషయంలో నిరూపితమైందని వ్యాఖ్యానించారు. చంద్రబాబు అవినీతి గురించి ఎన్టీఆర్ ఎప్పుడో చెప్పారని... తాజాగా కోర్టు రిమాండ్‌తో ఎన్టీఆర్ ఆత్మ శాంతిస్తుందని పలువురు పేర్కొన్నారు. ఈ సందర్భంగా వివిధ సంఘాల నాయకులు తమ అభిప్రాయాలు వెల్లడించారు.
చంద్రబాబు ఎత్తులు వర్కవుట్ కాలేదు
అమరావతి రాజధాని భూముల కేటాయింపులు, సింగపూర్ ఒప్పందాలు, కాంట్రాక్టులు అన్నీ లోపభూయిష్టంగానే ఉన్నాయి. అంతా ఆయనకు అనుకూలమైన వారితోనే ఒప్పందాలు, అనుయాయులకే కాంట్రాక్టులు కట్టబెట్టారని ప్రజలందరికీ తెలుసు. స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో ఆధారాలతో సహా చిక్కిన చంద్రబాబు ఎప్పటి మాదిరిగానే తప్పించుకుందామని అనుకున్నారు. తానొకటి తలిస్తే దైవం మరొకటి తలిచిందన్నట్లు ఈసారి చంద్రబాబు ఎత్తులు వర్కవుట్ కాలేదు.
– షేక్ మునీర్ అహ్మద్, ముస్లిం జేఏసీ రాష్ట్ర కన్వినర్
ఎంతటివారికైనా శిక్ష తప్పదు
స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ కుంభకోణంలో షెల్ కంపెనీల ద్వారా రూ.వందల కోట్లు స్వాహా చేసిన కేసులో చంద్రబాబుకు రిమాండ్ విధించడాన్ని స్వాగతిస్తున్నాం. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తే ఎవరికైనా శిక్ష తప్పదు. ప్రజాసంక్షేమం కోసం ఖర్చు చేయాల్సిన నిధులను స్వప్రయోజనాల కోసం మళ్లించడం క్షమించరాని నేరం. ఇటువంటి తప్పుడు వ్యవహారాలను మేథావులు, రాజకీయ పక్షాలు సమర్థించకూడదు. వ్యవస్థలను మ్యానేజ్ చేయడం అన్ని సందర్భాల్లో సాధ్యం కాదని చంద్రబాబు తెలుసుకోవాలి. – డాక్టర్ ఎన్.మారేష్, రాష్ట్ర అధ్యక్షుడు, ఏపీ బీసీ సంఘం
చంద్రబాబు ఎన్నికల్లో పోటీకి అనర్హుడు
రాజకీయాల్లో అతి పెద్ద అవినీతి చక్రవర్తి చంద్రబాబు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని వైట్ కాలర్ నేరాలకు పాల్పడి తప్పించుకుని తిరుగుతున్నాడు. తప్పు చేసినవారు ఎప్పటికైనా చట్టానికి చిక్కక తప్పదని రుజువైంది. చంద్రబాబు అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఎన్నికల కమిషన్ స్పందించాలి. అవినీతి చక్రవర్తిగా పేరొందిన చంద్రబాబును ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హుడిగా ప్రకటించాలి. – పెరికె వరప్రసాదరావు, నేషనల్ దళిత జేఏసీ చైర్మన్
చంద్రబాబు పెద్ద అవినీతి తుప్పు
తప్పు చేసిన ప్రతిసారి తాను నిప్పు అని, తనను ఎవరు ఏమీ చేయలేరని ఎదురు దాడిచేయడం చంద్రబాబుకు అలవాటుగా మారింది. స్టేలు తెచ్చుకుని విచారణ నుంచి తప్పించుకుని తిరిగే చంద్రబాబుకు నిప్పు అని చెప్పుకునే అర్హత లేదు. చంద్రబాబు పెద్ద అవినీతి తుప్పు. ఆయన పాలనలో స్కీముల పేరుతో స్కాములే ఎక్కువగా జరిగాయి. స్కిల్ స్కాం కేసులో పట్టుబడిన చంద్రబాబుకు రిమాండ్ విధించడంతో న్యాయం గెలిచింది. నూరు గొడ్లను తిన్న రాబందు ఒక్క గాలివానకు కూలిపోయిందనే చందంగా రూ.లక్షల కోట్ల అవినీతికి పాల్పడిన చంద్రబాబు ఈ కేసులో దొరికిపోయారు. – శోభా స్వాతిరాణి, చైర్‌పర్సన్, ఏపీ గిరిజన సహకార సంస్థ
న్యాయం గెలిచింది
స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ స్కాంలో అవినీతికి పాల్పడిన మాజీ సీఎం నారా చంద్రబాబుకు ఏసీబీ కోర్టు 14 రోజులు రిమాండ్ విధించడం హర్షణీయం. ముఖ్యమంత్రి ముసుగులో ప్రజాధనాన్ని లూటీ చేసి తప్పించుకోవడానికి ప్రయత్నించిన చంద్రబాబుకు న్యాయస్థానం రిమాండ్ విధించడాన్ని స్వాగతిస్తున్నాం. ఈ తీర్పు ద్వారా న్యాయం, ధర్మం గెలిచాయి. అవినీతి కేసు నుంచి తప్పించుకునేందుకు రాష్ట్రంలో అల్లర్లు సృష్టించి శాంతిభద్రతలకు విఘాతం కలగించేందుకు చంద్రబాబు ప్రయత్నించారు. – మారుమూడి విక్టర్ ప్రసాద్, ఏపీ ఎస్సీ కమిషన్ చైర్మన్
కోర్టు తీర్పు బాబు అహంకారానికి చెంపపెట్టు
Published Mon, Sep 11 2023 4:14 AM | Last Updated on Mon, Sep 11 2023 4:15 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment