సాక్షి, అమరావతి : తిరుపతి శ్రీ గోవిందరాజ స్వామి దేవస్థానం గర్భగుడి విమాన గోపురంపై బంగారు పూతతో కూడిన రాగి రేకులను ఏర్పాటు చేసే విషయంలో అక్రమాలు జరిగాయని, వాస్తవాలను నిగ్గు తేల్చేందుకు అడ్వొకేట్ కమిషన్‌ను నియమించాలని కోరుతూ హైకోర్టులో గురువారం లంచ్‌మోషన్ రూపంలో అత్యవసర పిటిషన్ దాఖలైంది. గోవిందరాజ స్వామి దేవస్థానంలో ఈ నెల 21న తలపెట్టిన మహా సంప్రోక్షణ వాయిదా వేసేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ తిరుపతికి చెందిన తుమ్మా ఓంకార్ ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు.
ఈ వ్యాజ్యంపై న్యాయమూర్తి జస్టిస్ బీఎస్ భానుమతి విచారణ జరిపారు. ఇదే వ్యవహారానికి సంబంధించి ఇప్పటికే రెండు వ్యాజ్యాలు దాఖలయ్యాయని, వాటిపై కోర్టు ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేదని టీటీడీ తరఫు సీనియర్ న్యాయవాది ఎస్.సత్యనారాయణ ప్రసాద్ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈ వ్యాజ్యాల్లో కౌంటర్లు కూడా దాఖలు చేశామన్నారు. పూర్తి వివరాలు సమర్పించేందుకు విచారణను వాయిదా వేయాలని కోరారు. ఇందుకు న్యాయమూర్తి అంగీకరిస్తూ తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేశారు. టీటీడీ కౌంటర్‌తో పాటు ఇతర అంశాలనూ పరిశీలిస్తామని న్యాయమూర్తి తెలిపారు.
అంతకు ముందు పిటిషనర్ తరఫు న్యాయవాది జేవీ ఫణిదత్ వాదనలు వినిపిస్తూ.. ఆగమ శాస్త్ర నిబంధనలకు విరుద్ధంగా విమాన గోపురానికి బంగారుపూత పూసిన రాగి రేకులు అమర్చడం వల్ల గోపురం దెబ్బతింటుందని చెప్పారు. ఇందులో అక్రమాలు జరిగాయని, రాగి రేకులకు బంగారు పూతకు బదులు బంగారు రంగు వేస్తున్నారని, వాస్తవాలను నిగ్గు తేల్చేందుకు అడ్వొకేట్ కమిషన్‌ను నియమించాలని కోరారు. మహా సంప్రోక్షణ పూర్తయితే గర్భగుడిని ఎక్కి విమాన గోపురాన్ని పరిశీలించే అవకాశం ఉండదన్నారు. అందువల్ల మహా సంప్రోక్షణను నిలిపివేయాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment