పెట్రోల్‌ బంకుల్లో నిలువు దోపిడీ  | Story On Fraud In Petrol Bunks | Sakshi
Sakshi News home page

దోపిడీ పర్వం..!  

Published Thu, Aug 20 2020 12:30 PM | Last Updated on Thu, Aug 20 2020 12:30 PM

Story On Fraud In Petrol Bunks - Sakshi

ఒంగోలు–కర్నూలు రోడ్డులోని ఓ పెట్రోల్‌  బంకులో ఇటీవల ఓ వ్యక్తి తన ద్విచక్ర వాహనంలో పెట్రోల్‌ పోయించుకునేందుకు వెళ్లాడు. రూ.100 పెట్రోలు కొట్టమని చెప్పి పర్సు నుంచి డబ్బు తీయబోయాడు. ఆ లోపే పెట్రోల్‌ పోసే వ్యక్తి ఇంధనం నింపేశాడు. ఇంతలోనే కొట్టడం అయ్యిందా.. అని వాహనదారుడు ప్రశ్నించగా అంత అనుమానం ఉంటే మీరే రీడింగ్‌ చూసుకోవాలంటూ అతగాడు సలహా ఇచ్చాడు. దీంతో వాహనదారుడు ఏం మాట్లాడకుండా వెళ్లి పోయాడు. ఉదయం మళ్లీ కార్యాలయానికి వెళ్తుండగా మార్గం మధ్యలో ఇంధనం అయిపోయి వాహనం ఆగిపోయింది. వెంటనే సమీప పెట్రోల్‌ బంకుకు వెళ్లి ఆ వ్యక్తిని నిలదీశాడు. దీనికి ఆయన ‘మేం సక్రమంగానే పోశాం.. మీరు ఎక్కడెక్కడ తిరిగారో ఎవరికి తెలుసు’ అని ఎదురు ప్రశ్నించడంతో ముక్కున వేలుసుకోవాల్సి రావడం వినియోగదారుడి వంతైంది. ఇలాంటి ఘటనలు జిల్లాలో నిత్యం కోకొల్లలుగా జరుగుతున్నాయి. వినియోగదారుణ్ని మాటల్లో పెట్టి పెట్రోల్‌ బంకుల నిర్వాహకులు నిలువునా దోచేస్తున్నారు. కొలతల్లో మాయజాలం చేస్తూ నష్టపరుస్తున్నారు. బంకుల్లో పని చేసే ఫిల్లింగ్‌ మెన్ల చేతివాటానికి వాహనదారులు మోసపోతున్నారు.

పొదిలి రూరల్‌: జిల్లాలో ప్రతి రోజు కొత్తగా రోడ్డెక్కే వాహనాలు పెరిగిపోయాయి. ఫలితంగా ఇంధన వినియోగం పెరిగింది. దీంతో కొందరు పెట్రోల్‌ బంకుల నిర్వాహకులు అక్రమార్జనకు తెర లేపారు. పలు చోట్ల కల్తీ జరుగుతుండగా, వినియోగదారులను బురిడీ కొట్టించి తక్కువ ఇంధనం పోస్తున్నారు. పెట్రోల్‌ కొలత పూర్తి కాకుండా పంపు ఆపివేయడం, వేగంగా ట్యాంకు నింపడం, అదే సమయంలో కొలతను సూచించే ఎలక్ట్రానిక్‌ యంత్రంపై చేయి అడ్డుపెట్టడం, వంటి మోసాలకు పాల్పడుతున్నారు. దీంతోపాటు పెట్రోల్‌ బంకుల్లో సౌకర్యాలు గాలికొదిలేశారని వాహనదారులు గగ్గోలు పెడుతున్నారు. ధరల పట్టిక కనిపించదు. ఉచిత గాలి యంత్రం, ఫస్ట్‌ ఎయిడ్‌ బాక్స్, మరుగుదొడ్లు, తాగునీటి వసతి ఇలాంటివి చాలా చోట్ల కనిపించవు. అసలే చమురు ధరల భారంతో జనం నలిగిపోతుంటే మరోవైపు బంకుల్లో దోపిడీ వారిని మరింత కుంగదీస్తోంది. డీజిల్, పెట్రోల్‌ విక్రయాల్లో ఛీటింగ్‌ జరుగుతున్నా తనీఖీలు నిర్వహించి నిగ్గు తేల్సాల్సిన తూనికలు, కొలతలు శాఖ అధికారులు వినియోగదారుల మొరాలకించడంలేదు. అంతెందుకు ఎన్ని బంకులున్నాయి.. తనిఖీలు ఎప్పడైనా చేశారా.. ఎంత జరిమానా వేశారు.. అనే సమాచారం కూడా సంబంధిత అధికారుల వద్ద లేదంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు.  

కల్తీతో వాహనాల రిపేర్లు.. 
నింబంధనల ప్రకారం లీటరుకు 5 ఎంఎల్‌ ఇంధనం తక్కువగా రావొచ్చు. అంతకంటే ఎక్కువగా వస్తే అనుమానించాల్సిందే. కొన్ని బంకుల్లో 50 ఎంఎల్‌ నుంచి 100 ఎంఎల్‌ వరకు తేడా వస్తున్నట్లు వాహనదారులు వాపోతున్నారు. మరి కొన్ని బంకుల్లో పెట్రోల్, డీజిల్‌లో రేషన్‌ కిరోసిన్‌ను కలిపి విక్రయిస్తున్నారని, దీంతో వాహనాలు తరచూ మరమ్మతులకు గురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే గోదాములు నుంచి బంకుకు సరఫరా చేసే క్రమంలోనే కల్తీ జరుగుతున్నట్లు సాక్షాత్తు అధికారులే అంగీకరిస్తుండటం గమనార్హం.  

ఎవరేం చేయాలి.. 
రికార్డుల్లో చూపినట్లుగా నిల్వలు న్నాయా లేదా, నిర్వహణ తీరు తదితర అంశాలు ను పరిశీలించాల్సిన బాధ్యత పౌర సరఫరాల శాఖది. పెట్రోల్, డీజీల్‌ను సరిగ్గా కొడుతున్నారా.. వాహనాల్లో నింపే క్రమంలో అక్రమాలు ఏమైనా జరుగుతున్నాయా.. ఇంధనం పోసే యంత్రాలను తూనికలు, కొలతలు శాఖధికారులు ఎప్పటికప్పుడు తనీఖీ చేయాలి. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని వాహనదారులు కోరుతున్నారు. 

నిలువు దోపిడీ 
పొదిలిలోని పొదిలి–ఒంగోలు రహదారిలో గల ఓ పెట్రోల్‌ బంకులో 100 రూపాయలుకు పెట్రోల్‌ పోయించుకున్నా. ఒంగోలు వరకు వెళ్లి తిరుగు ప్రయాణంలో చూసేసరికి బైకులో పెట్రోలు లేదు. అక్కడ మళ్లీ మరో వంద రూపాయలకు పెట్రోల్‌ పోయించుకుని బయలుదేరా. పొదిలి వచ్చి ఆ పెట్రోల్‌ బంకులో అడిగితే మేం కరెక్టుగా కొట్టామని, అంత అనుమానం ఉంటే మీరే రీడింగ్‌ చూసుకోవాలన్నాడు. నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. 
– గురువారెడ్డి, వాహనదారుడు, పొదిలి 

నిబంధనలు పాటించకపోతే చర్యలు..   
పెట్రోల్‌ బంకుల నిర్వాహకులు నిబంధనలు పాటించాల్సిందే. ఆయిల్‌ నింపే ముందు మీటరు వేసి వాహనాలకు పెట్రోల్, డీజిల్‌ నింపాలి. ఎక్కడైనా కల్తీలు జరిగినా, ఆయిల్‌ నింపడంలో తేడాలు గుర్తించినా అటువంటి బంకులపై చట్ట పరమైన చర్యలు తీసుకుంటాం. ఎవరైనా ఫిర్యాదు చేసినా ఆయా పెట్రోల్‌ బంకులను రెండు, మూడు రోజుల్లో తనిఖీ చేసి తప్పు జరిగితే చర్యలు తీసుకుంటాం.   
– మూర్తి, జిల్లా తూనికలు, కొలతలు అధికారి  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement