పెట్రోల్ బంకుల్లో మెకానికల్ పల్సర్ బోర్డ్‌లో చిప్‌లు పెట్టేందుకు అవకాశం ఉన్న పల్సర్ బోర్డ్‌లను పరిశీలిస్తున్న అధికారులు
విజయవాడలోని గుణదలలో ఓ పెట్రోల్ బంకులో మోసాలు జరుగుతున్నట్లు సమాచారం అందడంతో తూనికలు–కొలతల శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. 5 లీటర్లకు 560 ఎంఎల్ తక్కువ కొలత వస్తున్నట్టు గుర్తించారు. మదర్ బోర్డును పరిశీలించగా అందులో కొన్ని మార్పులు చేసి తక్కువ కొలత వచ్చేట్టుగా చేస్తున్నారని నిర్ధారణ అయ్యింది. అత్యంత రద్దీగా ఉండే ప్రాంతంలో ఉన్న ఆ బంకులో ఉన్న రెండు యూనిట్ల ద్వారా రోజుకు దాదాపు 7వేల లీటర్ల పెట్రోలులో 840 లీటర్ల వరకు మోసం చేస్తున్నారు. బంకును సీజ్ చేసి యాజమానిపై కేసు నమోదు చేశారు. నేరం రుజువు కావడంతో న్యాయస్థానం జరిమానా విధించింది.
తూర్పు గోదావరి జిల్లా ద్రాక్షారామంలోని ఓ పెట్రోల్‌బంకులో 5 లీటర్లకు 120 ఎంఎల్ తక్కువ కొలత వస్తున్నట్టు అధికారులు గుర్తించారు. బంకులోని మెకానికల్, ఎలక్ట్రానిక్ బోర్డులు చూపిస్తున్న నెల రోజుల గణాంకాలను పరిశీలిస్తే... రెండు బోర్డుల మధ్య 62,458లీటర్ల వ్యత్యాసం ఉన్నట్టు నిర్ధారణ అయ్యింది. లీటరుకు రూ. 100 చొప్పున చూసినా నెలలో రూ.62.45లక్షలు దోపిడీ చేశారని అర్థమవుతుంది. బంకులోని మదర్‌బోర్డ్, డిస్‌ప్లే బోర్డ్, సెన్సారల్ సర్క్యూట్ బోర్డులను పరీక్షల నిమిత్తం ల్యాబొరేటరీకి పంపగా వాటిలో మైక్రో కంట్రోలర్ చిప్ అమర్చినట్టు బయటపడింది. బంకు యజమానిపై కేసు నమోదుచేశారు.
ఇవే కాదు తూనికలు కొలతల శాఖ అధికారులు రాష్ట్రవ్యాప్తంగా 600 పెట్రోల్ బంకుల్లో ఇటీవల ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. వాటిలో 17 బంకుల్లో ఇలా చిప్‌లు పెట్టి మోసం చేస్తున్నట్టుగా గుర్తించారు. ఆ బంకులను సీజ్ చేసి కేసులు నమోదు చేశారు.
వడ్డాది శ్రీనివాస్, సాక్షి, అమరావతి: పెట్రోల్, డీజీల్ ధరలు పెరుగుతున్న కొద్దీ వాటి విక్రయాల్లో మోసాలు కూడా పెరుగుతున్నాయి. పెట్రో ధర లీటరుకు రూ.100 దాటగానే... పెట్రోల్ బంకుల్లో మోసాలు కూడా 100కి.మీ. స్పీడ్ అందుకున్నాయి. పెట్రోలు బంకుల్లో మోసాలు అంటే ఏదో అక్కడ సిబ్బంది ప్రదర్శించే చేతివాటం మాత్రమే అనుకుంటే పొరపాటే. ఈ పెట్రో దందా స్థాయి అంతకుమించి ఉంది. ఏపీలోని గుంటూరు, ప్రకాశం జిల్లాలు, తెలంగాణ రాజధాని హైదరాబాద్ కేంద్రాలుగా ఈ ముఠాలు పనిచేస్తున్నాయి. ఈ మూడింటికి ముంబై వరకు లింక్ ఉంది. వీరికి సాంకేతిక సహకారం చైనాలోని ముఠాల నుంచి అందుతోందని అధికారులు గుర్తించారు. (చదవండి: టీడీపీలో ముసలం: తారస్థాయికి వర్గ విభేదాలు)
హైదరాబాద్‌లో పెట్రోల్ బంకుల్లో ప్రత్యేక చిప్‌లు అమర్చి పెట్రోల్ కొలతల్లో మోసాలకు పాల్పడుతున్న ముఠా దందాను పోలీసులు పట్టుకోవడం గతంలో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.. ఆ ముఠాను పట్టుకోవడంతోనే ఈ మోసాలకు చెక్ పడిందనుకుంటే పొరపాటే. పెట్రోల్ బంకుల్లో టెక్నాలజీ మారుస్తున్న కొద్దీ మోసగాళ్లు కూడా మరింతగా రాటుదేలుతున్నారు. లేటెస్ట్ టెక్నాలజీని ఉపయోగించుకుని రివర్స్ ఇంజినీరింగ్‌తో ఏమారుస్తున్నారు. ఏటా తూనికలు–కొలతల శాఖ దాడులు నిర్వహిస్తూ మోసాలకు పాల్పడుతున్న బంకులపై కేసులు నమోదు చేస్తున్నా...పెట్రోలు బంకుల మదర్‌బోర్డులను మారుస్తున్నా... మోసాలు ఆగడం లేదు. చైనా నుంచి కథ నడుపుతున్న ఆ ముఠా ‘రివర్స్ ఇంజనీరింగ్’ ఎత్తుగడతో మరోకొత్త దొడ్డిదారిని విజయవంతంగా కనిపెడుతుండటం విస్మయపరుస్తోంది.
చెక్ మిజర్ క్యాన్‌లో పెట్రోల్ కొలతను పరిశీలిస్తున్న అధికారులు(ఫైల్ ఫొటో)
బంకుల్లో టెక్నాలజీ ట్యాంపరింగ్..
పెట్రోల్ బంకుల్లో భారీ మోసాలకు పాల్పడే ముఠాలు దేశ వ్యాప్తంగా విస్తరించాయి. బంకులకు సరఫరా అయిన పెట్రోలు/ డీజిల్, బంకుల ద్వారా విక్రయాలు, ఇంకా మిగిలి ఉన్న నిల్వలు... తదితర వివరాలను బంకుల్లో ఉన్న మెకానికల్, ఎలక్ట్రానిక్ వ్యవస్థలు వెల్లడిస్తాయి. అందుకోసం కీ బోర్డ్, పల్సర్ బోర్డ్, మదర్ బోర్డ్, డిస్‌ప్లే బోర్డ్ అనే 4 వ్యవస్థలు ఉన్నాయి. ఎంత పెట్రోల్/ డీజిల్ కావాలో కీ బోర్డులో నమోదు చేయగానే.. మదర్ బోర్డ్‌కు సందేశం వెళ్తుంది. ఆ వెంటనే పల్సర్ బోర్డ్‌కు ఆ సందేశం చేరి నిల్వల నుంచి ఆ మేరకు పెట్రోల్/ డీజిల్ పంపింగ్ ద్వారా వినియోగదారుని వాహనం ట్యాంకులోకి చేరుతుంది. ఈ సందర్భంలో బంకుల నిల్వల్లో ఎంత పెట్రోల్/డీజిల్ ఉందన్నది మదర్ బోర్డ్, సెన్సార్ బోర్డ్ ఒకే రీతిలో చూపించాలి. కానీ పెట్రో ముఠాలు ఈ నాలుగు వ్యవస్థలను ట్యాంపర్ చేస్తున్నాయి.
చిప్‌లతో మన పెట్రోలుకు చిల్లు
►పల్సర్ బోర్డ్‌కు మదర్ బోర్డ్‌కు మధ్యగానీ మదర్ బోర్డ్‌కు డిస్‌ప్లే బోర్డ్‌కు మధ్యగానీ ప్రత్యేక చిప్‌ను అమరుస్తున్నారు. దాంతో ఒక పరిమాణంలో పెట్రోల్ కావాలని ఫీడ్ చేస్తే... అంతకంటే తక్కువ మేరకు సందేశం వెళ్లి తక్కువ పెట్రోల్/డీజిల్ బయటకు వస్తుంది. కానీ డిస్‌ప్లే మాత్రం ఎంత ఫీడ్ చేశారో అంతే వేసినట్టు కనిపిస్తుంది. కానీ వాహనాల్లోకి అంతకంటే తక్కువ పెట్రోల్/డీజిల్ వెళ్తుంది.
►ఇక కీబోర్డ్‌ను ప్రత్యేక చిప్‌తో ట్యాంపర్ చేస్తున్నారు. ఉదాహరణకు కీ బోర్డులో 5 లీటర్లు అని ఫీడ్ చేసినా సరే మదర్‌బోర్డ్‌కు మాత్రం 4.5లీటర్లు అనే సందేశం వెళ్తుంది. దాంతో 4.5లీటర్ల పెట్రోల్/డీజిలే వస్తుంది. అంటే వినియోగదారుడు అరలీటర్ పెట్రోల్‌ను కోల్పోతాడన్నమాట.
పెట్రో దోపిడీ ముఠాలు చిప్‌లను ఏర్పాటు చేసి మోసానికి పాల్పడే డిస్‌ప్లే బోర్డు వెనుకభాగం
మదర్ బోర్డులు
చిప్‌లను ఏర్పాటు చేసి మోసానికి పాల్పడే పల్సర్ బోర్డ్‌లు
‘రివర్స్ ఇంజనీరింగ్’తో ఏమారుస్తున్న ముఠాలు
బంకుల్లో చిప్‌లు అమర్చి మోసాలకు పాల్పడుతున్న విషయం తొలిసారిగా హైదరాబాద్‌లోనే వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత దేశవ్యాప్తంగా పోలీసులు, తూనికలు–కొలతల శాఖల అధికారులు నిర్వహించిన దాడుల్లో అటువంటి తరహా మోసాలు బయటపడ్డాయి. దాంతో పెట్రోల్ బంకుల యూనిట్లలో చిప్‌లు అమర్చేందుకు అవకాశం లేకుండా సీళ్లు వేసి సరికొత్త పరిజ్ఞానంతో కంపెనీలు పెట్రో బంకుల యూనిట్లను తయారు చేశాయి.
అయినా మోసాలు ఆగలేదు. ఏడాదికో రెండేళ్లకో తూనికలు–కొలతల శాఖ అధికారులు జరుపుతున్న దాడుల్లో మన రాష్ట్రంతోపాటు దేశవ్యాప్తంగా పెట్రోల్ బంకుల్లో చిప్‌లు అమర్చి మోసాలకు పాల్పడుతున్న ఉదంతాలు వెలుగుచూస్తూనే ఉన్నాయి. ఎందుకంటే పెట్రో మోసాలకు పాల్పడుతున్న ముఠాలు రివర్స్ ఇంజనీరింగ్ టెక్నాలజీతో సమర్థంగా బురిడీకొట్టిస్తున్నాయి. ఈ దందాకు పెట్రోల్ బంకుల యూనిట్లను ఉత్పత్తి చేసే కంపెనీల్లోని కొందరు నిపుణులు కూడా సహకరిస్తున్నట్లు దర్యాప్తులో తేలింది.
బంకుల లీజులు.. ఆపై మోసాలు..
పెట్రోల్ బంకుల్లో భారీ మోసాలకు పాల్పడుతున్న ముఠాలు మన రాష్ట్రంలోని గుంటూరుజిల్లాలోని పల్నాడు ప్రాంతంలోనూ, ప్రకాశం జిల్లాలోని ముండ్లమూరు మండలంలోనూ, హైదరాబాద్‌లలోనూ ఉన్నాయి. సుదీర్ఘకాలం పెట్రోల్ బంకుల్లో పని చేసిన కొందరు అందులో లోటుపాట్లు పసిగట్టారు. వారే ఒక గ్రూపుగా ఏర్పడి వీరు పెట్రోల్ బంకుల యూనిట్లు తయారు చేసే కంపెనీల్లోని కొందరు సాంకేతిక నిపుణులు, చైనాలోని ముఠాలతోనూ సంబంధాలు పెట్టుకున్నారు. ఆ ముఠా సభ్యులే ఏపీ, తెలంగాణతోపాటు ఒడిశా, మహారాష్ట్ర, బిహార్ తదితర రాష్ట్రాల్లో పెట్రోల్ బంకులను లీజుకు తీసుకోవడం మొదలుపెట్టారు. భారీ లీజు మొత్తం ఆశ చూపిస్తుండటంతో బంకుల యజమానులు వారికి తమ బంకులను లీజుకు ఇస్తున్నారు.
పెట్రోలియం కంపెనీలు కొత్త టెక్నాలజీతో బంకుల యూనిట్లను రూపొందించగానే... ఆ కంపెనీలో పనిచేసే కొందరు నిపుణులే ఆ మదర్‌బోర్డ్, పల్సర్ బోర్డ్, కీ బోర్డ్, డిస్‌ప్లే బోర్డులను గుంటూరు, ప్రకాశం, హైదరాబాద్‌లోని ముఠాల వద్దకు పంపిస్తారు. వాటిని ఎలా తయారు చేసిందీ చెబుతారు.
అనంతరం గుంటూరు, ప్రకాశం, హైదరాబాద్‌లోని ముఠాలు పెట్రో బంకు యూనిట్ల మదర్ బోర్డు, పల్సర్ బోర్డ్, కీ బోర్డ్, డిస్ ప్లే బోర్డ్‌లను ఏకంగా చైనాకు పంపుతున్నాయి. అక్కడ సాంకేతిక నిపుణులతో వ్యవస్థీకృతమైన అతి పెద్ద ముఠాలు ఆ బోర్డులను క్షుణ్ణంగా పరిశీలిస్తాయి. ఆ బోర్డులను ఎలా తయారు చేశారన్నది రివర్స్ ఇంజనీరింగ్ విధానం ద్వారా తెలుసుకుంటాయి. అనంతరం వాటిలో ఎక్కడ ఎలాంటి చిప్‌పెడితే మోసం చేయొచ్చనేది కనిపెడతాయి. ఆ విషయాన్ని ఇక్కడి ముఠాలకు చేరవేస్తాయి.
అనంతరం ఇక్కడి ముఠాలు ఆ మేరకు స్థానికంగా ఉన్న నిపుణులతో తాము లీజుకు తీసుకున్న పెట్రోల్ బంకుల యూనిట్లలో ఆ చిప్‌లను అమర్చి భారీ మోసాలకు పాల్పడుతున్నాయి. అందుకే యజమానులు నిర్వహిస్తున్న బంకుల్లో కంటే లీజుకు ఇచ్చిన పెట్రోల్ బంకుల్లోనే ఎక్కువగా మోసాలు జరుగుతున్నట్టు అధికారుల దర్యాప్తులో వెల్లడైంది. బంగ్లాదేశ్, పాకిస్తాన్, శ్రీలంక మొదలైన దేశాల్లో కూడా ఇదే రీతిలో భారీగా పెట్రోల్ మోసాలకు పాల్పడుతున్నారని అధికారులు చెబుతున్నారు.
కొత్తగా రిమోట్ కంట్రోల్..
అధికారుల తనిఖీలు, దాడులు నిరంతరాయంగా జరుగుతుండడంతో దీనినుంచి తప్పించుకోవడం కోసం మరో కొత్త వ్యవస్థనుకూడా ఈ ముఠాలు కనుక్కున్నాయి. పెట్రోల్ బంకుల్లో మదర్ బోర్డ్, పల్సర్ బోర్డ్, డిస్ ప్లే బోర్డులలో చిప్‌లు ఏర్పాటు చేసి ట్యాంపర్ చేస్తున్న ముఠాలు వాటని్నంటికి కేంద్రీకృత వ్యవస్థను రూపొందించి దానిని ఓ రిమోట్ కంట్రోల్‌కు అనుసంధానిస్తున్నాయి. తనిఖీలకు అధికారులు రాగానే వెంటనే ఆ రిమోట్ కంట్రోల్‌తో ఆ బోర్డులన్నీ సాధారణ స్థితికి వచ్చేట్టుగా మేనేజ్ చేస్తున్నాయి. దాంతో చాలా పెట్రోల్ బంకుల్లో మోసాలు అధికారుల తనిఖీల్లో కూడా బయటపడటం లేదు. అధికారులు అంతా ఓకే అని వెళ్లిపోగానే ఆ రిమోట్ కంట్రోల్‌ను ఆన్ చేయగానే కొలతను కంట్రోల్ చేసే చిప్ పనిచేయడం ప్రారంభిస్తుంది.
రాష్ట్రంలో రోజుకు రూ.2కోట్లపైనే దోపిడీ...
చిప్‌లు అమర్చడం ద్వారా 10 లీటర్ల పెట్రోల్‌కు అర లీటరు నుంచి లీటరున్నరవరకు దోపిడీ చేస్తున్నట్టుగా గుర్తించారు. పెట్రోల్‌కు త్వరగా ఆవిరయ్యే గుణం ఉంది కాబట్టి 10 లీటర్లకు 50ఎంఎల్ వరకు కొలత తక్కువ రావచ్చని ప్రమాణాలు నిర్దేశించారు. కాగా చిప్‌లు అమర్చిన బంకుల్లో 10 లీటర్లకు అర లీటరు నుంచి లీటరున్నర వరకు తక్కువ కొలుస్తున్నారు. ఎవరికీ సందేహం రాకుండా ఉండేందుకు ఎక్కువగా 10 లీటర్లకు లీటరు వరకు మోసానికి పాల్పడుతున్నారు. సాధారణంగా ఏకకాలంలో పెద్ద సంఖ్యలో బంకులపై దాడులు నిర్వహిస్తే 5శాతం బంకుల్లో చిప్‌లు అమర్చి మోసాలకు పాల్పడుతున్నట్టు గత రికార్డులు తెలుపుతున్నాయి.
♦మన రాష్ట్రంలో వివిధ కంపెనీలకు చెందిన మొత్తం 3,878 పెట్రోల్ బంకులు ఉన్నాయి. వాటిలో పెట్రోల్ విక్రయించే పెట్రోల్ యూనిట్లు దాదాపు 15వేలు ఉన్నాయి.
♦రోజుకు దాదాపు 1.20 కోట్ల లీటర్ల పెట్రోల్, 2.70కోట్ల లీటర్ల డీజిల్ విక్రయిస్తున్నారు. అంటే మొత్తం దాదాపు 4కోట్ల లీటర్ల పెట్రోలియం ఉత్పత్తులు అమ్ముతున్నారు.
♦సగటున 200 పెట్రోల్ బంకుల్లో మోసం చేస్తున్నారని భావించినా సరే వాటిలో మొత్తం మీద రోజుకు 20.63 లక్షల లీటర్ల పెట్రోలియం ఉత్పత్తులు విక్రయిస్తున్నారు.
♦చిప్‌లు అమరిస్తే పది లీటర్లకు సగటున లీటరు మోసం చేస్తున్నారని లెక్కించినా సరే ... 20.63లక్షల లీటర్లకు 2.06లక్షల లీటర్లు మోసం చేస్తున్నట్టు.
♦ప్రస్తుత ధర ప్రకారం లీటరుకు సగటున రూ.100 ధర వేసుకున్నా సరే రోజుకు రూ.2.06కోట్లు అక్రమంగా ఆర్జిస్తున్నారు. మన రాష్ట్రంలో అంచనా ఇలా ఉంటే ఇక దేశ వ్యాప్తంగా ఏ స్థాయిలో పెట్రోల్ బంకుల్లో యథేచ్ఛగా దోపిడీకి పాల్పడుతున్నారో ఊహించవచ్చు.
బంకుల్లో సిబ్బంది మోసాలు సరేసరి....
చాలా పెట్రోల్ బంకుల్లో సిబ్బంది కూడా మోసం చేస్తున్నారు. బంకుల్లో రెండు డిస్పాచ్ పంపులు, రెండు డిస్‌ప్లేలు ఉంటాయి. ఓ డిస్‌ప్లేలో ‘సున్నా’ చూపిస్తూ ఆ పంపు నుంచి కాకుండా మరో డిస్పాచ్ పంపు నుంచి పెట్రోల్/ డీజిల్ పోస్తారు.
♦కార్లు, ఇతర పెద్ద వాహనాల్లో పెట్రోల్/డీజిల్ కొంత వరకు నింపిన తరువాత పైప్ బయటకు తీసి మరో వాహనం వస్తే అందులో నింపుతున్నారు. కారు, ఇతర వాహనాల్లో ఉన్నవారు డిస్‌ప్లే బోర్డునే చూస్తున్నారు. వారి కారు సైడ్ మిర్రర్‌కు ఆయిల్ ట్యాంకర్‌కు మధ్యలో ఒకరు వచ్చి అడ్డుగా నిలబడతారు.
♦బంకులో సిబ్బంది పెట్రోల్ పూర్తిగా పోసే వరకు వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలి. దృష్టి మళ్లించకూడదు.
♦పెట్రోల్ నాణ్యతపై సందేహం ఉంటే వెంటనే ఫిల్టర్ చెక్ చేయమని అక్కడి సిబ్బందిని డిమాండ్ చేయాలి. పెట్రోల్ నాణ్యతను పరీక్షించడానికి పెట్రోల్ బంకుల వద్ద ఫిల్టర్ పేపర్లు అందుబాటులో ఉంచాలి. వాటిపై పెట్రోల్ ఒక చుక్క వేయగానే పూర్తిగా ఆరిపోయి మరక కూడా కనిపించకూడదు. అలా అయితేనే ఆ పెట్రోల్ నాణ్యమైనది. మరక కనిపిస్తే కల్తీ చేసినట్టు భావించాలి.
డీలర్లు చేయాల్సినవి...
♦పెట్రోల్‌బంకుల్లో పంపుల(నాజల్)లను రోజూ తనిఖీ చేయాలి. ఠి పెట్రోల్ సాంద్రతను రోజూ నమోదు చేయాలి.
♦వినియోగదారులకు సందేహం వస్తే వారి సమక్షంలోనే నిర్దేశించిన 5 లీటర్ల క్యాన్‌లో పెట్రోల్ నింపి పరీక్షచేయాలి.
♦వినియోగదారులు ఫిర్యాదు చేయాలని భావిస్తే అందుకు సంబంధించిన అధికారుల నంబర్లను పెట్రోల్ బంకుల్లో ప్రదర్శించాలి.
♦పెట్రోల్ మోసాలపై తూనికలు, కొలతల శాఖ టోల్‌ఫ్రీ నంబరు 18004254202ను అందుబాటులోకి తెచ్చింది.
♦ఆన్‌లైన్‌లో కూడా ఫిర్యాదులు చేసేందుకు clm&ap@nic.in వెబ్‌సైట్‌ను రూపొందించింది.
పెట్రోల్ బంకుల మోసాలపై కఠిన చర్యలు తీసుకుంటాం
పెట్రోల్ బంకుల్లో మోసాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించం. చిప్‌లు అమర్చడం, ఇతరత్రా విధానాలతో పెట్రోల్ బంకుల్లో మోసాలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. అందుకోసం తరచూ ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నాం. గత ఏడాది సెప్టెంబరులో రాష్ట్రవ్యాప్తంగా తూనికలు, కొలతల శాఖ దాడులు నిర్వహించింది. ప్రస్తుతం కరోనా వ్యాప్తి తగ్గడంతో మళ్లీ తనిఖీలు ముమ్మరం చేయడానికి కార్యాచరణ రూపొందించాం.
– కేఆర్‌ఎం కిశోర్ కుమార్, కంట్రోలర్, తూనికలు –కొలతల శాఖ
మోసాలను అరికట్టడానికి పటిష్ట చర్యలు
పెట్రోల్ బంకుల్లో మోసాలను కట్టడి చేయడానికి తూనికలు–కొలతల శాఖ పటిష్ట చర్యలు తీసుకుంటోంది. పెట్రోల్, డీజిల్ కొలత, నాణ్యత సక్రమంగా ఉన్నాయా లేదా అని నిర్ధారించడానికి 10 రకాల తనిఖీలు నిర్వహిస్తున్నాం. అందుకోసం ఫ్లయింగ్ స్వా్కడ్లు, ఇతర తనిఖీ బృందాలను నియోగించాం. వాహనదారులు ఫిర్యాదు చేసేందుకు టోల్‌ఫ్రీ నంబరు ప్రవేశపెట్టడంతోపాటు ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేసేందుకు కూడా అవకాశం కల్పించాం.
– రామ్‌కుమార్, జాయింట్ కంట్రోలర్, తూనికలు –కొలతల శాఖ
చదవండి:
గణేష్ ఉత్సవాల్లో విషాదం: డ్యాన్స్ చేస్తూ కుప్పకూలిపోయాడు
Comments
Please login to add a commentAdd a comment