విశాఖలో ఎస్‌టీపీఐ సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ | STPI To Soon Launch Centre of Excellence in Visakha | Sakshi
Sakshi News home page

విశాఖలో ఎస్‌టీపీఐ సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌

Published Mon, Jun 14 2021 9:14 AM | Last Updated on Mon, Jun 14 2021 9:14 AM

STPI To Soon Launch Centre of Excellence in Visakha - Sakshi

సాక్షి, అమరావతి: నాలుగో పారిశ్రామిక విప్లవంలో భాగంగా కొత్త టెక్నాలజీని అభివృద్ధి చేసేందుకు దేశంలోనే తొలి ఇండ్రస్టియల్‌–4 సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ (సీవోఈ) రాష్ట్రంలో ఏర్పాటవుతోంది. అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఉత్పత్తులు పెంచడానికి ఇది ఉపయోగపడనుంది. విశాఖపట్నం రాష్ట్రీయ ఇస్పాత్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఐఎన్‌ఎల్‌)లో ఎల్రక్టానిక్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని సాఫ్ట్‌వేర్‌ టెక్నాలజీ పార్క్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌టీపీఐ).. ఈ సీవోఈని ఏర్పాటు చేస్తోంది. ఎస్‌టీపీఐ ఏర్పాటు చేసి 30 ఏళ్లు పూర్తయిన సందర్భంగా దేశవ్యాప్తంగా వివిధ టెక్నాలజీలను అభివృద్ధి చేయడానికి 12 సీవోఈలను ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్‌టీపీఐ డైరెక్టర్‌ ఓంకార్‌ రాయ్‌ తెలిపారు. ఇందులో భాగంగా అత్యంత కీలకమైన ఇండస్ట్రీస్‌–4 సీవోఈ విశాఖలో ఏర్పాటవుతోంది. 

వ్యయాలను తగ్గించే టెక్నాలజీ అభివృద్ధి 
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఇండస్ట్రీ–4 టెక్నాలజీ అభివృద్ధిలో లక్సెంబర్గ్‌ ముందంజలో ఉందని, ఇప్పుడిదే స్థాయిలో విశాఖలో సీవోఈని ఏర్పాటు చేస్తున్నామని ఎస్‌టీపీఐ విశాఖ జాయింట్‌ డైరెక్టర్‌ ఎంపీ దుబే ‘సాక్షి’కి వివరించారు. ముఖ్యంగా ఉక్కు, అల్యూమినియం, విద్యుత్‌ ఉత్పత్తి వంటి భారీ పరిశ్రమల్లో ఆటోమేషన్‌ పెంచడం ద్వారా ఉత్పత్తి వ్యయాలను తగ్గించే సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధిపై ఈ సీవోఈ దృష్టిసారిస్తుందన్నారు. ఈ రంగంలో ప్రపంచ స్థాయి సాఫ్ట్‌వేర్‌ ఉత్పత్తులను రూపొందించడానికి ఎల్రక్టానిక్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ అండదండలు అందిస్తుందని తెలిపారు.

ఈ కేంద్రం ఏర్పాటు ద్వారా రాష్ట్రం భారీ పెట్టుబడులను ఆకర్షిస్తుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఆత్మనిర్భర్‌ భారత్‌లో భాగంగా ప్రపంచ దేశాలకు కొత్త సాంకేతిక పరిజ్ఞానాలను అందించే విధంగా ఉత్పత్తులను తయారు చేయడానికి ఈ సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌లు ఉపయోగపడతాయన్నారు. సుమారు రూ.20 కోట్ల వ్యయంతో 6,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేస్తున్న ఈ సీవోఈ త్వరలోనే అందుబాటులోకి వస్తుందని చెప్పారు. కాగా, ప్రస్తుతం ఎస్‌టీపీఐ 13 సీవోఈలను కలిగి ఉండగా.. ఇప్పుడు మరో 12 సీవోఈలను ఏర్పాటు చేస్తోంది. ఎస్‌టీపీఐ ఇండియా.. బీపీవో స్కీమ్‌ ద్వారా దేశంలోనే తొలిసారిగా 10,365 మందికి ఉపాధి కల్పించి రికార్డు సృష్టించినట్టుగా.. ఈ సీవోఈ ఏర్పాటు ద్వారా విశాఖకు ప్రపంచ స్థాయి గుర్తింపు వస్తుందన్న ఆశాభావాన్ని దుబే వ్యక్తం చేశారు.

చదవండి: విపత్తుల్లోనూ 'పవర్‌'ఫుల్‌  
నిత్య పెళ్లికూతురు కేసులో మరో మలుపు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement