లంబసింగి స్ట్రాబెర్రీ జామ్‌: జుర్రుకుని తినేయొచ్చు  | Strawberry Jam from Lambasingi | Sakshi
Sakshi News home page

లంబసింగి స్ట్రాబెర్రీ జామ్‌: జుర్రుకుని తినేయొచ్చు 

Published Mon, Apr 12 2021 4:37 AM | Last Updated on Sun, Oct 17 2021 3:22 PM

Strawberry Jam from Lambasingi - Sakshi

స్ట్రాబెర్రీలను ప్యాకింగ్‌ చేస్తున్న మహిళలు

తాడేపల్లిగూడెం: బ్రెడ్‌కి జామ్‌ రాసుకొని తింటే మహా రుచిగా ఉంటుంది. చాలా మందికి ఇది అల్పాహారం. బ్రెడ్డే కాదు.. ఇంకా చాలా ఆహార పదార్ధాలతో జామ్‌ తినొచ్చు. ఇందుకు మార్కెట్లో చాలా రకాల జామ్‌లు దొరుకుతాయి. కానీ.. మన రాష్ట్రంలోని లంబసింగి నుంచి వచ్చే జామ్‌ ప్రత్యేకమైనది. ఎందుకంటే.. ఇది అక్కడి రైతులు పండించిన స్ట్రాబెర్రీ నుంచి తయారు చేసినది. ఈ జామ్‌ మిగతా వాటికంటే సూపర్‌ టేస్ట్‌. మృదుఫలంగా పిలిచే స్ట్రాబెర్రీని జామ్‌లా జుర్రుకు తినొచ్చు. ఇదెలా సాధ్యమైందంటే.. 

విశాఖ జిల్లా చింతపల్లి మండలంలోని మన్యం గ్రామాలైన లంబసింగి, రాజుపాక గ్రామాల రైతులు స్ట్రాబెర్రీ పండించడంలో దిట్టలు. మూడేళ్లుగా రికార్డు స్థాయిలో పంట దిగుబడి సాధిస్తున్నారు. లంబసింగి ప్రాంతాలకు వచ్చే పర్యాటకులకు స్ట్రాబెర్రీ పండ్లను విక్రయిస్తూ మంచి ఆదాయాన్ని గడిస్తున్నారు. కోవిడ్‌ కారణంగా గతేడాది లంబసింగి ప్రాంతానికి పర్యాటకుల రాక తగ్గింది. దీంతో స్ట్రాబెర్రీ విక్రయాలకు తీవ్ర అవరోధం కలిగింది. పండ్లను పారబోసుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. భారీగా పెట్టుబడులు పెట్టిన రైతులు అయోమయంలోకి వెళ్లారు.

ఈ విషయం వెంకట్రామన్నగూడెంలోని డాక్టర్‌ వైఎస్సార్‌ ఉద్యాన విశ్వవిద్యాలయ ఉప కులపతి డాక్టర్‌ తోలేటి జానకిరామ్, పరిశోధన సంచాలకులు డాక్టర్‌ ఆర్‌వీఎస్‌కే రెడ్డి, పోస్ట్‌ హార్వెస్ట్‌ టెక్నాలజీ విభాగ అధిపతి డాక్టర్‌ డి.వెంకటస్వామి దృష్టికి వచ్చింది. వారు స్ట్రాబెర్రీ రైతుల సమస్యకు పరిష్కారాన్ని కనుగొన్నారు. రైతులు పండించిన స్ట్రాబెర్రీలను వెంకట్రామన్నగూడెంలోని పోస్ట్‌ హార్వెస్ట్‌ టెక్నాలజీ విభాగానికి రప్పించారు. వాటిని ఇక్కడ సహజ విధానాలతో శుభ్రం చేయించి, తాజా పండ్లకు వాణిజ్య హంగులు అద్ది ప్యాకింగ్‌ చేసి విక్రయించే ఏర్పాట్లు చేశారు. అయినప్పటికీ మిగిలిపోయిన పండ్లను గుజ్జుగా మార్చారు. ఆ గుజ్జును పంచదారతో మిశ్రమం చేసి జామ్‌గా తయారు చేశారు. దానిని సీసాల్లో పోసి అందంగా ప్యాకింగ్‌ చేశారు. లంబసింగి రైతులు పండించిన తాజా స్ట్రాబెర్రీలను వినియోగించడంతో 250 గ్రాముల జామ్‌ బాటిల్‌ ధర రూ.250 ధర పలికింది. అంటే కిలోకు రూ.వెయ్యి దక్కింది. 
స్ట్రాబెర్రీ ప్రాసెసింగ్‌ను పరిశీలిస్తున్న ఉద్యాన వర్సిటీ వీసీ జానకిరామ్, పోస్ట్‌ హార్వెస్ట్‌ టెక్నాలజీ విభాగాధిపతి డాక్టర్‌ డీవీ స్వామి 

ఎకరానికి రూ.2.20 లక్షల లాభం 
ఎకరానికి 800 కేజీల స్ట్రాబెర్రీ పండ్ల దిగుబడి వస్తుంది. ఆ పండ్లను కిలో రూ.150 చొప్పున విక్రయిస్తుంటారు. ఆ విధంగా పండ్లను నేరుగా విక్రయిస్తే రైతుకు రూ.1,20,000 ఆదాయం లభిస్తుంది. కానీ.. ఆ పండ్ల నుంచి గుజ్జు (పల్ప్‌) తీస్తే 546 కిలోలు వస్తుంది. దీనిని ప్రాసెసింగ్‌ చేసి 250 గ్రాముల చొప్పున బాటిల్‌ ప్యాకింగ్‌ చేయించాం. 2,025 బాటిల్స్‌ వచ్చాయి. రిటైల్‌ మార్కెట్‌లో 250 గ్రాముల స్ట్రాబెర్రీ జామ్‌ సీసా రూ.250 పలుకుతోంది. రైతులు గుత్తగా ఒక్కో సీసాను రూ.175 చొప్పున విక్రయించగా.. రైతుకు రూ.3,54,375 ఆదాయం లభించింది.

సాగుతోపాటు రవాణా, ఇతర అన్నిరకాల ఖర్చులు కలిపి రూ.1,35,000 అయినట్టు అంచనా వేశారు. ఖర్చులన్నీ పోను రైతుకు ఎకరానికి రూ.2.20 లక్షల నికరాదాయం లభించినట్టు తేల్చారు. పండ్లగా విక్రయించడం కంటే.. జామ్‌ రూపంలో విక్రయిస్తే ఎకరానికి అదనంగా రూ.లక్ష వరకు అదనపు ఆదాయం వస్తుంది. పండ్లగా విక్రయించే సందర్భంలో అవి కుళ్లిపోయినా.. ధర తగ్గినా.. పండ్లు అమ్ముడుకాకపోయినా ఆ మేరకు రైతు నష్టపోతాడు. జామ్‌ చేయడం వల్ల ఒక్క పైసా కూడా నష్టం ఉండదు. పైగా ఇది 9 నెలలు నిల్వ ఉంటుంది. 

రైతులకు మేలు చేయగలిగాం 
రైతులు పండించిన పంటలకు వాణిజ్య విలువలు తీసుకురావడంలో డాక్టర్‌ వైఎస్సార్‌ ఉద్యాన విశ్వవిద్యాలయం ముందుంటోంది. లంబసింగి రైతుల సమస్యను తెలుసుకుని స్ట్రాబెర్రీలను వర్సిటీ ఆధ్వర్యంలో జామ్‌గా తయారు చేయించి వారికి మేలు చేయగలిగాం.     
– డాక్టర్‌ తోలేటి జానకిరామ్, ఉప కులపతి, వైఎస్సార్‌ ఉద్యాన వర్సిటీ 

ఆనందంగా ఉంది 
లంబసింగి రైతులు పండించిన స్ట్రాబెర్రీలను జామ్‌గా మార్చడానికి సహకారం అందించినందుకు ఆనందంగా ఉంది. వీసీ, పరిశోధన సంచాలకులతో కలిసి జామ్‌ తయారు చేయించి రైతులకు లాభాలు వచ్చేలా చూడగలిగాం.     
– డాక్టర్‌ డీవీ స్వామి, విభాగాధిపతి, పోస్ట్‌ హార్వెస్ట్‌ టెక్నాలజీ  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement