ఈ చిత్రంలోని చలానాను నన్నూరుకు చెందిన రవీంద్రబాబు ఎస్‌బీఐ ట్రెజరీ బ్యాంకులో ఆగస్టు 24న భూమి రిజిస్ట్రేషన్ కోసం రూ.11,580 కట్టి తీసుకున్నాడు. చలానా మొత్తం ఆన్‌లైన్‌లో సక్సెస్ అయినట్లు బ్యాంకు అధికారులు రసీదు ఇచ్చి పంపారు. దాన్ని తీసుకొని రిజిస్ట్రేషన్ కోసం రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్తే చలానా వివరాలు డిస్ ప్లే కావడం లేదంటూ సబ్ రిజిస్ట్రార్ తిరస్కరించారు. ‘వారం రోజులవుతుంది. చలానా కాల పరిమితి సెప్టెంబర్ 5 వరకే ఇచ్చారు. ఇక రెండు రోజులే ఉంది. ఎవరిని అడిగినా సరైన సమాధానం చెప్పడం లేదు.’ అంటు బాధితుడు వాపోతున్నాడు. రిజిస్ట్రేషన్ శాఖలో చలానాల కుంభకోణం తరువాత తీసుకున్న చర్యలతో నెలకొన్న పరిస్థితి ఇది.
సాక్షి, కర్నూలు(సెంట్రల్): కర్నూలు, నంద్యాల జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలో 24 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలున్నాయి. అన్ని చోట్లా ఇదే పరిస్థితి. సీఎఫ్‌ఎంఎస్ లాగిన్‌లో విక్రయదారులు చెల్లించిన పలు చలానాల వివరాలు డిస్‌ప్లే కాకపోవడంతో సబ్ రిజిస్ట్రార్లు రిజిస్ట్రేషన్లను తిరస్కరిస్తున్నారు. బ్యాంకులకు వెళ్లి వివరణ కోరాలని చెప్పి పంపుతున్నారు. అక్కడికి వెళ్తే చలానా మొత్తం రిజిస్ట్రేషన్ శాఖ ఖాతాలకు వెళ్లిందని, పదే పదే రావద్దని గట్టిగా చెప్పి పంపుతున్నారు. ఫలితంగా ఎవరిని అడగాలో తెలియక, ఏమి చేయాలో తోచక క్రయ, విక్రయదారులు ఆందోళన చెందుతున్నారు. చలానా కాల పరిమితి దాటిపోతే మరోసారి డబ్బు చెల్లించి చలానా తీసుకోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకటీ రెండు రోజులైతే ఏమో అనుకోవచ్చు. దాదాపు 15 రోజుల క్రితం చెల్లించిన చలానాలు సైతం యాక్టివ్ కాకపోవడమేమిటని బాధితులు ప్రశ్నిస్తున్నారు.
అసలు ఏమి జరిగిందంటే..
రాష్ట్రవ్యాప్తంగా రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖలో వెలుగులోకి వచ్చిన చలానాల కుంభకోణం తరువాత అధికారులు సర్వర్‌లో మార్పులు చేశారు. గతంలో ఆన్‌లైన్‌లో చెల్లించిన చలానాల నంబర్లను సీఎఫ్‌ఎంఎస్(కాంప్రెహెన్సివ్ ఫైనాన్సియల్ మేనేజ్‌మెంట్ సిస్టమ్) లాగిన్‌లో అప్‌లోడ్ చేస్తే సంబంధిత చలానా మొత్తం డిస్‌ప్లే అయ్యేది కాదు. దీంతో కొందరు తక్కువ మొత్తంలో చలానాలను చెల్లించి ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టారు.
రాష్ట్రవ్యాప్తంగా పెద్ద కుంభకోణం జరిగిందని ఇటీవల ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. చాలా చోట్ల బాధ్యులైన సబ్ రిజిస్ట్రార్లను సస్పెండ్ చేసింది. మరోసారి అక్రమాలకు చోటులేకుండా సీఎఫ్‌ఎంఎస్ సర్వర్‌లో కొన్ని మార్పులు చేసింది. క్రయ, విక్రయదారులు చెల్లించిన సీఎఫ్‌ఎంఎస్ ట్రాన్సాక్షన్ ఐడీ నంబర్ ఎంటర్ చేయగానే లాగిన్‌లో ఎంత మొత్తం చలానా తీశారు? ఏ బ్యాంక్‌లో ఎప్పుడు చెల్లించారనే విషయాలు డిస్‌ప్లే అయ్యేలా మార్పులు చేశారు.
సర్వర్ సమస్య..
ఆన్‌లైన్ చలానాల చెల్లింపులో నెలకొన్న కొత్త సమస్యలకు సీఎఫ్‌ఎంస్ లాగిన్ సర్వరే కారణమని అధికారులు అంటున్నారు. నెట్ స్లోగా ఉండడంతో ఈ సమస్య తలెత్తుతోందని నిపుణులు భావిస్తున్నారు. కాగా ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు 2 ఎంబీ లైన్ స్పీడు బీఎస్‌ఎన్‌ఎల్ నెట్ వర్క్‌ను వేసుకోవాలని చెప్పినా పనులు నిదానంగా కొనసాగుతున్నాయి. దీంతో ఈసీలు తీసుకోవడానికి కూడా రోజుల సమయం పడుతోంది.
రిజిస్ట్రేషన్ నిలిచిపోయింది
నేను కర్నూలులో సైట్ కొన్నాను. అందుకోసం రూ.11,500 చలానా తీశాను. బ్యాంకు అధికారులు దానిపై సక్సెస్ అయినట్లు సీలు వేసి ఇచ్చారు. దానిని తీసుకొచ్చి కల్లూరు సబ్ రిజిస్ట్రార్‌కు చూపితే ఆన్‌లైన్‌లో రావడంలేదని రిజిస్ట్రేషన్ నిలిపేశారు. దాదాపు 10 రోజులవుతోంది. బ్యాంకు అధికారులను అడిగితే సమస్య మావద్ద లేదంటున్నారు. డబ్బు చూపడంలేదని రిజిస్ట్రేషన్ అధికారులు చెబుతున్నారు. దిక్కుతోచడంలేదు. – బాషా, నందికొట్కూరు
Comments
Please login to add a commentAdd a comment